Nalgonda Mlc Elections: ఎన్నికల కోసం సిద్ధమవుతున్న టీచర్లు, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కమిషన్-teachers preparing for the election the commission released the election schedule ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nalgonda Mlc Elections: ఎన్నికల కోసం సిద్ధమవుతున్న టీచర్లు, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కమిషన్

Nalgonda Mlc Elections: ఎన్నికల కోసం సిద్ధమవుతున్న టీచర్లు, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కమిషన్

HT Telugu Desk HT Telugu
Oct 01, 2024 12:32 PM IST

Nalgonda Mlc Elections: టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చిలో టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవీ కాలం ముగియనుండటంతో నవంబర్ 6వ తేదీ వరకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించారు.

తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్ల నమోదు షురూ
తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్ల నమోదు షురూ (HT_PRINT)

Nalgonda Mlc Elections: తెలంగాణ మరో ఎన్నికకు సిద్ధమవుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా టీచర్ ఓటర్ల నమోదుకు షెడ్యూలు విడుదల చేసింది. వచ్చే నవంబరు ఆరవ తేదీ వరకు ఓట్లు నమోదు చేసుకోవాలని నిర్ణయించింది. 

నల్గొండ - ఖమ్మం – వరంగల్ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నిక జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ నియోజయవర్గం నుంచి సీపీఎం అనుబంధ ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ నేత ఎ.నర్సిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. కాగా, ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. కనుకనే, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరిలోగా ఎన్నిక జరపాల్సి ఉంది.

ఏర్పాట్లు చేస్తున్నఎన్నికల కమిషన్

నల్గొండ - ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి జరగాల్సిన ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి ఎమ్మెల్సీ పదవీకాలం మరో అయిదు నెలలు ఉన్నా ముందుగా ఓటర్ల నమోదు కోసం షెడ్యూలు విడుదల చేసింది. నవంబరు 6వ తేదీ వరకు ఓట్లు లేని కొత్త ఉపాధ్యాయులు తమ ఓట్లను నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

నవంబరు 23వ తేదీన ముసాయిదా ఓటరు లిస్టును ప్రకటిస్తారు. కాగా, ఎన్నికల కమిషన్ సోమవారం ఓటర్ల జాబితాను ప్రకటించింది. టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని పన్నెండు జిల్లాల పరిధిలో 20,888 మంది ఓట్లర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 13,658 మందికాగా 7,227 మంది మహిళా ఓటర్లు, ముగ్గురు ఇతర ఓట్లు ఉన్నారు.

ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటా పోటీ

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానిన దక్కించుకునేందుకు ఆయా టీచర్ యూనియన్లు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 2019 మార్చిలో జరిగిన ఎన్నికల్లో యూటీఎఫ్ నుంచి ఆ సంఘం రాష్ట్ర నాయకునిగా ఉండిన ఎ.నర్సిరెడ్డి గెలిచారు. మరో వైపు పీఆర్టీయూలో వచ్చిన చీలికలు, రెబల్ అభ్యర్థుల వల్ల యూటీఎఫ్ గెలుపు తేలికైంది.

అంతకు ముందు పీఆర్టీయూ నుంచే ఎమ్మెల్సీగా పనిచేసిన నల్గొండ జిల్లాకు చెందిన పూల రవీందర్ మొదట కాంగ్రెస్ కు అనుబంధంగా ఉండడంతో ఆ పార్టీ మద్దతుతోనే గెలిచారు. కానీ, ఆ తర్వాత పూల రవీందర్ కాంగ్రెస్ వైపు నుంచి బీఆర్ఎస్ కు దగ్గరయ్యారు.

వాస్తవానికి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగేవే. కాకుంటే ఆయా రాజకీయ పార్టీలకు అనుబంధ సంఘాలుగానో, లేదా మద్దతుతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ దగ్గర అయిన పూల రవీందర్ సిట్టింగ్ ఎమ్మెల్సీగా పోటీ చేసి యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

పూల రవీందర్ ఓటమిలో ఆయన సొంత సంఘం పీఆర్టీయూ నుంచే వరంగల్ జిల్లాలకు చెందిన సర్వోత్తమ్ రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలవడం ప్రధాన భూమిక పోషించింది. ఈ సారి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న యూటీఎఫ్, పీఆర్టీయూ అదే మాదిరిగా బీజేపీ అనుబంధ టీయూపీఎస్ ఉపాధ్యాయ సంఘాలు ప్రధాన పోటీదారులుగా ఉండనున్నారు.

ఉపాధ్యాయ వర్గాల సమాచారం మేరకు యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రెండో సారీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. పీఆర్టీయూ నుంచి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, నల్గొండ జిల్లాకే చెందిన మరో నాయకుడు సుంకరి బిక్షం గౌడ్ మధ్య టికెట్ కు పోటీ ఉండే సూచనలు ఉన్నాయి.

అత్యధిక ఓట్లు వరంగల్ అర్బన్ జిల్లాలో

నల్గొండ - ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో పేరుకు పన్నెండు జిల్లాలు ఉన్నా ఉమ్మడిగా చూసినప్పుడు మూడు జిల్లాలదే ప్రధాన భాగం. కొత్తగా ఏర్పడిన జిల్లాల మేరకు వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధికంగా 4,315 మంది ఓటర్లు ఉండగా, నల్గొండలో 3,859 మంది, ఖమ్మం జిల్లాలో 3,634, సూర్యాపేట 2,183, భద్రాద్రి కొత్తగూడెం 2,043, యాదాద్రి భువనగిరి 1,320, మహబూబాబాద్ 1,087, జనగాం 853, వరంగల్ రూరల్ 805, ములుగు 464, సిద్దిపేట 163, భూపాలపల్లి 162 మంది ఓటర్లు ఉన్నారు.

నవంబరు నెలాఖరులోగా కొత్త ఓటర్ల నమోదు తర్వాత కొత్త జాబితా విడుదల కానుంది. కాగా, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు యూటీఎఫ్ ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ కు అనుబంధంగా ఉండే పీఆర్టీయూ ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో చే జారిన తమ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగానే ఎత్తులు వేస్తోంది.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )