MLC Kavitha: లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు రెండు వారాల రిమాండ్… తీహార్ జైలుకు కవిత తరలింపు-mlc kavitha remanded for two weeks in liquor scam kavitha transferred to tihar jail ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha: లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు రెండు వారాల రిమాండ్… తీహార్ జైలుకు కవిత తరలింపు

MLC Kavitha: లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు రెండు వారాల రిమాండ్… తీహార్ జైలుకు కవిత తరలింపు

Sarath chandra.B HT Telugu
Mar 26, 2024 01:23 PM IST

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు రౌస్‌ అవెన్యూలోని ఈడీ ప్రత్యేక కోర్డు రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించారు.

రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత
రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (PTI)

MLC Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితకు (MLC Kavith) రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ ( Judicial Remand) విధించడంతో ఆమెను తీహార్ జైలుకు Tihar Jail తరలించారు.ఏప్రిల్ 9వ తేదీ వరకు కవితకు రిమాండ్ విధించారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో కవితను మంగళవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

తనపై నమోదైన కేసు మనీలాండరింగ్ కేసు కాదని, రాజకీయ లాండరింగ్ కేసు అని మద్యం కుంభకోణంలో ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మరోవైపు ఈడీ విచారణలో పలు విషయాలు వెలుగు చూశాయి. కవిత మేనల్లుడి ద్వారా నిధులను మళ్లించారనే ఈడీ దర్యాప్తులో కనుగొన్నట్టు చెబుతున్నారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో కవితను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు.

తనపై మోపిన కేసు మనీ లాండరింగ్ కేసు కాదని, కేవలం పొలిటికల్ లాండరింగ్ కేసని కవిత ఆరోపించారు. ఒక కల్పిత కేసు అని, తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టినట్టు చెప్పారు. ఇదే కేసులో ఒక నిందితుడు బిజెపిలో చేరాడని, రెండవ నిందితుడికి బిజెపి టికెట్ లభించిందని, మూడవ నిందితుడు ఎలక్టోరల్ బాండ్లలో 50 కోట్లు ఇచ్చాడని ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అని, తాము క్లీన్ గా బయటకు వస్తామని కవిత పేర్కొన్నారు.

మరోవైపు ఎమ్మెల్సీ కవితను జ్యుడీషియల్ కస్టడీకి పంపించేలా కోర్టును ఆదేశించాలని కోరుతూ ఈడీ మంగళవారం రూస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈడీ రిమాండ్ కాలంలో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశామని, ఆమెను విచారించామని, పలువురు వ్యక్తులు, డిజిటల్ రికార్డులతో ఆమెను విచారించినట్టు దర్యాప్తు సంస్థ రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది.

తెలంగాణ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను మార్చి 15న హైదరాబాద్ లో అరెస్టు చేసి, మరుసటి రోజే ఈడీ కస్టడీకి అప్పగించారు. అదే రోజు హైదరాబాద్ లోని కవిత నివాసంలో సోదాలు నిర్వహించి ఆమెను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు.

తన కుమారుడికి పరీక్షలు జరుగుతున్నందున బెయిల్ మంజూరు చేయాలని ఈడీని కవిత విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని, బెయిల్ పిటిషన్ త్వరితగతిన పరిష్కరిస్తామని ఆదేశాలతో ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని గతంలో సూచించింది.

జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం అందరికీ ఒకే విధమైన విధానాన్ని అనుసరించాలని, రాజకీయ వ్యక్తులు కాబట్టి బెయిల్ కోసం నేరుగా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అనుమతించలేమని గతంలో వ్యాఖ్యానించింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో లబ్ధి పొందేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుట్ర పన్నారని, ఈ ప్రయోజనాలకు బదులుగా ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో ఆమె పాలుపంచుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. చట్ట విరుద్ధంగా అక్రమ సొమ్మును తరలించారనే అభియోగాలను కవిత ఎదుర్కొంటున్నారు.

ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో విధానపరమైన లోపాలను ఎత్తిచూపుతూ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ 2022 జూలైలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనాకు సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదైంది.

ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో సిసోడియా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఖజానాకు రూ.580 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఈడీ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను సీబీఐకి అప్పగించడంతో తర్వాత సిసోడియా అరెస్టుకు దారి తీసింది.

హోల్ సేల్ మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించి 12 శాతం మార్జిన్ నిర్ణయించి 6 శాతం ముడుపులు చెల్లించేలా కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపించింది.

2021 నవంబర్లో తన మొదటి ప్రాసిక్యూషన్ ఫిర్యాదులో, ఈ విధానం "ఉద్దేశపూర్వక లొసుగులతో రూపొందించారని ఈడీ ఆరోపిస్తోంది. ఆప్ నాయకులకు ప్రయోజనం చేకూర్చడానికి " దొడ్డిదారిలో అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. 'సౌత్ గ్రూప్'గా గుర్తించిన వ్యక్తుల నుంచి ఆప్ నేతలు రూ.100 కోట్ల ముడుపులు అందుకున్నారని ఈడీ ఆరోపించింది.

Whats_app_banner

సంబంధిత కథనం