TG Teacher Appointment Letter : ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 9న నియామక పత్రాలు.. 10 ముఖ్యమైన అంశాలు-2024 dsc selected teacher candidates will be given appointment letters on 9th of this month 10 important points related ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Teacher Appointment Letter : ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 9న నియామక పత్రాలు.. 10 ముఖ్యమైన అంశాలు

TG Teacher Appointment Letter : ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 9న నియామక పత్రాలు.. 10 ముఖ్యమైన అంశాలు

Basani Shiva Kumar HT Telugu
Oct 07, 2024 07:48 AM IST

TG Teacher Appointment Letter : 2024 డీఎస్సీకి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 9న వీరికి అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వనున్నారు.

ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 9న నియామక పత్రాలు
ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 9న నియామక పత్రాలు (CMO)

తెలంగాణలో 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 9న నియామక పత్రాలు ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నియామక పత్రాలను ఇవ్వనున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఆదివారం సీఎస్‌ టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

10 ముఖ్యాంశాలు..

1.పది వేల మందికి పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలను జారీ చేయనున్నారు.

2.ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పూర్తిచేశారు.

3.సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యా కమిషనర్‌ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేయనున్నారు.

4.ఈ నెల 9 మధ్యాహ్నం 2 గంటల లోపు ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరు ఎల్‌బీ స్టేడియంకు చేరేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు.

5.ప్రతి బస్సులో ఒక పోలీస్‌ కానిస్టేబుల్, సమన్వయ అధికారిని నియమించాలని సీఎస్ ఆదేశించారు.

6.జిల్లాల నుంచి వచ్చే బస్సులకు సమీపంలోనే పార్కింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నారు.

7.అభ్యర్థులను స్టేడియం సమీపంలో దించే విధంగా చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు.

8.హైదరాబాద్ నగరంలో 9న వర్షం వచ్చే అవకాశం ఉన్నందునా.. రెయిన్‌ ప్రూఫ్‌ షామియానాను ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు.

9.ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు.. వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

10.ఎల్బీ స్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

టీచర్ పోస్టుల భర్తీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం మొత్తం 25,924 మందికి అవకాశం కల్పించారు. కానీ.. 24,466 మంది హాజరయ్యారు. 1,458 మంది రాలేదు. టీచర్‌ పోస్టులకు పోటీపడిన వారిలో అధిక శాతం మంది మహిళలే ఉన్నారు. వివాహం ముందు, తరువాత వారి ఆధార్‌కార్డుల్లో ఇంటి పేర్లు, ఇతర వివరాలు వేరుగా ఉన్నాయి. దీంతో ధ్రువపత్రాల పరిశీలన సందర్భంగా డీఈవోలు అభ్యర్థుల భర్తలను పిలిచి వారితో ఈమె తన భార్య అని లెటర్‌ రాయించుకుంటున్నారు.

పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితిని నివారించేందుకు మొదట ఎస్‌ఏ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేయడానికి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎస్‌జీటీకి ఎంపికైన వారికి సంబంధించిన జాబితా విడుదల చేయనున్నారు. మొదటి జాబితాలో ఉన్న వారెవరైనా రెండో దానిలోనూ ఉంటే.. ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్‌లో ఉన్న వారిని చేర్చనున్నారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు.

Whats_app_banner