Mlc Kavitha : తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు
Mlc Kavitha : హార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురైయ్యారు. ఆమెను దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు.
Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురైయ్యారు. తీహార్ జైలులో ఉన్న ఆమెకు జ్వరం రావడంతో...ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం కవిత అనారోగ్యం పట్ల తీహార్ జైలు సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారుల సూచనతో కవితను జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కవితకు దీన్ దయాల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన ఆమె 100 రోజులకు పైగా జైలులో ఉన్నారు.
నాలుగు నెలలుగా జైలులోనే
గత నాలుగు నెలలుగా జైలులోనే ఉన్న ఎమ్మెల్సీ కవితకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆమె గత కొంత కాలంగా లోబీపీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యులు సూచనతో ఇంటి నుంచే మెడిసిన్ అందిస్తున్నారు. జైలులో కూడా వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇవాళ కవిత మరింత అస్వస్థతకు గురికావటంతో జైలు అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కవిత అనారోగ్య సమస్యలపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. మార్చి 15న హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కవితను మానీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్టు చేసింది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ, ఈడీ కవితపై కేసులు నమోదు చేశాయి. ఈ కేసుల విచారణ కొనసాగుతోంది. దీంతో దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవితకు రిమాండ్ పొడిగిస్తూ వస్తుంది. ఈ కేసులో కవిత బెయిల్ పిటిషన్లు దిల్లీ హైకోర్టులో విచారణలో ఉన్నాయి.
కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇటీవల దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. ఈ కేసులో కవితపై సీబీఐ మరో ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఇరు పక్షాల లాయర్ల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ నెల 22న మరోసారి విచారణ జరుపుతామని జస్టిస్ కావేరి స్పష్టం చేశారు. దిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వచ్చింది. కేజ్రీవాల్ కి బెయిల్ రావడంతో కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావించగా నిరాశ ఎదురైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టుల్లో నిరాశే ఎదురవుతుంది. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోసం ఇటీవల దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆమెకు చుక్కెదురైంది. కవిత బెయిల్ పిటిషన్ ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేశాయి. దీంతో బెయిల్ కోసం ఆమె దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ లు దాఖలు చేశారు.
సంబంధిత కథనం