Tirupati : ఏపీపై ఫెంగల్ పంజా.. ఈదురుగాలులతో కూడిన వర్షం.. విమాన సర్వీసులు రద్దు
Tirupati : ఫెంగల్ తుపాను ఏపీపై పంజా విసురుతోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తుపాను కారణంగా తిరుపతి నుంచి విమాన సర్వీసులను రద్దు చేశారు. వర్షం కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తిరుపతి జిల్లాపై ఫెంగల్ తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. శుక్రవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే 4 విమాన సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్, విశాఖ, బెంగళూరు వెళ్లాల్సిన విమానాలను ఇండిగో ఎయిర్ లైన్స్ రద్దు చేసింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా ఏర్పేడు మండలంలో సీత కాలువ పొంగిపొర్లుతుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుపాన్ కదులుతుంది. బంగాళాఖాతంలో పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతున్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 150 కిలోమీటర్లు, చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. శనివారం సాయంత్రానికి ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉంది.
ఈ తుపాను ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని స్పష్టం చేసింది.
నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్‌కు అవకాశం ఉందని.. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ స్పష్టం చేశారు. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చేరుకున్నాయి. తీర ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచారు. సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా భద్రతా చర్యలు చేపట్టారు. విద్యుత్తు సిబ్బంది.. హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. సెలవులు రద్దు చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో జూనియర్ ఇంజినీర్లను అందుబాటులో ఉంచారు.
అటు కృష్ణా జిల్లాలోనూ ఫెంగల్ ప్రభావం చూపుతోంది. తుపాను ఎఫెక్ట్‌తో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. దివిసీమలో వర్షాలతో వరి పంట నెలకొరిగింది.. వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని రోడ్లపైన ఆరబోస్తున్నారు. తుపాను ప్రభావంతో చాలాచోట్ల వరిపంట నీట మునిగింది. పాలకాయతిప్ప దగ్గర అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి.