Boycott Netflix Trending: టాప్ ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్.. బాయ్‌కాట్ బాలీవుడ్ కూడా.. ఎందుకిలా?-boycott netflix boycott bollywood trending on social media x ic 814 web series controversy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Boycott Netflix Trending: టాప్ ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్.. బాయ్‌కాట్ బాలీవుడ్ కూడా.. ఎందుకిలా?

Boycott Netflix Trending: టాప్ ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్.. బాయ్‌కాట్ బాలీవుడ్ కూడా.. ఎందుకిలా?

Hari Prasad S HT Telugu
Sep 03, 2024 09:09 AM IST

Boycott Netflix Trending: బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్, బాయ్‌కాట్ బాలీవుడ్ ఇప్పుడు సోషల్ మీడియా ఎక్స్ లో టాప్ ట్రెండింగ్స్ గా ఉండటం గమనార్హం. నెట్‌ఫ్లిక్స్, బాలీవుడ్ లపై విరుచుకుపడుతూ వేల మంది అభిమానులు ఈ హ్యాష్‌ట్యాగ్స్ ను పోస్ట్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా?

టాప్ ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్.. బాయ్‌కాట్ బాలీవుడ్ కూడా.. ఎందుకిలా?
టాప్ ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్.. బాయ్‌కాట్ బాలీవుడ్ కూడా.. ఎందుకిలా?

Boycott Netflix Trending: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తోపాటు బాలీవుడ్ ను కూడా బహిష్కరించాలంటూ ఎక్స్ లో ఇప్పుడు చాలా మంది అభిమానులు బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్స్ ను పోస్ట్ చేస్తున్నారు. రెండు రోజులుగా ఈ ఉద్యమం నడుస్తుండగా.. ఇవాళ (సెప్టెంబర్ 3) ఇది తారాస్థాయికి చేరి బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్, బాయ్‌కాట్ బాలీవుడ్ టాప్ ట్రెండింగ్ లలో ఉన్నాయి.

బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్

బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్ హ్యాష్ ట్యాగ్ ను ఇండియాలోని ఎక్స్ యూజర్లు పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నారు. దీనికి కారణం ఆ ఓటీటీలో ఈ మధ్యే వచ్చిన ఐసీ 814 వెబ్ సిరీస్. ఈ సిరీస్ లో కావాలనే ముస్లిం టెర్రరిస్టుల పేర్లను హిందువులుగా మార్చేశారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ అనుభవ్ సిన్హా, రైటర్ త్రిషాంత్ శ్రీవాస్తవలే దీనికి కారణం అంటూ మండిపడుతున్నారు.

ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ ను బహిష్కించాలని పిలుపునిస్తున్నారు. ఈ సిరీస్ లో 1999లో జరిగిన కాందహార్ హైజాక్ గురించి చూపించారు. ఆ హైజాక్ చేసిన ఉగ్రవాదులు పేర్లు ఇబ్రహీం ఆథర్, షాహిద్ అక్తర్, సన్నీ అహ్మద్, జహూర్ మిస్త్రీ, షాకిర్ కాగా.. ఈ సిరీస్ లో మాత్రం భోళా, శంకర్ అనే పేర్లు పెట్టారంటూ కొందరు మండిపడుతున్నారు.

బాయ్‌కాట్ బాలీవుడ్ కూడా..

బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్ తోపాటు దీనికే బాయ్‌కాట్ బాలీవుడ్ హ్యాష్ ట్యాగ్ కూడా జోడిస్తున్నారు. బాలీవుడ్ ఎప్పుడూ ఇలాగే చేస్తుందని, హిందువులను కించపరిచేలా సినిమాలు తీస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చాలా హిందీ సినిమాల్లో హిందువులను చాలా దారుణంగా చూపిస్తున్నారని, ముస్లింలను మాత్రం గొప్పవాళ్లుగా చిత్రీకరిస్తున్నారని కొందరు ఉదాహరణలతో సహా పోస్టులు చేస్తున్నారు. ఈ సందర్భంగా మరికొందరు పీకే సినిమాలో ఆమిర్ ఖాన్ హిందువులను అవమానించేలా చేసిన ఓ సీన్ ను కూడా షేర్ చేస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ ఎందుకిలా చేసింది?

ఐసీ 814: కాందహార్ హైజాక్​ సిరీస్​లో ఐదుగురు హైజాకర్ల అసలు వివరాలు బహిర్గతం కానప్పటికీ, వారి కోడ్ నేమ్స్​తో షోని నడిపించారు.

వాస్తవానికి ఈ కోడ్​ నేమ్స్​ని కూడా 1999లో నాటి హోంశాఖ ధ్రువీకరించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్​సైట్ లో కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి.

సంబంధిత డాక్యుమెంట్స్​ ప్రకారం- ఉగ్రవాదుల అసలు పేర్లు..

ఇబ్రహీం అథర్, బహవల్​పూర్

షాహిద్ అక్తర్ సయ్యద్, గుల్షన్ ఇక్బాల్, కరాచీ

సన్నీ అహ్మద్ ఖాజీ, డిఫెన్స్ ఏరియా, కరాచీ

మిస్త్రీ జహూర్ ఇబ్రహీం, అక్తర్ కాలనీ, కరాచీ

షకీర్, సుక్కుర్ నగరం

కానీ హైజాక్ సమయంలో ఉగ్రవాదులు తమ సొంత పేర్లను వాడుకోలేదు. బదులుగా కోడ్​ నేమ్స్​ (1) చీఫ్, (2) డాక్టర్, (3) బర్గర్, (4) భోలా (5) శంకర్ అని పిలుచుకున్నారు. దీనినే నెట్​ఫ్లిక్స్​ సిరీస్​లో చూపించారు.

హెచ్​టీ మాట్లాడిన అప్పటి ఐసీ-814 సిబ్బందిలో కొందరు కూడా ప్రభుత్వ ప్రకటనను ధృవీకరించారు. అయితే, ఐసీ 814 సిరీస్​లో హైజాకర్ల కోడ్​ నేమ్స్​ని వాడినప్పటికీ, ఏదో ఒక చోట వారి అసలు పేర్లను కూడా బయటపెట్టి ఉండేదని నాటి విమానంలోని సిబ్బందిలో ఒకరు అభిప్రాయపడ్డారు.

జెనీవాలో ఉన్న సీనియర్ ఫ్లైట్ పర్సర్ (క్యాబిన్ క్రూ ఇంచార్జి) అనిల్ శర్మ మాట్లాడుతూ.. “వివాదంలో ఉన్న రెండు పేర్లు (భోలా- శంకర్) వాస్తవానికి హైజాకర్లు ఉపయోగించారు. అందులో డౌట్​ లేదు. కానీ వెబ్​సిరీస్ నిర్మాతలు ఏదో ఒక విధంగా ఆ పేర్లు వారి అసలు పేర్లు కాదని స్పష్టం చేసి ఉంటే బాగుండేది,” అని అన్నారు.

Whats_app_banner