Eatala Rajender : పార్లమెంట్ ఎన్నికల బరిలో 'ఈటల' - ఈ స్థానంపైనే ఆశలు...!
BJP Eatala Rajender: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారుతున్నాయి. బీజేపీలో కీలకంగా ఉన్న ఈటల రాజేందర్… మరోసారి లోక్ సభ బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు.
BJP Eatala Rajender: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మెజార్టీ సీట్లలో పాగా వేయాలని భావిస్తున్నాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు చేస్తుండగా…. బీఆర్ఎస్ కూడా అదే పనిలో ఉంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో సంచలన విజయాలను అందుకున్న భారతీయ జనతా పార్టీ… ఈ ఎన్నికలపై భారీగా ఆశలు పెట్టుకుంది. తెలంగాణలోని 17 స్థానాల్లో పోటీ చేసి 10కి పైగా స్థానాల్లో జెండా ఎగరవేాయలని చూస్తోంది. అందుకు తగ్గట్టే బలమైన అభ్యర్థులను బరిలో దించాలని యోచిస్తోంది.
ఈటల గురి…!
లోక్ సభ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్నబీజేపీలో కీలకంగా ఉన్న ఈటల రాజేందర్ దారి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్ డైలామాలో పడిపోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో…. టికెట్ దక్కించుకుని లోక్ సభలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం తన వంతు ప్రయత్నాలు షురూ చేశారు. ఇదిలా ఉంటే…మరోవైపు ఈటల పార్టీ మారుతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని.. ఉత్తర తెలంగాణలోని ఓ పార్లమెంట్ స్థానం కూడా ఖరారైందన్న చర్చ జోరందుకుంది. అయితే ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు ఈటల రాజేందర్. అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ తనను బయటికి పంపిస్తే… చేర్చుకొని అదరించిన పార్టీ బీజేపీ అని, అలాంటి పార్టీని వీడి బయటికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై కూడా స్పందిస్తున్న ఆయన… తప్పకుండా బరిలో ఉంటానని చెప్పుకొస్తున్నారు. మల్కాజ్ గిరి సీటును ఆశిస్తున్నానని చెబుతూనే… అధినాయకత్వ నిర్ణయమే ఫైనల్ గా ఉంటుందని తన మనసులోని మాటను బయటపెడుతున్నారు.
మరోవైపు మల్కాజిగిరి స్థానానికి ఎక్కువ మంది నేతలు దరఖాస్తులు చేసుకోవటం కూడా ఆ పార్టీలో ఆసక్తికరంగా మారింది. ఈ సీటు కోసం మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాత్రమే కాకుండా…. జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు ఆశిస్తున్నారు. దశాబ్దాలుగా తనకున్న జాతీయస్థాయి అనుభవం, పార్టీతో తనకు ఉన్న అంకితభావం వంటి అంశాలు పరిగణలోకి తీసుకొని పోటీకి అవకాశం ఇవ్వాలని ఆయన అడుగుతున్నట్లు తెలుస్తుంది. వీరే కాకుండా మాజీ ఎంపీ చాలా సురేష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ,బిజెపి రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి,కొంపల్లి మోహన్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కొమరయ్య,బీజేపీ అధికారి ప్రతినిధి తుళ్ళ వీరేంద్ర గౌడ్ కూడా ఈ సీటును ఆశిస్తున్నారు.దీంతో ఈ స్థానం లో ఎవరిని బరిలోకి దింపాలనేది బీజేపీ అధిష్టానానికి అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో జరుగుతుంది.
కీలక నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో... మాజీ మంత్రి ఈటలకు ఛాన్స్ దొరుకుతుందా లేదా అనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. ఈ సీటు కాకుండా… మరేదైనా సీటును ఈటలకు బీజేపీ ఆఫర్ చేస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది…!