KCR : మత పిచ్చితో మంటలు రేగే తెలంగాణ కావాలా? ప్రజలకు కేసీఆర్ ప్రశ్నలు-cm kcr serious comments on pm modi in ranga reddy district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr : మత పిచ్చితో మంటలు రేగే తెలంగాణ కావాలా? ప్రజలకు కేసీఆర్ ప్రశ్నలు

KCR : మత పిచ్చితో మంటలు రేగే తెలంగాణ కావాలా? ప్రజలకు కేసీఆర్ ప్రశ్నలు

HT Telugu Desk HT Telugu
Aug 25, 2022 07:00 PM IST

KCR On Modi : బంగారు పంటలు పండే తెలంగాణ కావాలా? మత పిచ్చితో మంటలు రేగే తెలంగాణ కావాలా? ప్రజలే తేల్చుకోవాలని.. సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (Stock Photo)

కేంద్రం ఇప్పటి వరకు ఒక్క మంచి పనిచేయలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పుడు దేశంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కొంగర్‌కలాన్‌లో 44 ఎకరాల్లో ఆధునిక సదుపాయలతో రూ.58 కోట్లతో కొత్త కలెక్టరేట్​ను నిర్మించారు.

తెలంగాణతోపాటుగా పాటు దేశం బాగుండాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపాల్సిన ప్రధాని మోదీయే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. ఇవాళ ఏం లొల్లి జరుగుతోందని కేసీఆర్ అన్నారు. కేంద్రంలో ఉండే ప్రధానమంత్రే 9 రాష్ట్రాలను కూలగొట్టారన్నారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్, దిల్లీ ప్రభుత్వాలను కూలగొడతారంటా అని వ్యాఖ్యానించారు.

'బెంగళూరు అనేది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. కానీ ఇవాళ ఏం జరుగుతోంది. ఈ ఏడాది మన హైదరాబాద్​లోనే ఎక్కువ ఉద్యోగాలొచ్చాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కారణం. కేంద్ర ప్రభుత్వం ఒక్కటైనా మంచిపని చేసిందా. ఒక్క ప్రాజెక్ట్ కట్టారా. ఏం చేశారు అని అడుగుతున్నా. కనీసం మంచినీళ్లు ఇచ్చే తెలివి లేదా? దేశానికి కనీసం మంచినీళ్లు ఇవ్వలేరా? 70 టీఎంసీల నీళ్లు నదుల్లో పారుతూ ఉంటే మీకు సోయి లేదా?' అని కేసీఆర్ ప్రశ్నించారు.

నా ప్రాణం ఉన్నంత వరకూ తెలంగాణను ఆగం కానివ్వ. మత పిచ్చిగాళ్ల ఎలాంటి దుర్మార్గాలను సాగనివ్వను. మత పిచ్చికి లోనైతే బతుకులు ఆగమవుతాయి.. గుర్తుంచుకోవాలి. మత పిచ్చి ఉన్న వాళ్లను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి. సమాజంలో అసూయ, ద్వేషం పెరిగితే భారత్​తో పాటు తెలంగాణ 100 ఏళ్లు వెనక్కి వెళ్తుంది. కృష్ణా జలాల్లో వాటా తేల్చడం మోదీకి చేతకాదు. మోదీ మేము మనుషులం కాదా? దేశంలో భాగం కాదా? కేంద్రం నుంచి మోదీ ప్రభుత్వాన్ని పారద్రోలితేనే మనం అన్ని రంగాల్లో బాగుపడతాం. జాతీయ రాజకీయాల్లో ఉజ్వల పాత్ర నిర్వహిస్తాం.

- సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రిగా తాను, ప్రధానిగా మోదీ ఒకేసారి అయ్యామని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పుడు దేశంలో ఎందుకు ఇవ్వడం లేదని మోదీని సూటిగా ప్రశ్నించారు. స్వయంగా ప్రధానమంత్రే కుట్రలు పన్ని 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేశారన్నారు. స్టాలిన్‌, కేజ్రీవాల్‌, మమత బెనర్జీ ప్రభుత్వాలను కూల్చేస్తామని మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇండియాలో ఉంది ప్రజాస్వామ్యమా? ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ చర్యలను మౌనంగా భరిద్దామా? పిడికిలి బిగించి కొట్లాడుదామా? అని ప్రజలను అడిగారు. దిల్లీలో రూ.25 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామని అంటున్నారని, బిహార్‌, దిల్లీ, బెంగాల్‌లో ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచన చేయాలని కేసీఆర్ చెప్పారు.

IPL_Entry_Point