Netflix Web Series: చిక్కుల్లో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్.. నిషేధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్-netflix web series ic 814 the kandahar highjack pil filed seeking ban in delhi high court ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Web Series: చిక్కుల్లో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్.. నిషేధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్

Netflix Web Series: చిక్కుల్లో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్.. నిషేధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్

Hari Prasad S HT Telugu
Sep 03, 2024 09:45 AM IST

Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ లేటెస్ట్ వెబ్ సిరీస్ చిక్కుల్లో పడింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ సిరీస్ పై నిషేధం విధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అటు సోషల్ మీడియాలోనూ నెట్‌ఫ్లిక్స్ పై ప్రేక్షకులు మండిపడుతున్నారు.

చిక్కుల్లో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్.. నిషేధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్
చిక్కుల్లో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్.. నిషేధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్

Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో గత వారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఐసీ 814: ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ చిక్కుల్లో పడింది. ఇది వాస్తవాలను పక్కదోవ పట్టించి నిజమైన హైజాకర్ల గుర్తింపు దాచిందంటూ సోమవారం (సెప్టెంబర్ 2) ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వెబ్ సిరీస్ వెంటనే నిషేధించాలని పిటిషనర్లను కోర్టును కోరారు.

చిక్కుల్లో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్

నెట్‌ఫ్లిక్స్ లో గత గురువారం (ఆగస్ట్ 29) నుంచి ఐసీ 814: ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సిరీస్ వచ్చినప్పటి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 1999లో జరిగిన కాందహార్ హైజాక్ పై రూపొందించిన ఈ సిరీస్ లో హైజాకర్లు ముస్లింలు అయినా.. వాళ్ల పేర్లను మార్చి భోళా, శంకర్ అనే పేర్లను పెట్టడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై తాజాగా ఢిల్లీ హైకోర్టులోనూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలైంది. హిందూ సేన అధ్యక్షుడు, రైతు అయిన సూర్జిత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సిరీస్ కు సీబీఎఫ్‌సీ ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేసి, వెంటనే సిరీస్ ను నిషేధించాలని కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన పిటిషన్ లో కోరారు.

వాస్తవాలను దాచారు

"హైజాకర్లను అసలు గుర్తింపులాంటి కీలకమైన వాస్తవాలను వక్రీకరించడం చారిత్రక ఘటనలను తప్పుగా చూపించడమే అవుతుంది. అంతేకాదు ఇదొక తప్పుడు సాంప్రదాయానికి తెరతీస్తుంది. ఇది ప్రజల్లో మరింత తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయకుండా వెంటనే కోర్టు జోక్యం చేసుకోవాలి" అని పిటిషన్ లో సూర్జిత్ సింగ్ కోరారు.

మరోవైపు ఈ వెబ్ సిరీస్ పై ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఓటీటీ కంటెంట్ హెడ్ కు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. జాతి మనోభావాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదంటూ అందులో స్పష్టం చేసింది. ఈ సిరీస్ ను అనుభవ్ సిన్హా డైరెక్ట్ చేశాడు.

బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్

ఈ సిరీస్ లో హైజాకర్ల అసలు పేర్లను పక్కన పెట్టిన భోళా, శంకర్ అని పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే అవుతుందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్, బాయ్‌కాట్ బాలీవుడ్ హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ ఐసీ 814: ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ లో విజయ్ వర్మ కీలకపాత్రలో నటించాడు. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.