TRS Munugode :మునుగోడుకు మరోసారి సీఎం కేసీఆర్...-kcr may conduct atleast 4 public meetings for munugode by poll ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kcr May Conduct Atleast 4 Public Meetings For Munugode By Poll

TRS Munugode :మునుగోడుకు మరోసారి సీఎం కేసీఆర్...

HT Telugu Desk HT Telugu
Sep 02, 2022 07:16 AM IST

మునుగోడు ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి చావో రేవో అన్నట్లుగా తయారు అయ్యింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కాస్త జోష్ ఇఛ్చినా, హుజారాబాద్ లో ఇఛ్చిన ఝలక్ మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీలో డేంజర్ సిగ్నల్స్ పంపుతున్నాయి. బీజేపీలో చేరిన సిట్టింగ్ అభ్యర్ధి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగానూ, సామాజికంగానూ జిల్లాలో పలుకుబడి ఉన్న నేత కావడంతో టీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది.

మునుగోడుపై టిఆర్‌ఎస్‌ స్పెషల్ ఫోకస్
మునుగోడుపై టిఆర్‌ఎస్‌ స్పెషల్ ఫోకస్

మునుగోడు ఎన్నిక టిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రతిష్టాత్మకం కావడంతో గెలుపు కోసం ఆ పార్టీ అన్ని ప్రయత్నాలుచేస్తోంది. మరోవైపు మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజీతో మునుగోడు మళ్లీ జెండా ఎగరవేస్తాననే ధీమాతో ఉన్నాడు. కోమటిరెడ్డికి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తోడైంది. మునుగోడు ఎన్నికల ఫలితం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడటం ఖాయం కావడంతో ఉప ఎన్నికను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

మునుగోడు ఎన్నికపై ఇప్పటికే అలర్ట్ అయిన టీఆర్ఎస్ పార్టీ, వేగంగానే పావులు కదుపుతోంది. ఇప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి ఎవరూ అనే దానిపై సస్పెన్స్ వీడ లేదు. గతంలో ప్రాతినిధ్యం వహించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి చాన్స్ ఇస్తారా, లేదంటే బీసీ నేతకు చాన్స్ ఇవ్వాలా అనే మీమాంసలో అధినేత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మునుగోడులో ఓ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మరోసారి ఈ నెల రెండో వారంలో చండూరులో పర్యటిస్తారు అని టాక్ వినిపిస్తోంది. దీన్ని బట్టే సీఎం కేసీఆర్ ఈ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

జిల్లా మంత్రి జగదీష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినప్పటికీ, ట్రబుల్ షూటర్ హరీష్ రావును సైతం రంగంలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కేటీఆర్ కూడా మునుగోడు ఉప ఎన్నిక సంధర్భంగా జరిగే బహిరంగ సభలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. మునుగోడులో వామపక్షాల మద్దతు సైతం టీఆర్ఎస్‌కు దక్కింది. సిపిఐ, సిపిఎంలు బీజేపీని ఓడించడానికి ఉపఎన్నికలో టిఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి.

వామపక్షాల ఓట్లు నియోజకవర్గంలో గణనీయంగా ఉండటం కూడా టిఆర్‌ఎస్‌కు కొంత ఊరటనిచ్చే విషయం. ముఖ్యంగా రాచకొండ ప్రాంతంలోని సంస్థాన్ నారాయణ్ పూర్ లాంటి ప్రాంతాలలో ఒకప్పుడు నక్సలైట్లకు గట్టి పట్టు ఉండేది. కాలక్రమేణ వామ పక్ష ఉద్యమాల పట్ల ఆదరణ తగ్గినా సీపీఐ బలంగా ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయి. అయితే ఉప ఎన్నికల్లో వామపక్షాల ఓట్లు టీఆర్ఎస్ కు ఎంత మేరకు ట్రాన్స్ ఫర్ అవుతాయి అనేది అసలైన ప్రశ్న.

ఇక కాంగ్రెస్ కూడా ఈ ప్రాంతంలో బలంగానే ఉండేది. ముఖ్యంగా గ్రామాల్లో కాంగ్రెస్ సాంప్రదాయ ఓటుబ్యాంకు పూర్తిగా రాజగోపాల్ వైపు మొగ్గు చూపుతుందా, లేక కాంగ్రెస్ వైపు పడుతుందా అనేది కూడా కీలకం కానుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతికి ఎముక లేదన్నట్లు అడిగిన వారికి కాదనకుండా సాయం చేస్తున్నాడు. లక్షలకు లక్షలు విరాళంగా పంచిపెడుతున్నారు. ఏడాది కూడా పదవీ కాలం లేని ఎన్నిక కోసం భారీగా ఖర్చు చేస్తుండటంతో టిఆర్‌ఎస్‌ పార్టీ కూడా అప్రమత్తమైంది. కోమటిరెడ్డికి కౌంటర్ ఇచ్చేందుకు స్ట్రాటజీ సిద్ధం చేస్తోంది. సీఎం కేసీఆర్ఉప ఎన్నిక ముగిసే లోపు కనీసం 4 సార్లు మునుగోడులో పర్యటించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు టిఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

WhatsApp channel

టాపిక్