BRS Protest : సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత - బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్
సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వేర్వురు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. ఘటన జరిగిన వెంటనే పలువురు ఎమ్మెల్యేలు,ముఖ్య నేతలు కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అక్కడ్నుంచి నేరుగా సైబరాబాద్ సీపీ ఆఫీస్ కు వెళ్లారు.
దాడికి పాల్పడిన ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే అంశంపై సీపీ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ ఆందోళన సాగింది.
ఈ క్రమంలోనే సీపీ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనచారితో పాటు పాటు పార్టీ ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని వేర్వురు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మీద జరిగిన దాడిపై సైబరాబాద్ జాయింట్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ… పోలీసుల వైఫల్యం వల్లే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందన్నారు. ఇందుకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నార్సింగి పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి న్యాయం జరగాలని… రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడాలని కోారారు.
“హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినొద్దు అని మేం కోరుకుంటున్నాం. గతంలో తెలంగాణ పోలీసులు దేశానికి రోల్ మోడల్‌గా ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పోలీసులను తమ పని తమను చేసుకోనివ్వడం లేదు. పోలీసులను వాళ్ల అక్రమాలకు, అరాచకాలకు, అక్రమ కేసులకు వాడుకుంటున్నారు.మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసులకు 1వ తేదీన జీతాలు ఇస్తామన్నారు. సైబరాబాద్ పరిధిలో 12 వందల మంది హోంగార్డులు ఉన్నారు. పోలీసులకు టీఏలు, డీఏలు రిలీజ్ అవట్లేదు. కానిస్టేబుళ్లకు సరెండర్ లీవ్ డబ్బులు ఇవ్వట్లేదు. కాంట్రాక్టర్లకు వందల కోట్ల డబ్బులిస్తున్నారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. లేదంటే సీబీఐ విచారణ కోరుతాం, అవసరమైతే కోర్టుకు వెళ్తాం, కేంద్ర హోంశాఖ వద్దకు వెళ్తాం. నిజనిజాలు బయటకు రావాలి”అని హరీశ్ రావు అన్నారు.
రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లో పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని హరీశ్ రావు ఆరోపించారు. ఈ దాడి వెనుక పాత్రదారులెవరూ? సూత్రదారులెవరూ? సహకరించింది ఎవరో అన్నీ బయటకు రావాలన్నారు. రాళ్లు, కత్తులు, కర్రలతో కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారన్న హరీశ్ రావు…. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే రాహుల్ గాంధీ ఇంటి ముందు, ఏఐసీసీ కార్యాలయం ముందు ధర్నాం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
సంబంధిత కథనం
టాపిక్