Sonu Sood: రియల్ లైఫ్ హీరో సోనూ సూద్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. తెలుగు వారిని కుటుంబ సభ్యులుగా చూస్తానంటూ కామెంట్స్
Sonu Sood Received Sankalp Kiran Award: టాలీవుడ్ విలన్, రియల్ లైఫ్ హీరో సోనూ సూద్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్ సంకల్ప్ కిరణ్ పురస్కారం వరించింది. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సంకల్ప్ దివస్ కార్యక్రమంలో వ్యాపారవేత్త వై కిరణ్ పుట్టినరోజు సందర్భంగా సోనూ సూద్ సంకల్ప్ అవార్డ్ అందుకున్నారు.
Sonu Sood In Sankalp Divas Celebrations: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం (నవంబర్ 28) సాయంత్రం హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్, లలితా కళాతోరణంలో 'సంకల్ప్ దివాస్' కార్యక్రమం ఘనంగా జరిగింది. మానవతావాది, వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై. కిరణ్ తన పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 28న 'సంకల్ప్ దివాస్'ను నిర్వహిస్తున్నారు.
సమాజానికి సేవ చేయడంలో
సమాజానికి సేవ చేయడంలో మాత్రమే కాకుండా, సమాజానికి సేవ చేస్తున్న ప్రముఖులని గుర్తించి, వారిని సత్కరిస్తున్నారు లయన్ డాక్టర్ వై. కిరణ్. ఈ క్రమంలోనే 'సంకల్ప్ దివాస్' కార్యక్రమం ద్వారా ప్రముఖుల సేవలను గుర్తించి వారిని 'సంకల్ప్ కిరణ్ పురస్కారం'తో సత్కరిస్తుంటారు. రెండు దశాబ్దాలగా, ప్రతి ఏడాది గొప్ప మానవతావాదులను గుర్తించి వారికి పురస్కారాలు అందిస్తున్నారు.
అన్నా హజారే, మేరీ కోమ్ వంటి
వారిలో అన్నా హజారే, కిరణ్ బేడీ, సుందర్‌లాల్ బహుగుణ, సందీప్ పాండే, జోకిన్ అర్పుతం, మేరీ కోమ్ వంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఈ సంవత్సరం 'సంకల్ప్ దివాస్'లో ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్‌ను 'సంకల్ప్ కిరణ్ పురస్కారం'తో సత్కరించారు. వైభవంగా జరిగిన ఈ వేడుకకు భారత్-బల్గేరియా రాయబార కార్యాలయ అంబాసిడర్ హెచ్ఈ నికోలాయ్ యాంకోవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గౌరవంగా భావిస్తున్నా
సంకల్ప్ దివాస్ 2024 కార్యక్రమంలో సోనూసూద్ మాట్లాడుతూ.. "ఈ ప్రతిష్టాత్మక పురస్కారం పొందటం గౌరవంగా భావిస్తున్నాను. సోదరుడు కిరణ్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన చేసే గొప్ప సేవా కార్యక్రమాల గురించి తరచూ వింటుంటాను. అలాంటి వ్యక్తితో వేదికను పంచుకోవడం గర్వంగా ఉంది. నేను కిరణ్ గారిని కలవకముందే, ఆయన గొప్పతనం గురించి ఎంతో విన్నాను" అని అన్నారు.
సహకారం అందించడానికి
"ఈ ప్రత్యేక పిల్లలు రియల్ హీరోలు. వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఈ అదృష్టాన్ని కలిగించిన కిరణ్ గారికి కృతజ్ఞతలు. కిరణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి సేవ చేయడానికి అందరూ ముందుకు రావాలి. ఆయన తలపెట్టిన సంకల్ప్ దివాస్‌కి నా వంతు సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను" అని సోనూ సూద్ తెలిపారు.
నాపై ఎంతో ప్రేమ చూపిస్తారు
"హైదరాబాద్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. నేను పంజాబీ అయినప్పటికీ ఆంధ్ర, తెలంగాణ ప్రజలు నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంటారు. అందుకే నేను తెలుగు వారిని కుటుంబ సభ్యులలాగా భావిస్తాను. లాక్ డౌన్ సమయంలో మనం ఎంత సంపాదించం అనే దానికంటే, మనం సమాజానికి ఏం చేశాం అనేదే ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని గ్రహించాను" అని సోనూ సూద్ పేర్కొన్నారు.
సమాజ సేవవైపు
"అప్పటినుంచి కిరణ్ గారిలా తోచిన సాయం చేస్తున్నాను. ఈ తరంతో పాటు, భవిష్యత్ తరాలు కూడా సమాజ సేవ వైపు అడుగులు వేసేలా కిరణ్ గారు స్ఫూర్తి నింపుతున్నారు. కిరణ్ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని రియల్ హీరో సోనూ సూద్ తన స్పీచ్ ముగించారు.
గాన, నృత్య ప్రదర్శనలతో
ఇదిలా ఉంటే, ప్రముఖ యాంకర్ స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ 'సంకల్ప్ దివాస్' కార్యక్రమంలో పలువురు పిల్లలు గాన, నృత్య ప్రదర్శనలతో తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని చాటి చెప్పారు. అలాగే ఈ వేడుకలో సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్న పలువురిని 'సంకల్ప్ సేవా పురస్కార్'తో సత్కరించారు.