Janasena : జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు-వైసీపీకే ముఖ్యమంత్రి…పవన్
జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ముఖ్యమంత్రిలా వ్యవహరించడం లేదని వైసీపీకి మాత్రమే ముఖ్యమంత్రిగా భావిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. కడప జిల్లా సిద్ధవటంలో అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ కలుసుకుని వారికి ఆర్ధిక సాయం అందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది నిలువెల్లా ఆధిపత్య ధోరణి అని, ఆయనది అహంకారం, అహంభావం అయితే తమది అస్తిత్వం , ఆత్మాభిమానం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. కష్టపడి బతకడానికి మీ దగ్గర చేతులు కట్టుకోవాలా అని ప్రశ్నించారు. పద్యం పుట్టిన కడప నేలపై మద్యం ప్రవహింప చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చీప్ లిక్కర్ మరణాలకు అంతు లేకుండా పోయిందన్నారు. అధికారం రాని కులాలకు అండగా నిలబడతామని పవన్ కడపలో ప్రకటించారు. కులాలపై సామాజిక వైద్యుడిగా మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు బాసటగా నిలుస్తామన్నారు.
అప్పుల బాధలు, ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న 119 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష రూపాయల చెక్కులను అందచేశారు. 'ఆధిపత్యం, అహంకారం కలగలిపిన వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కరూ తన ముందు అణిగి మణిగి ఉండాలని కలలు కంటున్నాడని. ఆత్మగౌరవం చంపుకొని నేను ఎప్పుడూ ఏ పని చేయనని పవన్ చెప్పారు. కిందిస్థాయి చిరు వ్యాపారి మురళి దగ్గర నుంచి, మెగాస్టార్‌గా పిలుచుకునే చిరంజీవి వరకూ వైసీపీ నాయకుడి అహంభావానికి గురైన వారేనన్నారు. చిరంజీవి లాంటి వ్యక్తి నమస్కారంపెడితే కనీసం నమస్కారం కూడా పెట్టని వ్యక్తి వైసీపీ నాయకుడని, అలాంటి వ్యక్తి సామాన్యులకు ఎలాంటి గౌరవం ఇస్తాడో ప్రజలే అర్థం చేసుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.
కష్టపడి బతకడానికి కూడా మీకు నమస్కారాలు పెట్టాలి అంటే మా ఆత్మగౌరవం ఒప్పుకోవడం లేదని, వంగి వంగి దండాలు పెట్టి బతకాలి అంటే మా అస్తిత్వమే దెబ్బ తినే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అందుకే భీమ్లా నాయక్ లాంటి సినిమాను సైతం వదిలేశానని చెప్పారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర కార్యక్రమాన్ని ఉమ్మడి కడప జిల్లాలోని సిద్ధవటంలో నిర్వహించారు. సాగు అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడిన 119 మంది కౌలు రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.
వైసీపీ నాయకుడు ముందు ఎవరైనా చేతులు కట్టుకొని నిలబడాలి అనే దర్పం. అలా కాకుంటే తట్టుకోలేరన్నారు. తాను దెబ్బలు తినడానికి వచ్చానని, తల వంచేది లేదన్నారు ఎంత తొక్కితే అంత బంతిలా లేస్తానని బెదిరింపులకు, దౌర్జన్యాలకు లొంగే వ్యక్తిని కాదన్నారు. ఆత్మాభిమానం ఎప్పటికీ చంపుకోనని కచ్చితంగా ఒక మార్పు కోసం బలమైన సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన వాడినని, అది సాధించేవరకు ప్రయాణం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగదన్నారు.
పద్యం పుట్టిన చోట మద్యం పారిస్తున్నారు….
అల్లసాని పెద్దన వంటి వారు రాయలసీమ ప్రాంతంలో మొదట పద్యం రాశారని, ఇదొక విజ్ఞాన భూమి, సరస్వతి నడయాడిన నేల అన్నారు. తెలుగు వచనం పుట్టిన గొప్ప ప్రాంతంలో వైసీపీ నాయకుడు మద్యం పారిస్తున్నాడని విమర్శించారు. చీప్ లిక్కర్ తో ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాడని విమర్శించారు. రాష్ట్రం మొత్తం నకిలీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని రాష్ట్రంలో లెక్కలేనన్ని మద్యం మరణాలు సంభవిస్తున్నా దీనికి అడ్డుకట్ట వేసే నాధుడే లేడన్నారు.
తాను ఎప్పుడు కులాలు, మతాలు గురించి ఆలోచించనని అమెరికాలో జాతుల్లాగా ఆఫ్రికాలో తెగలు మాదిరి మన భారతీయ సమాజంలోనూ కులానికి ప్రముఖ పాత్ర ఉందన్నారు. వైసీపీ ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అంతా అంటున్నా, చాలామంది రెడ్డి సామాజిక వర్గంలోని వారు పేదరికంలోనే మగ్గిపోతున్నారన్నారు. ఇక్కడకు వచ్చిన రైతు కుటుంబాలను చూస్తే అర్థమవుతుంది. కడప జిల్లాలో మొత్తం 60 వేల మంది కౌలు రైతులు ఉంటే కేవలం 3000 మందికి కౌలు రైతుల కార్డులు ఇవ్వడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటన్నారు..? మైదుకూరు ప్రాంతానికి చెందిన నాగేంద్ర అనే దివ్యాంగుడు తమకు పరిహారం రాలేదని, త్వరలో తమకు సహాయం చేసేందుకు జనసేన పార్టీ నాయకులు వస్తున్నారని వాట్సప్ స్టేటస్ పెడితే అతన్ని వైసీపీ నాయకులు పిలిచి మరీ బెదిరించారని ఆరోపించారు.
అధికారం రాని కులాలకు అండగా ఉంటాం
ఒక ఇంట్లో అన్నా, చెల్లిగా ఉన్న మీకే పడక ఒకరు ఆంధ్రాలో, మరొకరు తెలంగాణలో అధికారం కోసం పాకులాడుతుంటే ఎప్పటికీ అధికారం దక్కని ఇన్ని కులాలకు అధికారంపై తపన ఉండకూడదా అని పవన్ ప్రశ్నించారు. రాయలసీమలో 11 శాతం ఉన్న మాదిగలకు, 8 శాతం ఉన్న బోయలకు, కురబలకు, 20 శాతం వరకు ఉన్న 24 ఉప కులాల బలిజలకు, నాలుగు శాతం వరకు ఉన్న పద్మశాలి, దేవాంగులకు అండగా ఉంటామని పవన్ చెప్పారు. పేదరికంలో ఉండే ముస్లింలకు, దూదేకులకు అండగా నిలబడ తామని, అధికారం దక్కని కులాలకు కచ్చితంగా అండగా నిలబడాలి అన్నదే జనసేన అభిమతం అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వరకు భుజం కాస్తామన్నారు. కులాలను అమ్మడానికి, ఇతర కులాలకు కొమ్ము కాయడానికి రాజకీయాల్లోకి రాలేదని, ఒక బలమైన సామాజిక మార్పు వచ్చి అన్ని కులాలకు తగిన గౌరవం దక్కాలి అని, సమాజంలో అందరికీ సమన్యాయం జరగాలి అన్నదే ఆకాంక్ష అని స్పష్టం చేశారు.
టాపిక్