IC-814 fact check : నెట్​ఫ్లిక్స్​ సిరీస్​లో టెర్రరిస్ట్​ల పేర్లను కావాలనే మార్చారా? అసలు నిజం ఇదే..-ic 814 controversy has netflix really changed names of terrorists ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ic-814 Fact Check : నెట్​ఫ్లిక్స్​ సిరీస్​లో టెర్రరిస్ట్​ల పేర్లను కావాలనే మార్చారా? అసలు నిజం ఇదే..

IC-814 fact check : నెట్​ఫ్లిక్స్​ సిరీస్​లో టెర్రరిస్ట్​ల పేర్లను కావాలనే మార్చారా? అసలు నిజం ఇదే..

Sharath Chitturi HT Telugu
Sep 03, 2024 06:40 AM IST

ఐసీ 814: కాందహార్ హైజాక్ చుట్టూ వివాదం నెలకొంది. ఉగ్రవాదులకు హిందువుల పేర్లు పెట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీని వెనుక అసలు నిజం ఏంటి? కావాలనే హిందువుల పేర్లు పెట్టారా? కీలకమైన హోంశాఖ, విదేశాంగశాఖ డాక్యుమెంట్స్​ ఏం చెబుతున్నాయి?

ఐసీ 814 కాందహార్​ హైజాక్​ చుట్టూ వివాదం..
ఐసీ 814 కాందహార్​ హైజాక్​ చుట్టూ వివాదం..

అనుభవ్ సిన్హా ఇటీవల రూపొందించిన థ్రిల్లర్ సిరీస్ ఐసీ 814: ది కాందహార్ హైజాక్​ వివాదంలో చిక్కుకుంది. ఈ సిరీస్​లో ఉగ్రవాదుల పేర్లను హిందువులుగా మార్చి, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయంపై సోషల్​ మీడియాలో #BoycottNetflix, #BoycottBollywood వంటి హ్యాష్​ట్యాగ్​లు ట్రెండ్​ అవుతున్నాయి. అంతేకాదు నెట్​ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్​కు ప్రభుత్వం సమన్లు సైతం జారీ చేసింది. ఈ సిరీస్ లోని వివాదాస్పద అంశాలపై వివరణ ఇవ్వాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మరి ఈ వివాదంలో నిజం ఎంత? వెబ్​ సిరీస్​ మేకర్స్​ నిజంగానే ఉగ్రవాదుల పేర్లను మార్చారా? అసలు నిజాన్ని ఇక్కడ తెలుసుకోండి.

అసలు వివాదం ఏంటి?

1999 డిసెంబర్​లో నేపాల్​లోని ఖాట్మండు నుంచి భారత్​లోని దిల్లీకి బయలుదేరిన ఐసీ 814 ఇండియన్ ఎయిర్​లైన్స్ విమానాన్ని ఐదుగురు సాయుధులు హైజాక్ చేశారు. అమృత్​సర్, లాహోర్ తర్వాత చివరికి నాడు తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘానిస్థాన్​లోని కాందహార్ సహా పలు ప్రాంతాలకు విమానాన్ని నడపాలని టెర్రరిస్ట్​లు పైలట్​ను బలవంతం చేశారు. హైజాకర్లతో చర్చల అనంతరం 179 మంది ప్రయాణికుల భద్రతకు బదులుగా భారత్​లో బందీగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను భారత ప్రభుత్వం విడుదల చేసింది.

గత గురువారం నెట్​ఫ్లిక్స్​ ఇండియాలో ఈ షో ప్రసారమైన తర్వాత, బర్గర్, డాక్టర్, చీఫ్, భోలా, శంకర్ అనే మారుపేరు (అలియాస్​)తో ఐదుగురు ముస్లిం హైజాకర్ల గుర్తింపును దాచడంపై ఇంటర్నెట్​లో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది.

