Liquor Case : కవితను విచారించనున్న ఈడీ.. ఢిల్లీ చేరుకున్న కేటీఆర్, హరీశ్.. !-brs ministers ktr and harish rao reaches delhi ahead of mlc kavitha ed investigation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Brs Ministers Ktr And Harish Rao Reaches Delhi Ahead Of Mlc Kavitha Ed Investigation

Liquor Case : కవితను విచారించనున్న ఈడీ.. ఢిల్లీ చేరుకున్న కేటీఆర్, హరీశ్.. !

HT Telugu Desk HT Telugu
Mar 10, 2023 09:14 PM IST

Liquor Case : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ శనివారం విచారించనుంది. ఈ నేపథ్యంలో.. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీ చేరుకున్నారు. మంత్రుల హస్తిన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఢిల్లీకి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
ఢిల్లీకి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు

Liquor Case : ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అన్ని పార్టీల నేతల దృష్టంతా ఇప్పుడు ఈ కేసుపైనే కేంద్రీకృతమైంది. శనివారం (మార్చి 11న) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనున్న నేపథ్యంలో... ఏం జరగనుందనే చర్చ కొనసాగుతోంది. విచారణ అనంతరం ఈడీ అధికారులు కవితను అరెస్టు చేస్తారని జరుగుతోన్న ప్రచారం ఓ వైపు.. పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్ వేస్తోన్న అడుగులు మరోవైపు.. వెరసి ఢిల్లీ వేదికగా చోటుచేసుకుంటున్న పరిణామాలను అంతా నిశితంగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో.. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీ బయలుదేరి వెళ్లడం.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పార్టీ విస్తృత స్తాయి మీటింగ్ ముగియగానే మంత్రులు హస్తిన పర్యటనకు బయలుదేరి వెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్రెండింగ్ వార్తలు

కేటీఆర్, హరీశ్ వెంట కొంతమంది సీనియర్ నేతలు, న్యాయనిపుణులు కూడా ఢిళ్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత ఈడీ అధికారులు కవితను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో... శనివారం చోటుచేసుకునే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వ్యూహాలను అక్కడికక్కడే ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఒక వేళ ఈడీ తీవ్ర చర్యలు చేపడితే పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపిస్తోన్న బీఆర్ఎస్, తన వాయిస్ ని ఢిల్లీ వేదికగా మరింత గట్టిగా వినిపించే అవకాశం ఉంది. అవసరమైతే జాతీయ స్థాయి నేతలతో కలిసి ... కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఖరిని ఎండగట్టేందుకు కార్యాచరణ అమలు చేయనుందని సమాచారం.

మరోవైపు... బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా లిక్కర్ స్కాం కేసుపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. శనివారం కవితను అరెస్టు చేయవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కేసీఆర్... ఒకవేళ అరెస్ట్ చేసుకుంటే చేసుకోనీ అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. విపక్ష నేతలందరినీ ఇలాగే వేధిస్తున్నారని.. బీజేపీ చర్యలకు భయపడేది లేదని.. పోరాటం కూడా ఆపే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామంటూ నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలపై దాడులు జరిగినట్టు గుర్తు చేసిన ఆయన... ఎన్నికలు దగ్గరికొస్తున్నాకొద్దీ ఇలాంటి దాడులు మరిన్ని జరిగే అవకాశముందని అన్నారు.

కాగా.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారుల కీలక విషయాలు పొందుపర్చారు. సిసోడియా రిమాండ్ రిపోర్టులో పలుమార్లు కవిత పేరును అధికారులు ప్రస్తావించారు. మద్యం కుంభకోణం కుట్రలో కవిత భాగస్వామిగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంలతో కవితకు రాజకీయ అవగాహన ఉందని బుచ్చిబాబు తన వాంగ్మూలంలో చెప్పినట్లు ఈడీ వివరించింది. మద్యం పాలసీలో మార్పులు చేస్తే.. ఆప్ కు నిధులు ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందని.. 2021 మార్చి 19, 20 తేదీల్లో విజయ్ నాయర్ ను కవిత కలిశారని పేర్కొంది. 2021 జూన్ లో హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ లోను భేటీ జరిగిందని వివరించింది. ఇండో స్పిరిట్ లో కవితకు 32.5 శాతం వాటా ఉందని వెల్లడించింది. 12 శాతం ప్రాఫిట్ మార్జిన్ ఉండేలా మద్యం పాలసీ మార్చారంది. ఇందులో 6 శాతం ఆప్ నేతలకు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని పేర్కొంది. రూ. 100 కోట్ల ముడుపులు తీసుకొని మద్యం పాలసీ మార్చారంది. అందరికీ కలిపి మొత్తం రూ. 292 కోట్లు ముట్టినట్లు స్పష్టమైందని వెల్లడించింది. ఇండో స్పిరిట్స్ లాభం ద్వారా రూ. 192 కోట్లు దక్కించుకుందని ఈడీ వివరించింది.

IPL_Entry_Point