MLC Kavitha Arrest Case : ఇక 'సీబీఐ' వంతు...! కవిత కస్టడీకి కోర్టు అనుమతి, వెలుగులోకి కొత్త విషయాలు-delhi court remands brs leader k kavitha to cbi custody till april 15 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha Arrest Case : ఇక 'సీబీఐ' వంతు...! కవిత కస్టడీకి కోర్టు అనుమతి, వెలుగులోకి కొత్త విషయాలు

MLC Kavitha Arrest Case : ఇక 'సీబీఐ' వంతు...! కవిత కస్టడీకి కోర్టు అనుమతి, వెలుగులోకి కొత్త విషయాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 12, 2024 05:28 PM IST

Delhi Excise Policy Case Updates : ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Excise Policy Scam) కేసులో కవితకు మరో షాక్ తగిలింది. సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీలో పిటిషన్ లో పలు కీలక విషయాలను పేర్కొంది సీబీఐ.

సీబీఐ కస్టడీకి కవిత
సీబీఐ కస్టడీకి కవిత

Delhi Excise Policy Case Updates : ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Excise Policy Case) కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తీహార్ జైలులో ఉన్న కవితను(MLC Kavitha Arrest Case) అదుపులోకి తీసుకున్న సీబీఐ…. ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. కస్టడీకి అనుమతి కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం…. కవిత సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఏప్రిల్ 15 వరకు కవితను సీబీఐ విచారించనుంది.

జైలులో కవితను అదుపులోకి తీసుకున్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Excise Policy Case) కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే సమయంలో కవితను గురువారం జైలులో అదుపులోకి తీసుకుంది సీబీఐ(CBI). ఐదు రోజుల పాటు కవితను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ ఉదయం కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది.

సీబీఐ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ లో కీలక విషయాలను ప్రస్తావించింది. లిక్కర్ కేసులో కవిత ప్రధాన కుట్రదారు అని పేర్కొంది. సౌత్ గ్రూపునకు చెందిన ఓ మద్యం వ్యాపారి… 2021లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిశారని తెలిపింది. తమకు అనుకూలంగా పాలసీని రూపొందించాలని కోరారని.. అందుకు ఆప్ పార్టీ నిధులను కోరిందని వివరించింది. ఇదంతా కూడా కవిత డైరెక్షన్ లోనే నడించిందని కస్టడీ పిటిషన్ లో సీబీఐ వెల్లడించింది. ఆప్ కు రూ. 100 కోట్ల చెల్లించాల్సి ఉంటుందని… ముందుగా రూ. 50 కోట్లు ఏర్పాటు చేయాలని సదరు వ్యాపారవేత్తను కవిత కోరినట్లు సీబీఐ వివరించింది.

రూ. 50 కోట్లలో సగం మొత్తాన్ని వ్యాపారవేత్త చెల్లించారని సీబీఐ తెలిపింది. అందుకు ఫలితంగా వ్యాపారవేత్త కుమారుడికి ఇండో స్పిరిట్ కంపెనీలో భాగస్వామ్యం ఇచ్చారని పేర్కొంది. ఈ ఇండో స్పిరిట్ కంపెనీ ని కేవలం తిరిగి చెల్లింపులు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన కిక్‌బ్యాక్‌ గా సీబీఐ అభివర్ణించింది. అప్రూవర్ గా మారిన దినేశ్ అరోరా… తన వాంగ్మూలంలో చెప్పిన విషయాలను కూడా సీబీఐ జతపర్చింది.

సౌత్ గ్రూపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట, శరత్ రెడ్డి (అరబిందో గ్రూప్ ప్రమోటర్), కవిత, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సమీర్ మహేంద్రుడు ఉన్నారని సీబీఐ తెలిపింది. కేజ్రీవాల్‌కు సన్నిహితుడైన నాయర్‌తో పాటు మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులతో జరిగిన సమావేశాల్లో బోయిన్‌పల్లి, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు గోరంట్ల ప్రాతినిధ్యం వహించారని సీబీఐ…. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కవితకు సంబంధాలు ఉన్నాయని… ఆ హామీతోనే శరత్ చంద్రారెడ్డి లిక్కర్ బిజినెస్ లోకి వచ్చారని సీబీఐ వివరించింది.

శరత్ చంద్రారెడ్డికి బెదిరింపులు…!

లిక్కర్ పాలసీలో హోల్‌సేల్ వ్యాపారానికి రూ. 25 కోట్లు మరియు ప్రతి రిటైల్ జోన్‌కురూ. 5 కోట్లను ఆప్(AAP) కు చెల్లించాలని శరత్ చంద్రారెడ్డికి కవిత చెప్పారని సీబీఐ తన పిటిషన్ లో ప్రస్తావించింది. ఇందుకు శరత్ చంద్రారెడ్డి విముఖత చూపడంతో… ఆతడిని కవిత బెదిరించారని, తెలంగాణ, ఢిల్లీలో ఎలా వ్యాపారం చేస్తావో చూస్తానని బెదిరించారని సీబీఐ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ లో ప్రస్తావించింది..

తమ విచారణలో తేలిన పలు అంశాలపై కవితను మరింత విచారించాల్సి ఉందని సీబీఐ… కోర్టుకు తెలిపింది. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించినప్పుడు…. ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదని చెప్పింది. తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని… ఈ నేపథ్యంలో ఆమెను కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… కవితను కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆమెను సీబీఐ ప్రశ్నించనుంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor Case)రూపకల్పన, అమల్లో అవకతవకలు జరిగాయని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆప్ నేతలతో పాటు ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు సమన్లు ఇచ్చి విచారించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 15న హైదరాబాద్ లోని కవిత ఇంట్లో ఈడీ అధికారులు(ED Raids) సోదాలు నిర్వహించారు. అనంతరం కవితను అరెస్టు చేసి దిల్లీకి తరలించారు. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను అధికారులు విచారించారు. కవిత బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు… జ్యూడిషియన్ రిమాండ్ ను విధించింది. దీంతో ప్రస్తుతం ఆమె తీహర్ జైలులో ఉన్నారు. బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ కవితకు ఇప్పటివరకు ఊరట దక్కలేదు. ప్రస్తుతం సీన్ లోకి సీబీఐ ఎంట్రీ ఇవ్వటంతో… మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Whats_app_banner