BRS Party: ఢిల్లీలో 'బీఆర్ఎస్' ఆఫీస్.. ఇవాళే ప్రారంభం
BRS Office in Delhi: ఇవాళ ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 తర్వాత జరిగే ఈ కార్యక్రమానికి పలు ప్రాంతీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఆఫీసులో తలపెట్టిన రాజశ్యామల, నవచండీయాగాల్లో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారు.
BRS Party Office inaguration in Delhi: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఈ మేరకు జరగాల్సిన ప్రక్రియను కూడా పూర్తి చేశారు. తాజాగా పార్టీ జెండాతో పాటు నినాదాన్ని కూడా ప్రకటించారు. మరోవైపు ఇవాళ ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ను ప్రారంభించనున్నారు కేసీఆర్. సర్దార్ పటేల్ రోడ్‌లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
బుధవారం మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాలకు ఆఫీస్ ను ప్రారంభించనున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఈ ప్రారంభోత్సవానికి కుమారస్వామి, అఖిలేష్ యాదవ్ తో పాటు ఎంపీలు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. తొలుత పార్టీజెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు. మరోవైపు సోమవారం రాత్రే కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర కార్యాలయానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. అంతకు ముందు వసంత్‌విహార్‌లో బీఆర్ఎస్ కోసం నిర్మిస్తున్న సొంత కార్యాలయ భవనం వద్దకు వెళ్లి.. పనులు పరిశీలించారు. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం పూజలు మొదలుకాగా.. ఇవాళ నిర్వహించే రాజశ్యామల, నవచండీయాగాల్లో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు.
మరోవైపు ఆఫీస్ పరిసరాల్లో భారీగా ఫెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఫొటోలు, పార్టీ నినాదాలతో సర్దార్‌పటేల్ రోడ్డు గులాబీమయంగా మారిపోయింది. లంగాణ భవన్, తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసం పలువురు ఎంపీల నివాసాల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. ఇక బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు ముఖ్య నేతలు ఢిల్లీ బాట పట్టారు. మంగళవారం రాత్రికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధ్యక్షులతో పాటు విద్యార్థి నేతలతో పాటు ఇతర అనుబంధ సంఘాల ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో కలిసి వీరంతా బీఆర్‌ఎస్ ఆఫీస్ ప్రారంభ ఉత్సవాల్లో పాల్గొననున్నారు.