Warangal Street Dogs: వరంగల్‌లో వృద్ధుడిపై వీధి కుక్క దాడితో తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
Warangal Street Dogs: ఓరుగల్లు నగరంలో కుక్కల బెడద వీడటం లేదు. గతంలో కుక్కల దాడి ఘటనలో మరణించిన ఘటనలు ఉండగా, తాజాగా మంగళవారం ఓ వృద్ధుడిపై వీధి కుక్క తీవ్రంగా దాడి చేసింది.
Warangal Street Dogs: వీధి కుక్క దాడిలో వృద్ధుడు తీవ్ర గాయాలు పాలవగా, స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా కుక్కల దాడిలో గాయపడిన వృద్ధుడు రోధించిన తీరు అందరినీ కలచి వేసింది. స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రేటర్ వరంగల్ పరిధి కాశీబుగ్గ ఏరియా సమీపంలోని మోటూరి హనుమంతరావు నగర్ కు చెందిన ఆడెపు నరహరి అనే 70 ఏళ్ల వృద్ధుడు చేనేత వృత్తి చేస్తుంటాడు. బట్టలు నేస్తూ బతికేవాడు.
వయసు మీద పడటం, ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కొంతకాలంగా నరహరి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇదిలాఉంటే మంగళవారం మధ్యాహ్నం ఆయన ఇంట్లో పడుకోగా, అంతలోనే కరెంట్ కట్ అయ్యింది. దీంతో ఆయన ఆరు బయట కాసేపు కూర్చుందామని ఇంటి బయటకు వచ్చాడు. ఇంటి ముందు కూర్చున్న సమయంలో ఓ వీధి కుక్క అకస్మాత్తుగా వృద్ధుడిపై దాడి చేసింది.
కాళ్లు, చేతులను నోట కరిచి తీవ్రంగా గాయపరిచింది. అంతలోనే ఏం జరుగుతోందో తెలుసుకునే లోగానే కుక్క విపరీతంగా కరిచేసింది. దీంతో వృద్ధుడు కేకలు వేయడంతో ఎంహెచ్ నగర్ లో చుట్టుపక్కల ఉంటున్న వాళ్లు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కను తరిమి కొట్టారు. ఈ క్రమంలో వీధి కుక్క వారిపైనా దాడి చేసే ప్రయత్నం చేసింది. స్థానికులు కర్రలు అందుకోవడంతో అక్కడి నుంచి పారిపోయింది. కాగా కుక్క దాడిలో నరహరికి కాళ్లు, చేతులు, నడుము భాగంలో గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన నరహరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఆఫీసర్లపై మండిపడుతున్న జనాలు
గ్రేటర్ వరంగల్ నగరంలో కుక్కల దాడులు ఏటికేడు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు కనీసం పది దాడులైనా జరుగుతున్నాయి. దీంతో కుక్క కాటుతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రేబిస్ వ్యాక్సిన్ కోసం వస్తున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిత్యం 10 నుంచి 15 మంది బాధితులు కుక్క కాటుతో వ్యాక్సిన్ కోసం ఎంజీఎంకు వస్తున్నట్లు అక్కడి వైద్య సిబ్బంది చెబుతున్నారు.
కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడులు పెరుగుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని మండి పడుతున్నారు. వాస్తవానికి కుక్కల జనాభా నియంత్రణకు వరంగల్ లో యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) సెంటర్ ఉండగా, అందులో అనుకున్న రీతితో స్టెరిలైజేషన్ జరగడం లేదనే ఆరోపణలున్నాయి.
దీంతోనే క్షేత్రస్థాయిలో కుక్కల నియంత్రణ జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ లో కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మరో ఏబీసీ సెంటర్ ఏర్పాటుకు గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అది ఇంకా కార్య రూపం దాల్చలేదు. మొన్నటి వేసవిలోనే రెండో ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా.. అది ఇంకా పట్టా లెక్కలేదు. సిబ్బంది కొరత, నిధుల లేమి కారణంగా రెండో ఏబీసీ సెంటర్ కు అడుగులు పడటం లేదనే అభిప్రాయాలు వినిపిస్తుండగా, గ్రేటర్ వరంగల్ పాలక వర్గం కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)