Bathukamma Festival 2022 : బతుకమ్మ పండగ ఎనకట ఎట్లా చేశేటోళ్లం.. గిప్పుడెట్లుంది?
Telangana Bathukamma Festival : బతుకమ్మ తెలంగాణ అస్తిత్వం. గిప్పుడు ఏ పల్లెకుపోయిన బతుకమ్మ పాటే. ఏ చెట్టు కింద కూసున్నా ఆ ముచ్చటే. బతుకమ్మ పండగ.. అప్పట్ల ఎట్లా జరుపుకొనేది. గిప్పుడు రాను రాను ఏమైంది? ఎట్లా చేసుకునేటోళ్లం.. ఇప్పుడు ఎట్లా జేస్తనాం?
బతుకమ్మ పండుగ అచ్చిందంటే మనసుల చెప్పలేని సంతోషమయితది. తొమ్మిది దినాలు.. ఊరంతా ఉమ్మడి కుటుంబంలా కనిపిస్తది. మూలన కూసున్న ముసల్ది.. ఓ బిడ్డా ఎప్పుడొచ్చినవ్.. అంత బాగేనా అని అడుగుతుంటే ఊరంతా ఒక్కటై వచ్చిందెవలూ అని చెవులు పెట్టి ఇంటది. అయితే గీ పలకరింపులు ఇప్పటికీ ఉన్నాయి.. గానీ.. బతుకమ్మ ఆటతీరు గట్లనే ఉన్నదా? ఎంత మార్పు వచ్చే? ఎనకట పెద్దోళ్లు ఎట్లా ఆడేది.. అసలు బతుకమ్మ పండగ అంటేనే పొద్దుగాల పోరోన్ని లేపి పూలకు పంపుడుతో మెుదలయ్యేది? పూలకు పోకుంటే ఆ దినం.. ఇంట్ల లొల్లి లొల్లే. ఆడబిడ్డ అలుగుడే. అది చూసి నాయినా పొద్దుందాకా గులుగుడే. ఇట్లా ఉండేది ప్రతీ ఇంట్ల తీరు.
'ఇంట్ల ఆడబిడ్డ పొద్దున్నే లేస్తుండే.. అమ్మా తమ్మున్ని లేపే.. తంగేడు, గునుగు పువ్వు తీసుకురమ్మనే అనే మాట ప్రతి ఒక్కలి ఇంట్ల వినవస్తుండే. ఆల్సెం గిట్ల అయితే పువ్వు దొర్కదు నేనే బతుకమ్మ కాడికి రానే రాను పో అని అలుగుడు. బిడ్డ మనసు తెలిసిన అమ్మ దగ్గరకు పోయి.. కొడుకా లే బిడ్డా. జల్ది లేసి తంగేడుపువ్వు పట్టుకురాపో. పువ్వు దొర్కకపోతే అక్క ఏడుస్తది. ఆల్సెం అయితే.. ఒక్క పువ్వు గూడా కనిపియ్యది. గిప్పటికే ఊళ్లొ పొరగాళ్లంతా.. పోయిర్రు. లే బిడ్డా. అరే.. దోస్తు వాస్తవారా.. తంగెడు పువ్వుకు పోతున్న రారాదు. ఒక్కన్నేం పోవాలే. ఓ నీ మెుఖం గిట్ల వచ్చినంకా కడుగుదువ్ కానీ.. తొందర పోయద్దాం దా.' ఇలా మెుదలయ్యేది పూల కోసం వేట.
ఇగ ఆడికిపోయినంక.. పూలకు ఎగబడుతుంటే.. ఒకరిని చూసి ఒకరు ఉరికొస్తుండే. నేను జూశినారా.. లేదు మెుదట నేను జూశినా.. అని ఒకటే లొల్లి. ఎట్లా అయినా తంగేడు పువ్వును పట్టుకొచ్చేది. తక్కువైతే దోస్తుగాళ్లు.. మనిషికింత ఇచ్చేది. తంగేడు పువ్వును పట్టుకొచ్చిన బిడ్డను జూసి.. తల్లి తెగసంబరపడిపోయేది. నా బిడ్డ ఏదో సాధించిండని మురిసిపోయేది.
