Vijay Mallya : విజయ్ మాల్యాపై సీబీఐ కోర్టు నాన్‌బెయిలెబుల్ వారెంట్
Non Bailable Warrant Against Vijay Mallya : ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తిరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సీబీఐ కోర్టు విజయ్ మాల్యాకు షాక్ ఇచ్చింది.
ఎనిమిదేళ్ల క్రితం దేశం విడిచి వెళ్లిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాపై మరో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గత వారం ఓపెన్‌ఎండ్ వారెంట్ జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి పొందిన రుణాన్ని అనుకున్న పనికి ఉపయోగించకుండా మరో చోటికి బదిలీ చేశారని, రుణం ఎగ్గొట్టారని మాల్యాపై ఆరోపణలు వచ్చాయి.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి రూ.180 కోట్ల రుణం తీసుకున్న కేసులో విజయ్ మాల్యాపై ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 68 ఏళ్ల విజయ్ మాల్యాపై గతంలో వివిధ కేసుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని సీబీఐ కోర్టు ఓపెన్‌ఎండ్ వారెంట్ జారీ చేసింది. అంటే ఇది గడువు లేని వారెంట్. ఇది మరింత తీవ్రమైన వారెంట్ అవుతుంది.
ప్రస్తుతం లండన్‌లో ఉన్న విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమానిగా ఉన్నప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేదు. ఆయన వల్ల బ్యాంకుకు రూ.180 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని మాల్యా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ పేర్కొంది.
IOB బ్యాంక్ 2007-2012 మధ్య వివిధ సందర్భాల్లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు భారీ రుణాలు ఇచ్చింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యా ఆ రుణాన్ని వివిధ పార్టీలకు బదిలీ చేసినట్లు సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్‌లో పేర్కొంది.
తీసుకున్న రుణాన్ని కంపెనీకి చెల్లించలేదని చెప్పింది. దీంతో బ్యాంకును మోసం చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మనీల్యాండరింగ్ కేసుల్లో విజయ్ మాల్యా పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం అతడు లండన్‌లో దాక్కున్నట్టుగా తెలుస్తోంది.
విజయ్ మాల్యా కేవలం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకునే కాకుండా ఎస్‌బీఐతో పాటు పలు బ్యాంకులకు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సమయంలో విజయ్ మాల్యా 2016 మార్చి నెలలో భారత్‌ను విడిచిపెట్టాడు. జనవరి 2019లో ప్రత్యేక కోర్టు విజయ్ మాల్యాను మనీలాండరింగ్ చట్టం కింద ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది.
టాపిక్