"చిత్రనిర్మాత అనుభవ్ సిన్హా ఉగ్రవాదుల అసలు పేర్లను మార్చి, వారి నేరపూరిత ఉద్దేశాన్ని చట్టబద్ధం చేశారు," అని బీజేపీ ఐటీ సెల్​ హెడ్​ అమిత్ మాలవీయ ఎక్స్​లో పోస్ట్ చేశారు. "దశాబ్దాల తరువాత, హిందువులు ఐసీ -814 ను హైజాక్ చేశారని ప్రజలు అనుకుంటున్నారు. ఇది దీర్ఘకాలంలో భారతదేశ భద్రతా యంత్రాంగాన్ని బలహీనపరచడమే కాకుండా, అన్ని రక్తపాతానికి కారణమైన మత సమూహం నుంచి నిందను దూరం చేస్తుంది," అని ఆయన అన్నారు.

చాలా మంది ఇతర ఎక్స్ వినియోగదారులు ఈ వివాదాన్ని ముందుకు తీసుకెళ్లారు. భోలా, శంకర్​ పేర్లు ఎందుకు పెట్టారని? అసలు పేర్లను ఎందుకు దాచారని మండిపడుతున్నారు. చివరికి ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ ఇప్పుడు నెట్​ఫ్లిక్స్​ ఇండియా కంటెంట్ హెడ్​ని వివరణ కోసం పిలిచింది.

అసలు నిజం ఇదే..

ఐసీ 814: కాందహార్ హైజాక్​ సిరీస్​లో ఐదుగురు హైజాకర్ల అసలు వివరాలు బహిర్గతం కానప్పటికీ, వారి కోడ్ నేమ్స్​తో షోని నడిపించారు.

వాస్తవానికి ఈ కోడ్​ నేమ్స్​ని కూడా 1999లో నాటి హోంశాఖ ధ్రువీకరించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్​సైట్ లో కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి.

సంబంధిత డాక్యుమెంట్స్​ ప్రకారం- ఉగ్రవాదుల అసలు పేర్లు..

  • ఇబ్రహీం అథర్, బహవల్​పూర్
  • షాహిద్ అక్తర్ సయ్యద్, గుల్షన్ ఇక్బాల్, కరాచీ
  • సన్నీ అహ్మద్ ఖాజీ, డిఫెన్స్ ఏరియా, కరాచీ
  • మిస్త్రీ జహూర్ ఇబ్రహీం, అక్తర్ కాలనీ, కరాచీ
  • షకీర్, సుక్కుర్ నగరం

కానీ హైజాక్ సమయంలో ఉగ్రవాదులు తమ సొంత పేర్లను వాడుకోలేదు. బదులుగా కోడ్​ నేమ్స్​ (1) చీఫ్, (2) డాక్టర్, (3) బర్గర్, (4) భోలా (5) శంకర్ అని పిలుచుకున్నారు. దీనినే నెట్​ఫ్లిక్స్​ సిరీస్​లో చూపించారు.

హెచ్​టీ మాట్లాడిన అప్పటి ఐసీ-814 సిబ్బందిలో కొందరు కూడా ప్రభుత్వ ప్రకటనను ధృవీకరించారు. అయితే, ఐసీ 814 సిరీస్​లో హైజాకర్ల కోడ్​ నేమ్స్​ని వాడినప్పటికీ, ఏదో ఒక చోట వారి అసలు పేర్లను కూడా బయటపెట్టి ఉండేదని నాటి విమానంలోని సిబ్బందిలో ఒకరు అభిప్రాయపడ్డారు.

జెనీవాలో ఉన్న సీనియర్ ఫ్లైట్ పర్సర్ (క్యాబిన్ క్రూ ఇంచార్జి) అనిల్ శర్మ మాట్లాడుతూ.. “వివాదంలో ఉన్న రెండు పేర్లు (భోలా- శంకర్) వాస్తవానికి హైజాకర్లు ఉపయోగించారు. అందులో డౌట్​ లేదు. కానీ వెబ్​సిరీస్ నిర్మాతలు ఏదో ఒక విధంగా ఆ పేర్లు వారి అసలు పేర్లు కాదని స్పష్టం చేసి ఉంటే బాగుండేది,” అని అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం