KTR on Hydra : గరీబోళ్లకు ఒక న్యాయం.. సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా?: కేటీఆర్-brs working president ktr sensational comments on hydra demolitions in hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr On Hydra : గరీబోళ్లకు ఒక న్యాయం.. సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా?: కేటీఆర్

KTR on Hydra : గరీబోళ్లకు ఒక న్యాయం.. సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా?: కేటీఆర్

Basani Shiva Kumar HT Telugu
Sep 24, 2024 02:43 PM IST

KTR on Hydra : హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదళ్ల గూడు కూల్చుతున్నారంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో పేదవాళ్ల బతుకులను రోడ్డుపై వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్

హైడ్రాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గరీబోళ్లకు ఒక న్యాయం.. సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అక్రమంగా పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాదా? అని నిలదీశారు. పేదవాళ్ల ఇళ్లను కూల్చేస్తామంటే.. బీఆర్ఎస్ ఊరుకోదు.. వారికి అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

'రేవంత్ రెడ్డి కుటుంబం రాష్ట్రాన్ని పంచుకొని స్వైర విహారం చేస్తూ దోచుకుంటున్నారు. మాదాపూర్‌లో తిరుపతి రెడ్డి కమీషన్ల దుకాణం తెరిచిండని శేరిలింగంపల్లి ఎమ్మెల్యేనే చెప్పిండు. శేరిలింగంపల్లిలో ఉప ఎన్నిక ఖాయం. బీఆర్ఎస్ గెలుపు పక్కా. హైదరాబాద్ లో మనం భారీ మెజార్టీలతో క్లీన్ స్వీప్ చేసినం. హైదరాబాద్‌లో కాంగ్రెస్ కు ఓటు వేయలేదని ప్రజలపై పగ బట్టిండు' అని కేటీఆర్ ఆరోపించారు.

'ఆటో డ్రైవర్లు, బస్తీ వాసులు, పేదలపై సీఎం పగ బట్టిండు. సీఎం అన్నకు ఒక న్యాయం, గరీబోళ్లకు ఒక న్యాయమా? తిరుపతి రెడ్డిని ముట్టాలంటే ఆయనకు అన్ని భద్రతలు కల్పించారు. బీఆర్ఎస్ వాళ్లు అడుగుతున్నారంటూ ఒక నోటీసు డ్రామా చేసి స్టే తెచ్చుకునేటట్టు చేశారు. కానీ.. గరీబోళ్లు పుస్తకాలు, సామాన్లు తీసుకుంటామంటే కూడా వారికి సమయం ఇవ్వటం లేదు' అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'బిల్డింగ్‌లు నిర్ధాక్షణ్యంగా కూల్చేస్తారు. పేదవాన్ని నిర్దాక్షణ్యంగా రోడ్డున పడేస్తున్నారు. మనం కన్‌స్ట్రక్షన్ చేశాం. ఈయన మాత్రం డిస్ట్రక్షన్ చేస్తుండు. మనం డబుల్ బెడ్ రూమ్‌లు, ఫ్లై ఓవర్లు, ఎస్టీపీలు కట్టినం. ఈ ముఖ్యమంత్రి మాత్రం 9 నెలల్లో బెదిరింపులు, కూలగొట్టుడు, బ్లాక్ మెయిలు చేస్తున్నాడు. నాగార్జున కు సంబంధించిన నిర్మాణాన్ని కూల్చేశారు మంచిదే. కానీ పర్మిషన్ ఇచ్చిందెవడు. ఎవ్వడు పర్మిషన్ ఇచ్చిన వాళ్లపై చర్యలు తీసుకో దమ్ముంటే.. పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్సే కదా' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

'మనం ఆక్రమణలను ప్రోత్సహించామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు పర్మిషన్లు ఇచ్చినోళ్లను బయటకు తీయండి. అవన్నీ మీ కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన పర్మిషన్లే. నాగార్జునకు నోటీసులు ఇస్తే వాళ్లు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లు దమ్ముంటే కూలగొట్టు. పేదవాళ్లకు ఎవరు అండగా లేరని వారిపై దౌర్జన్యం చేస్తారా?' అని కేటీఆర్ ప్రశ్నించారు.

'పేదవాళ్లే దిక్కులేక ఎక్కడైనా నాలాలపై ఇళ్లు కట్టుకుంటారు. మానవత్వం ఉన్న ప్రభుత్వమైతే.. వాళ్లకు నోటీసులు ఇవ్వాలే. లేదంటే వాళ్లకు వేరే ఇళ్లు ఇవ్వాలే. నీకు నీతి ఏమైనా ఉందా? మేము కట్టిన 40 వేల డబుల్ బెడ్ రూమ్‌లు ఉన్నాయి. నీకు చిత్తశుద్ది ఉంటే ఆ ఇళ్లను పేదవాళ్లకు ముందు ఇవ్వు. హైడ్రాకు చుట్టం కకపోతే అనుముల తిరుపతి రెడ్డిని ఎందుకు వదిలిపెడుతున్నారు' అని కేటీఆర్ ప్రశ్నించారు.