గునుగు, తంగేడు పూలతో ఇంట్ల ఆడబిడ్డ బతుకమ్మ పేరుస్తుంటే.. ఇంటికే కల వచ్చేది. లక్ష్మీదేవీ ఇంట్లో కూసుందా అనిపించేది. ఈలపీటతో ఆడబిడ్డ తీరొక్క పూలను కత్తిరిస్తుంటే.. ఇళ్లంతా అటే జూసేది. తీరొక్క రంగులద్ది తప్కులో పేర్చి కచ్చీరుకాడ బతుకమ్మ బంతులు తిరిగి వాగులో నిమజ్జనం చేసేది. వాయినాలు ఇచ్చుకునేదాక ఇంటి ఆడబిడ్డతో అన్నదమ్ములు ఉండేటోళ్లు. బతుకమ్మ ఆడబిడ్డ పండుగనే కాదు ఆడబిడ్డకు తోడుగా అన్నదమ్ములు, అమ్మానాన్నలు చేసుకునే పూల పండుగ.
తరాలు మారాయి.. పండుగ మారింది..
'బిడ్డా గియ్యాల బతుకమ్మ. జర తొందర లే నాయినా. పండుగుపూట గిప్పటి దాకా నిద్రపోతే ఎట్లా బిడ్డా. పొయ్యి తంగెడు పువ్వు తెంపుకొనిరాపో. ఏ పో అమ్మా నేనుపోను. నువ్వే పోయి తెచ్చుకో. లేకుంటే డాడీని అయినా పంపియ్యి. నువ్వే జూస్కో. లేకుంటే.. మూడు బదట్ల కాడ దుకాణంలా దొరుకుతది పో. అల్లుగూడా తక్కువ ధరకే అమ్ముతుర్రు. పోయి చెల్లెనే తెచ్చుకోమ్మను. సాయంత్ర మేం డీజే పెడతానం. రాత్రికి నిద్ర ఉండదు. జర పండుకోనియ్యే.' చాలా ప్రాంతాల్లో గిప్పుడు గిట్లనే తయారైంది.
ఇగ బతుకమ్మ ఆట కాడ పరిస్థితి ఘోరమున్నది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఎవలో ఒకలు పాడుతుంటే మిగతా అందరూ.. బతుకమ్మ సుట్టూ తిరుగుతా కోరస్ పాడేటోళ్లు. చప్పట్లు కొట్టేవాళ్లు. ఇప్పుడు అంతా మారిపోయింది. డీజే పాటలొచ్చినయ్. బతుకమ్మ చుట్టూ తిరుగుడు తక్కువైంది. డ్యాన్స్ చేసుడు ఎక్కువైంది. డీజే పాట ఉంటేనే బతుకమ్మ పండుగ అన్నట్టు కనిపిస్తది. ఈ ముచ్చట.. పట్నాల్లల్లోనే కాదు.. పల్లెల్లోనూ గిట్లనే ఉన్నది.
'మా చిన్నప్పుడు బతుకమ్మ పండుగ మస్తు జరుపుకొనేటోళ్లం. బతుకమ్మ పేరుస్తుంటే.. దోస్తులంతా వచ్చేటోళ్లు. మా ఇంట్ల అయిపోయినంకా.. వాళ్ల ఇంట్లకు పోయేటోళ్లం. ఊరంతా పండుగే. ఇప్పుడు గల్లీగల్లీకి బతుకమ్మ ఆడుతున్నరు. మా ఊళ్లే పెద్దవ్వ పాడుతుంటే.. అంతా కలిసి పాడేటోళ్లం. ఇప్పుడు డీజే పాటలు మాత్రమే వినబడుతున్నాయి.' అని HT Teluguతో మంథనికి చెందిన జడల అపర్ణ అనే మహిళ చెప్పారు.
ఏది ఏమైనా.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి. వారసత్వ పండుగ. చరిత్ర నుంచి వచ్చిన పూల జాతర. నేలను ముద్దాడి, గంగను తాకి.., పుట్ట మన్నును పూజించే తెలంగాణ గడ్డపైన పూలను కొలిచే గొప్ప బతుకు విధానం. బతుకమ్మ సంబురంలో ఆత్మీయ పలకరింపులు, అయిన వాళ్లతో కలిసి ఆనందంగా గడిపే క్షణాలు.. ఇలా ఎన్నో ఎమోషన్స్ దాగి ఉంటాయి.