Gudlavalleru Incident : గుడ్లవల్లేరు కాలేజీ ఘటన- రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
Gudlavalleru Incident : గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది.
Gudlavalleru Incident : కృష్ణా జిల్లాలోని బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా పరిగణలోకి తీసుకుంది. మహిళల భద్రత, గౌరవ హక్కుపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ, కమిషన్... ఏపీ సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.
కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ వాష్‌రూమ్ లో రహస్య కెమెరాలతో 300కి పైగా ఫొటోలు, వీడియోలు తీశారన్న ఆరోపణలపై మీడియా కథనాలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. విద్యార్థుల బృందం కెమెరాను కనుగొని నిరసన చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాయ్స్ హాస్టల్‌లోని కొంతమంది విద్యార్థులు ఈ వీడియోలను కొనుగోలు చేశారని, దీని కోసం ఒక విద్యార్థిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం అందిందని పేర్కొంది.
మీడియా కథనాలు వాస్తవమైతే
మీడియా కథనాలలోని అంశాలు నిజమైతే, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్యను లేవనెత్తుతుందని కమిషన్ పేర్కొంది. సంబంధిత అధికారులు మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించలేకపోతున్నారని, ఇది ఆందోళన కలిగించే సంఘటనగా స్పష్టమవుతుందని పేర్కొంది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ స్టేటస్‌తో సహా ఈ వ్యవహారంపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అధికారులు తీసుకున్న, ప్రతిపాదించిన చర్యలను కూడా నివేదికలో పేర్కొనాలని సూచించింది. రెండు వారాల్లోగా అధికారుల నుంచి స్పందన రావాలని ఆదేశించింది.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం