Karimnagar Loan Apps: ప్రాణం తీసిన లోన్ యాప్, కరీంనగర్‌లో ఒకరి మృతి… మరొకరికి ప్రాణాపాయ స్థితిలో చికిత్స
Karimnagar Loan Apps: లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు మితిమీరాయి. వేదింపులు బరించలేక ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. ఒకరి మృతి చెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్నాయి
Karimnagar Loan Apps: లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు మితిమీరాయి. వేదింపులు బరించలేక ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. ఒకరి మృతి చెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్నాయి.
కరీంనగర్ లోని కోతిరాంపూర్ లో నివాసం ఉండే గూడ సతీష్ రెడ్డి(35) రోజుల క్రితం నుంచి లోన్ యాప్ లో అప్పు తీసుకున్నారు. కోర్టు చౌరస్తాలో సతీష్ అసోసియేట్ కన్సల్టెన్సీ పేరిట ఆఫీస్ ఏర్పాటు చేసుకొని అవసరం ఉన్నవారికి పలు బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తున్నాడు.
లోన్ యాప్ ద్వారా తీసుకున్న లోన్ చెల్లించడంలో కాస్త ఆలస్యం కావడంతో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు మొదలయ్యాయి. లోను చెల్లించకపోతే భార్య పిల్లల అంతు చూస్తామని బెదిరించడంతో మనస్థాపం చెందిన సతీష్ తన ఆఫీస్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతునికి భార్య ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. లోన్ యాప్ లో తీసుకున్న డబ్బులు చెల్లించాలని ఫోన్ కాల్, వాట్సాప్ కాల్స్ తో వేదించారని కుటుంబసభ్యులు తెలిపారు. సతీష్ రెడ్డి మృతి చెందితే మీరు కట్టాలని వేధిస్తున్నారని మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఒంటిపై పెట్రోల్ పోసుకుని సుసైడ్ అటెంప్ట్..
కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన తూండ్ల శ్రీనివాస్ లోన్ యాప్ వేదింపులతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు గమనించి మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా తీసుకున్న లోన్ చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తుండడంతో ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
లోన్ యాప్ నిర్వాహకులపై కేసు నమోదు..
లోన్ యాప్ వేధింపులతో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.అప్పులు ఇస్తామని ఆశ చూపి ఆ తర్వాత వేధింపుల గురి చేస్తూ కుటుంబ సభ్యుల పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని బాదిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఆత్మహత్యలకు లోన్ యాప్ నిర్వాహకులే కారణమని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ పోలీసులకు పిర్యాదు చేశారు. బాధిత కుటుంబాల పిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)