Minister Gangula : ఈటలకు దమ్ముంటే గజ్వేల్‌లో మాత్రమే పోటీ చేయాలి
Minister Gangula Kamalakar: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ఫైర్ అయ్యారు మంత్రి గంగుల కమలాకర్. ఈటలకు దమ్ముంటే గజ్వేల్ ఒక చోటు నుంచే పోటీ చేయాలని సవాల్ విసిరారు.
Minister Gangula Kamalakar: బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పై గజ్వేల్ లో మాత్రమే పోటీచేయాలని సవాల్ విసిరారు మంత్రి గంగుల కమలాకర్. హుజురాబాద్ లో పోటీచేస్తున్నాడంటే ఓడిపోతాననే భయం ఆయనను వెంబడిస్తుందన్నారు.
శుక్రవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంతో పాటు… కరీంనగర్ రూరల్ మండలంలో పర్యటించారు మంత్రి గంగుల. యువకులు, ఇతర పార్టీల నాయకులు పెద్దఎత్తున మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. మంత్రి గంగుల కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై రెండు చోట్ల పోటీ చేస్తానని చెప్పిన ఈటెల గజ్వేల్ తో పాటు హుజురాబాద్ లో పోటీచేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈటెలకు దమ్ముంటే కేసీఆర్ పై గజ్వేల్ ఒక్క స్థానంలోనే పోటీచేయాలని సవాల్ విసిరారు. బీజేపీకి తెలంగాణాలో గుండు సున్నా వస్తే ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడని ఎద్దేవా చేశారు. సమైక్య పాలనలో పల్లెలు నీళ్ళు లేక అన్నదాతలు అష్టకష్టాలు పడిన పరిస్థితి నుంచి నేడు స్వయం పాలనలో కాళేశ్వరం జలాలతో పల్లెలు జలకళ సంతరించుకున్నాయన్నారు.
కోట్ల రూపాయల అభివృద్ధితో గ్రామాల రూపురేఖలు మార్చామని అన్నారు మంత్రి గంగుల. సీఎం కేసీఆర్ సాకారంతో వందల కోట్ల రూపాయల నిధులను తెచ్చి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఆనాడు గ్రామాల్లోకి రావాలంటే రోడ్లు లేక ఇబ్బందులు పడ్డ పరిస్థితి నుంచి… ఇవాళ కోట్ల రూపాయలతో అధ్బుతంగా రహదారుల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. కేసీఆర్ లేని తెలంగాణను ఊహిచుకొలేమని వ్యాఖ్యానించారు. తనకు అభివృద్ధి తప్ప మరో ఆలోచన లేదని, మీ భవిష్యత్ బాధ్యత తనదేనని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉందని… బీజేపీ, కాంగ్రెస్ నాయకుల రూపంలో మళ్ళీ ఆంధ్రా నాయకులు వస్తున్నారన్నారు. కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ ను మళ్ళీ ఆంధ్రాలో కలిపే ప్రయత్నం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.