MLC Kavitha Arrest Case : సీన్ లోకి CBI ... కవితను విచారించేందుకు కోర్టు అనుమతి-delhi court allows cbi to question brs leader k kavitha in judicial custody ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha Arrest Case : సీన్ లోకి Cbi ... కవితను విచారించేందుకు కోర్టు అనుమతి

MLC Kavitha Arrest Case : సీన్ లోకి CBI ... కవితను విచారించేందుకు కోర్టు అనుమతి

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 05, 2024 04:56 PM IST

Delhi liquor policy Case Updates: జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకురాలు కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

MLC Kavitha Arrest Case Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi liquor policy Case) మరో పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం తీహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న కవితను(Kavitha) విచారించేందుకు సీబీఐ.. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయగా… దీనిపై విచారించిన న్యాయస్థానం కవితను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా కవితను తీహార్ జైలులో సీబీఐ అధికారులు విచారించి స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు. లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన కవితను ఈడీ (ED)అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ లో పలు అంశాలను పేర్కొంది. కవిత(MLC Kavitha) చార్టర్డ్ అకౌంటెంట్, మరో నిందితుడు బుచ్చిబాబు గోరంట్ల మొబైల్ ఫోన్ నుంచి లభించిన వాట్సాప్ చాట్‌లు, విచారణలో లభించిన కొన్ని పత్రాలు, ఫోన్‌ల ఆధారంగా కవితను విచారించాల్సిన అవసరం ఉందని ప్రస్తావించింది.

సీబీఐ తరపున వాదనలు విన్న రౌస్ రెవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా… కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చారు. తీహార్ జైలుకు వెళ్లి రికార్డు చేసేందుకు వీలుగా ఆదేశాలను జారీ చేశారు.

నిజానికి ఈడీ అరెస్ట్ కంటే ముందు నుంచే… కవితకు పలుమార్లు సీబీఐ నోటీసులు ఇస్తూ వచ్చింది. అయితే సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో… కవిత విచారణకు హాజరుకాలేదు. పెండింగ్ లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ…సీబీఐకి సమాచారం ఇచ్చారు కవిత. కానీ విచారణకు మాత్రం హాజరు కాలేదు.

ఇక ఈ లిక్కర్ కేసులో ఇప్పటివరకు ఈడీ దాఖలు చేసిన ఆరు ఛార్జ్ షీట్లలో కవితపై అధికారికంగా అభియోగాలు మోపనప్పటికీ… కీలక వ్యక్తిగా ప్రస్తావిస్తూ వచ్చింది. మాస్టర్ కీ ఆమెనంటూ కోర్టుకు సమర్పించిన పలు పత్రాల్లో పేర్కొంది. "సౌత్ గ్రూప్" ను లీడ్ చేయటంలో ఆమె ప్రధాన సూత్రదారి అని తెలిపింది.

మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం…. ఏప్రిల్ 8వ తేదీన తీర్పును వెలువరించనుంది. ప్రస్తుతం రిజర్వ్ లో పెట్టింది.

దిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor Case)రూపకల్పన, అమల్లో అవకతవకలు జరిగాయని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆప్ నేతలతో పాటు ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు సమన్లు ఇచ్చి విచారించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 15న హైదరాబాద్ లోని కవిత ఇంట్లో ఈడీ అధికారులు(ED Raids) సోదాలు నిర్వహించారు. అనంతరం కవితను అరెస్టు చేసి దిల్లీకి తరలించారు. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను అధికారులు విచారించారు. కవిత బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు… జ్యూడిషియన్ రిమాండ్ ను విధించింది. దీంతో ప్రస్తుతం ఆమె తీహర్ జైలులో ఉన్నారు.

Whats_app_banner