KCR On CBI ED Raids: సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన పనిలేదు-cm kcr key comments in trslp meeting at telangana bhavan over cbi ed raids ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr On Cbi Ed Raids: సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన పనిలేదు

KCR On CBI ED Raids: సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన పనిలేదు

HT Telugu Desk HT Telugu
Sep 04, 2022 08:45 AM IST

TRSLP Meeting at Telangana Bhavan: శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రసంగించారు. సుమారు 2 గంటలపాటు రాష్ట్ర, జాతీయ రాజకీయాలతోపాటు పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

<p>టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో)</p>
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో) (twitter)

KCR Comments in TRSLP Meeting: వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకే సీట్లు దక్కుతాయని అన్నారు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. దాదాపు 80 నుంచి 90 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని... సర్వేల్లో కూడా అదే తేలిందని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ విక్టరీ సాధిస్తుందని.. కాంగ్రెస్ కు రెండో స్థానం దక్కుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ మూడో స్థానానికే పరిమితమవుతుందని చెప్పుకొచ్చారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశానికి హాజరై ప్రసంగించిన కేసీఆర్‌... పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రగతి సాధిస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని అన్నారు. త్వరలోనే సీబీఐ, ఈడీ దాడులు జరగవచ్చని కూడా ప్రజాప్రతినిధులకు హింట్ ఇచ్చారు.

భయపడేది లేదు…

KCR Comments On CBI ED: ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వ తీరును కేసీఆర్ విమర్శించారు. బీజేపీ దేశానికేం చేశామో చెప్పుకునేందుకు అంశాలేవీ లేనందునే కేవలం మతపరమైన అంశాలను నమ్ముకొని రాజకీయాలు చేస్తోందని... జాతీయస్థాయిలోనూ బీజేపీకి భాగస్వామ్య పార్టీలు దూరమై ఏకాకిగా మారిందని వ్యాఖ్యానించారు. బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పాటుకు సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. దేశంలో బలమైన ఆర్థికశక్తిగా తెలంగాణ ఎదగడం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందన్నారు. త్వరలోనే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేసేందుకు సిద్ధమవుతోందన్న కేసీఆర్... కేంద్రం దండయాత్రకు ఏ మాత్రం భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా బీజేపీ ఆటలు ఇక్కడ సాగవన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని.. దర్యాప్తు సంస్థలకు అవకాశమిచ్చే ఏ పనీచేయవద్దని సూచించినట్లు తెలుస్తోంది.

ఎంపిక వేగవంతం చేయండి…

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ తెలంగాణ పర్యటనలో స్థాయి దిగజారి మాట్లాడారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులందరిదీ ఇదే వైఖరి అన్న ఆయన... కేంద్రం మనపై మరింత దాడి చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని.. బాగా పనిచేసే ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో స్థానికంగా ఉండి ప్రజలతో మమేకం కావాలన్నారు. త్వరలోనే జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని... మరింతమందికి దళితబంధు, డిసెంబరు చివరి నాటికి మూడు వేల రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని చెప్పారు. నియోజకవర్గానికి 500 మంది చొప్పున లబ్ధిదారులను దళితబంధు పథకం కింద వెంటనే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఈ నెల 6, 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని సీఎం కేసీఆర్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు తెలియజేశారు.

ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలను స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో నిర్వహించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. త్వరలో జాతీయ స్థాయి దళిత సదస్సు కూడా నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.

Whats_app_banner