'పేదలకు అండగా ఉండేందుకు త్వరలోనే హైదరాబాద్ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడతాం. వాళ్లకు అండగా ఉంటే కార్యక్రమాలను కేసీఆర్ పర్మిషన్‌తో చేపడతాం. మా కన్నా ఎక్కువ పనులు చేసి ప్రజలకు మంచి చెయ్యి. లేదంటే మేము ఊరుకోం. ప్రతిపక్షంలో ఉన్న సరే శేరిలింగంపల్లి కార్యకర్తల్లో ఎంతో కసి కనిపిస్తోంది. శేరిలింగంపల్లిలో బరాబర్ ఉప ఎన్నిక వస్తది. వాళ్లకు బుద్ది చెప్పాల్సిన అవసరముంది' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

'ఏం తక్కువ చేసింది పార్టీ. ఎందుకు పార్టీ మారివన్. శ్రీధర్ బాబు అతి తెలివితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు అంటున్నారు. మరి శేరిలింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి, దౌర్భాగ్యుడు, వెధవ ఎవరో శ్రీధర్ బాబు చెప్పాలి. మనం మనోడు కాదంటున్నాం. వాళ్లు మనోడు కాదంటారు. వాళ్ల బతుకు ఎటు కాకుండా పోయింది. ఇంటింటికి వెళ్లి నువ్వే చేర్చుకున్నవ్ కదా ముఖ్యమంత్రి.. ఇప్పుడు వాళ్ల బతుకు జూబ్లీ బస్టాండ్ అయ్యింది' అని కేటీఆర్ సెటైర్లు వేశారు.

'మొన్నటి హైకోర్టు తీర్పుతో వాళ్ల గుండెల్లో వణుకు మొదలైంది. అందుకే నీతి బహ్యామైన పనులు చేస్తున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే మేము ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని చెప్పు. మంచి పనులు చేస్తే ఉప ఎన్నికలు పెట్టి గెలువు. నువ్వు చేస్తున్నవి గలీజ్ పనులు. అటు ప్రజలు, మీ ఢిల్లీ పెద్దలు కూడా చూస్తున్నారు. ఎన్ని హామీలు ఇచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అవ్వ, తాతలకు నాలుగు వేలు ఫించన్ అన్నారు. ఉన్న రెండు వేలు కూడా దిక్కులేవు' అని కేటీఆర్ విమర్శించారు.

'గెలిచిన మరుసటి రోజే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. రూ.49 వేల కోట్ల రుణమాఫీని రూ.12 వేల కోట్లతో సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు తమకు రుణమాఫీ కాలేదంటూ పొలాల్లో సెల్ఫీలతో నిరసన తెలుపుతున్నారు. రైతు భరోసా అన్నాడు. కానీ అసలు సీఎం కుర్చీకే భరోసా లేని పరిస్థితి. ఖమ్మం బాంబా, నల్గొండ బాంబా అర్థం కాక భయంతో ఉన్నాడు' అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

'ఆడపిల్లలకు తులం బంగారం అన్నావ్. మీ ప్రభుత్వం వచ్చాక పెళ్లిళ్లు చేసుకున్న ఆడపిల్లలందరికీ బంగారం ఇవ్వలే. యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నట్లుగా ఒకే అబద్దాన్ని వందల సార్లు చెప్పి యువతను నమ్మించిండు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ కు తీసుకొచ్చి ఏటా 2 లక్షల ఉద్యోగాలంటూ నమ్మబలికారు. కానీ మనం ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చామంటూ నోటికి వచ్చినట్లు సంఖ్య చెబుతున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చావంటే కేసీఆర్ ను తిడుతూ దబాయించి బెదిరిస్తున్నాడు' అని రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

'కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారంట. సచివాలయం, అంబేడ్కర్ విగ్రహాం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫ్లై ఓవర్లు ఎక్కడ చూసిన కేసీఆర్ ఆనవాళ్లే కనిపిస్తాయి. తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ కనిపిస్తూనే ఉంటాడు. సీఎం అన్నదమ్ముళ్లు ఏడుగురు మొత్తం తెలంగాణను పంచుకున్నారు. ఇప్పటి వరకు ఈ సీఎం ఢిల్లీకి 23 సార్లు పోయిండు. రాష్ట్రంలో మాత్రం ఒక్క కొత్త పథకం కూడా పెట్టలేదు' అని వ్యాఖ్యానించారు.

'వంద రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తా అని చెప్పాడు కదా? మరీ ఒక్కటైనా చేసిండా? పార్టీ మారిన వాళ్లు బాధపడుతూ.. మళ్లీ వస్తామని చెబుతున్నారు. కేసీఆర్ యాదికి వస్తున్నాడు అని ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతున్నాడు. జేసీబీ వచ్చి ఇళ్లు కొట్టేస్తుంటే కేసీఆర్ నువ్వు రావాలని మరొక సోదరుడు అంటున్నాడు. మళ్లీ తెలంగాణలో కేసీఆర్ కావాలని అంతా కోరుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ గెలవటం ఖాయం' అని కేటీఆర్ స్పష్టం చేశారు.