Minister Ponnam Prabhakar : కొండగట్టు అంజన్నకు ఇచ్చిన మాట తప్పినందుకే కవిత జైలుకు- మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar : మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ, బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతు బంధు రాని వాళ్లను ఓట్లు అడగాలని ఆ పార్టీలకు సవాల్ విసిరారు.
Minister Ponnam Prabhakar : బీఆర్ఎస్ బీజేపీకి మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) బహిరంగ సవాల్ విసిరారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వచ్చిన ప్రాంతాల్లో.. రైతుబంధు రాని వారిని ఓట్లు అడగమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చోట, రైతుబంధు తీసుకున్న వారిని ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్(BRS) బీజేపీకి లేదని అన్నారు. ఓట్ల కోసం రాజకీయ విమర్శలు చేయడం ఆ రెండు పార్టీలు మానుకోవాలని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో హితవుపలికారు.
మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి మంత్రి కొండగట్టు ఆంజనేయ స్వామి(Kondagattu Anjanna)ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత బలవంతుడిగా ధైర్యం ఇచ్చే కొండగట్టు అంజన్న ఆశీర్వాదం తీసుకున్నామని, ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ లో కాంగ్రెస్(Congress) గెలువాలని వేడుకున్నట్లు తెలిపారు. పార్టీ నాయకత్వం అన్ని ఆలోచనలు చేసి అభ్యర్థిని ఎంపిక చేస్తుందని తెలిపారు. అభ్యర్థి ఎవరనేది ఇంకా తెలియక పోయినప్పటికీ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేసినా గెలిపించుకునే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. తాము ఇచ్చిన హామీలు అన్ని అమలు కావాలంటే 17 ఎంపీలు గెలవాలని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి గురుబలం ఉంటే కాంగ్రెస్ పార్టీకి గురు బలంతో పాటు ప్రజాబలం ఉందని స్పష్టం చేశారు.
ఐదేళ్లలో ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి
ఎంపీగా 5 ఏళ్లు బండి సంజయ్(Bandi Sanjay), మరో ఐదేళ్లు వినోద్ కుమార్ ఏం చేశారో శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందు ఉంచాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. తాము ఏం చేశామో ప్రజలకు చెబుతామని స్పష్టం చేశారు. తమది ప్రజాపాలన అని తెలిపారు. కేసీఆర్, బండి సంజయ్ వేములవాడ కొండగట్టుకు చేసింది ఏమి లేదని విమర్శించారు. దేవుడి పేరుతో సంజయ్ ఓట్లు పొందాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు దిల్లీలో దోస్తీ ..గల్లీలో కుస్తీలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
కవిత మాటతప్పిది.. జైల్ కు వెళ్లింది
ఇక అబద్దాలతో పదేళ్లు ఏలిన బీఆర్ఎస్ నేతలకు జైలుకు వెళ్లక తప్పడం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కవిత(Kavitha) కొండగట్టు(Kondagattu)లో అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాట తప్పినందుకే జైలు పాలయ్యిందని విమర్శించారు. వాస్తు మూహూర్తం చూసుకుని కేసీఆర్ సెక్రటేరియట్ నిర్మిస్తే ఇప్పుడు తాము కూర్చుంటున్నామని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేస్తే వాటిని మేము ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. ఏది ఎవరికి శాశ్వతం కాదంటూ.. కవిత అరెస్టు సానుభూతితో ఓట్లు పొందాలని కేసీఆర్(KCR) చూస్తున్నారని విమర్శించారు.
HT Correspondent K.VREDDY, Karimnagar
సంబంధిత కథనం