Bathukamma Festival: ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక మన 'బతుకమ్మ' - సీఎం కేసీఆర్
Batukamma Celebrations in Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
CM KCR Extends Batukamma Wishes: ఈ నెల 25వ(ఆదివారం) తేదీన ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3న సద్దుల బతుకమ్మ జరుపుకోనున్నారు. ఈ తొమ్మిది రోజుల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు.. పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. దాదాపు రూ. 350 కోట్లతో కోటి మంది ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన కోటి చీరెలను బతుకమ్మ కానుకగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల జీవనంలో భాగమైపోయిన "బతుకమ్మ" ఖండాంతరాలకు విస్తరించి తెలంగాణ సంస్కృతిని విశ్వ వ్యాపితం చేసిందన్నారు.
బతుకమ్మ పండుగను జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని ప్రకృతి దేవత బతుకమ్మను సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
ఇదిలా ఉంటే అమావాస్య రోజున మొదటి బతుకమ్మ అడతారు. ఈ సారి అమావాస్య సెప్టెంబర్ 25న వస్తుంది. దీన్ని పెత్తర అమావాస్య అని కూడా అంటారు. కేవలం తెలంగాణలోనే కాదు.. తెలంగాణ ప్రజలు ఉన్న ప్రతి చోటా ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేశవిదేశాల్లోనూ బతుకమ్మ పండగను ఘనంగా జరపుకుంటున్నారు.
బతుకమ్మ 2022 తేదీలు
1. ఆదివారం, సెప్టెంబర్ 25 ఎంగిలి పువ్వు బతుకమ్మ
2. సోమవారం, సెప్టెంబర్ 26 అటుకుల బతుకమ్మ
3. మంగళవారం, సెప్టెంబర్ 27 ముద్దపువ్వు / ముద్దపప్పు
4. బుధవారం, సెప్టెంబర్ 28 నానా బియ్యం
5. గురువారం, సెప్టెంబర్ 29 అట్ల బతుకమ్మ
6. శుక్రవారం, సెప్టెంబర్ 30 అలిగిన / అర్రెము / అలక
7. శనివారం, అక్టోబర్ 1 వేపకాయల బతుకమ్మ
8. ఆదివారం, అక్టోబర్ 2 వెన్నె ముద్దల బతుకమ్మ
9. సోమవారం, అక్టోబర్ 3 సద్దుల బతుకమ్మ (చద్దుల బతుకమ్మ)