BRS Party Expansion: భారీ సభకు BRS ప్లాన్! అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా?-brs party to plan first public meeting at nanded in maharashtra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Party Expansion: భారీ సభకు Brs ప్లాన్! అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా?

BRS Party Expansion: భారీ సభకు BRS ప్లాన్! అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా?

Mahendra Maheshwaram HT Telugu
Dec 24, 2022 07:52 PM IST

KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు. ఇక పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు. సరిహద్దు ప్రాంతాలే టార్గెట్ గా ముందుకెళ్లే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా నాందేడ్ జిల్లా పరిధిలో భారీ సభను తలపెట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్
బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్ (twitter)

BRS to Plan Public Meeting at Nanded District: తెలంగాణ రాష్ట్ర సమితి.. ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారింది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇందుకోసం పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ప్రాంతీయ పార్టీల అధినేతలతో పాటు రైతు సంఘాల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి కూడా వెళ్లారు. మరోవైపు ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై కూడా ఫోకస్ పెంచుతున్నారు. అయితే మొదటి టార్గెట్ మాత్రం… సరిహద్దు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలని తెలుస్తోంది. ఇందులో భాగంగా జనవరిలో భారీ సభకు బీఆర్ఎస్… ప్లాన్ చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది.

నాందేడ్ జిల్లాలో సభ..?

బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి అయితే మహారాష్ట్రపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో ఊరురా పార్టీని విస్తరించాలని చూస్తోంది. ఇప్పటికే సరిహద్దు ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ దిశగా ముందుకెళ్తున్నారు. పలు గ్రామాల్లో పర్యటిస్తూ... ప్రచారం కూడా చేస్తున్నారు. త్వరలోనే కమిటీలు కూడా వేయనున్నట్లు చెబుతున్నారు. రెండు రోజుల కిందటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మహారాష్ట్రలో పర్యటించారు. నాందేడ్ జిల్లా భోకర్ తాలుకా కీని గ్రామంలో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా కొందరు పార్టీలో కూడా చేరారు. ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారంలో నాందేడ్‌ జిల్లాలో భారీ సభను నిర్వహించాలని యోచిస్తోంది. ఈ సభకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారని తెలుస్తోంది.

నిజానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని గ్రామాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడి వారితో బంధుత్వాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు గ్రామాలు.. తెలంగాణలో కలపాలని కూడా కోరుకుంటున్నాయి. ఆయా గ్రామాలు కూడా తీర్మానాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందులో ధర్మాబాద్, భోకర్, బిలోలి, దెగ్లూర్, నర్సి, నాయగాం, ముత్కేడ్, ఉమ్రి, కిన్వట్ వంటి గ్రామాలు ఉన్నాయి. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది బీఆర్ఎస్ పార్టీ. ఈ ప్రాంతంలో పార్టీని విస్తరించడం సులభ తరమవుతుందని భావిస్తోంది.

అన్నీ కుదిరితే జనవరిలో భారీ సభను నిర్వహించి... స్థానికంగా ఉండే ప్రజలకు గట్టి సందేశాన్ని పంపాలని చూస్తోంది. అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదాన్ని బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇక్కడ సభను విజయవంతం చేసి... ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరణ కార్యాచరణను వేగవంతం చేయాలని చూస్తోంది.

Whats_app_banner