Bandi Sanjay: తెలంగాణతో కేసీఆర్‌కు బంధం తెగిపోయింది: బండి సంజయ్
Bandi Sanjay comments on KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శల దాడి చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన ఈ కామెంట్లు చేశారు.
Bandi Sanjay comments on KCR: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్చడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేశారని, దీంతో ఆయనకు ఈ రాష్ట్రంతో బంధం తెగిపోయిందని విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కరీంగనగర్‌లోని పూడూరులో మంగళవారం నిర్వహించిన రోడ్‍షోలో బండి సంజయ్ మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో ఎమ్మెల్యే కవితపై కూడా విమర్శలు చేశారు.
‘రాష్ట్రానికి కేసీఆర్ ద్రోహం చేశారు’
ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణకు ద్రోహం చేశారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఇక ఢిల్లీ వెళ్లారని, ఆయన పీడ విరగడ అయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరును మార్చుకున్న కేసీఆర్ కు ఇక తెలంగాణతో బంధం తెగిపోయిందని అన్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా సహా చాలా దోపిడీలకు కేసీఆర్ పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. తెలంగాణను దోచుకున్న ఆయనను విడిచిపెట్టబోమని బండి వ్యాఖ్యానించారు.
‘కవిత.. లిక్కర్ దందా’
కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. అలాంటి కవితను విడిచిపెట్టాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దోచుకున్న డబ్బుతో అక్కడ స్కామ్‍కు పాల్పడ్డారని విమర్శించారు.
కాగా, తనను ఎంపీగా గెలిచిపించిన కరీంనగర్ ప్రజలకు బండి మరోసారి కృతజ్ఞతలు చెప్పారు. ప్రజల కోసమే ఈ యాత్ర చేస్తున్నానని, టీఆర్ఎస్ నేతల్లా ఫామ్‍హౌజ్‍లో తాను నిద్రపోనని మాట్లాడారు. తెలంగాణలో పేదోళ్ల ప్రభుత్వం వస్తేనే, ప్రజలకు న్యాయం జరుగుతుందని బండి సంజయ్ అన్నారు.
కేసీఆర్ మాటలు నమ్మలేం..
రాష్ట్రంలోని వివిధ ఆలయాలను అభివృద్ధి చేస్తానని కేసీఆర్ గతంలో చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బండి సంజయ్ విమర్శించారు. వేములవాడ, బాసర ఆలయాల అభివృద్ధికి కూడా ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆరోపించారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు.. కొండగట్టుకు రూ.100కోట్ల నిధులు ఇస్తామని చెబుతున్నారని, ఆయన మాటలను నమ్ముతామా అని ప్రశ్నించారు. అలాగే ఖాదీబోర్డును పద్మశాలీలకు ఇవ్వాలని బండి డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ నేతలకు కళ్లు తలకెక్కాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని ఆ పార్టీ నేతలను ప్రజలు నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఉంటుందని బండి సంజయ్ ప్రకటించారు.