Minister Ponnam Prabhakar : బీఆర్ఎస్ తీరు చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతుందనే అనుమానం- మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఊపేక్షించమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తీరు చూస్తే కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటూ కాంగ్రెస్ ను బద్నాం చేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు.
Minister Ponnam Prabhakar : బీఆర్ఎస్ తీరు కేటీఆర్ వైఖరిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజకీయపరంగా విమర్శలతో కొట్లాడుకోవాలనుకుంటే కొట్లాడుకోండి...కానీ కాంగ్రెస్ ను బద్నాం చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ప్రభుత్వం చూస్తూ ఊర్కోబోదని హెచ్చరించారు. పరిపాలించే తహత్తు బీఆర్ఎస్ ఒక్కరికే ఉందనుకోవద్దని హితవు పలికారు. పరిపాలించడం, శాంతిభద్రతలను కాపాడడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య అని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు ఎవరు భంగం కలిగించిన కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ తీరు చూస్తే కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ లో సోమవారం జరిగే గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను పరిశీలించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ చహత్ బాజ్ పాయ్ తో కలిసి మానకొండూర్ చెరువు వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఎల్లుండి 17న జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా పకడ్బందీ చర్యలు చేపట్టామని తెలిపారు. శోభయాత్ర ప్రశాంతంగా జరిగేలా నిమజ్జనానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్, మున్సిపల్, పంచాయితీ రాజ్, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు..
కరీంనగర్ లోని వందలాది గణేష్ విగ్రహాలను మనకొండూరు, కొత్తపల్లి, చింతకుంట చెరువులో నిమజ్జనం చేస్తారన్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించిందని తెలిపారు. వేడుకలు ఘనంగా జరగాలని, ప్రజాపాలన లో ఎలాంటి విఘ్నాలు లేకుండా నవరాత్రులు ఘనంగా జరగాలని సానుకూల వైఖరి ఎక్కడ ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయిలో అనేక రివ్యూలు జరిగాయన్నారు. అతిథులు , వీఐపీ వస్తే రెవెన్యూ పరంగా తీసుకోవాల్సిన చర్యలు అన్నీ రకాల శాఖల భాగస్వామ్యం కావాలని సూచించారు. అధికారులు ప్రభుత్వం చేస్తేనే సరిపోదు... మండపాల నిర్వాహకులు , గణేష్ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ వారు అందరూ కలిసి కట్టుగా గణేష్ నిమజ్జనోత్సవాలను సక్సెస్ చేయాలని కోరారు.
హైదరాబాద్ లో నిమజ్జనంపై సందేహం లేదు
భాగ్యనగర్ లో జరిగే గణేష్ నిమజ్జనోత్సవంపై ఎలాంటి సందేహాలు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాల సమితితో మాట్లాడనని గతంలో హైదరాబాద్ లో భాగ్యనగర్, గణేష్ ఉత్సవ సమితి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయో ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ జరుగుతున్నాయని తెలిపారు. శాంతి భద్రతలు, హెచ్ఎండీఏ,
జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. అయోమయం , కన్ఫ్యూజన్ అవసరం లేదన్నారు. 17న త్వరితగతిన నిమజ్జనం పూర్తి చేయాలని... ఆ రోజు హైదరాబాద్ లో సెలవు ప్రకటించామన్నారు. 18న సచివాలయం పనిదినం కావున ఆలోపు నిమజ్జనం ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
బీఆర్ఎస్ కుట్ర
పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రకటనలు చూస్తే కుట్ర జరుగుతుందనే అనుమానాలు కలుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా దయచేసి అందరు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గణేష్ నిమజ్జనం వేళ రాజకీయాలు వద్దని, మరోసారి మాట్లాడుకుందామన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు 10 నెలలోనే అసహనానికి గురై విమర్శలు చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు , హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు కన్పిస్తున్నాయన్నారు. శాంతి భద్రతలకు విఘాతం జరిగితే ఉపేక్షించేది లేదు కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇప్పటికే హైదరాబాద్ కలెక్టరేట్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పామన్నారు.
17, 18 వ తేదీ వరకు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు ప్రకటనలు చేయడానికి వీలులేదన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయం హైకోర్టులో ఉంది....అది శాసన సభ చూసుకుంటుందని తెలిపారు. రాజకీయ విమర్శలు చేస్తే కొట్లాడుకోవాలనుకుంటే వినాయక నిమజ్జనం తరువాత కొట్లాడుకోండని సూచించారు. అందరూ సంయమనంతో ఉండాలని, శాంతి భద్రతలకు సంబందించి ఏ పార్టీ అయినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం