Minister Sridhar Babu : ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోంది, కేటీఆర్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Minister Sridhar Babu : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్ కుట్ర పన్నుతుందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. బీఆర్ఎస్ అంతర్గత సమస్యను రాష్ట్ర సమస్యగా సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఎవరు తెలివి తేటలు చూపిస్తున్నారో ప్రజలకు ప్రత్యక్షంగా కనబడుతుందన్నారు.
Minister Sridhar Babu : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్ కుట్ర పన్నుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. హైదరాబాద్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే గత పదేళ్లుగా పాలించిన బీఆర్ఎస్ ఈర్ష్య ద్వేషంతో హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ అంతర్గత సమస్యను రాష్ట్ర సమస్యగా సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని... ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు.
గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థం పెద్దపల్లి జిల్లా మంథనిలో గణనాథునికి మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావుల చెరువుకట్ట గజానన సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీధర్ బాబు తన సతీమణి సీనియర్ ఐఏఎస్ శైలజా రామయ్యర్ తో కలిసి గణపతి హోమం నిర్వహించారు. రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని పాడిపంటలతో రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు.
పార్టీ అంతర్గత సమస్యను రాష్ట్ర సమస్యగా సృష్టించే యత్నం
గణేష్ పూజల అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో చేసిన వ్యాఖ్యలు పట్ల మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందన్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వాళ్ల మాదిరిగా మేము ఇతర పార్టీల అంతర్గత విషయాల్లో తలదూర్చమని స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత సమస్యను వారు పరిష్కరించుకోవాల్సింది పోయి అందులోకి కాంగ్రెస్ ను లాగడాన్ని ప్రజలందరు గమనిస్తున్నారని తెలిపారు. ఎవరు తెలివి గలవారో ప్రజలే చెప్తారనీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ప్రజలందరూ తెలంగాణ ప్రజలేనని వారందరినీ గౌరవిస్తామన్నారు.
బీఆర్ఎస్ ఈర్ష్య ద్వేషంతో
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి అందరు పాలుపంచుకోవాలన్నారు. గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఈర్ష ద్వేషంతో దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఎవరు ఏం చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుతామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పార్టీలోని అంతర్గత సమస్యను రాష్ట్ర సమస్యగా సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ప్రభుత్వం చూస్తూ ఊర్కోదని హెచ్చరించారు.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం