Prakasam District : ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుడి ఘరానా మోసం.. ఏకంగా రూ.6.70 కోట్లకు కుచ్చుటోపి
Prakasam District : ప్రకాశం జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఏకంగా రూ.6.70 కోట్లకు కుచ్చుటోపి పెట్టాడు. చిట్టీలు, ప్లాట్ల వ్యాపారం పేరుతో.. తోటి ఉపాధ్యాయులను, వ్యాపారస్తులను మోసం చేశారు. గత కొంత కాలంగా మెడికల్ లీవ్ పెట్టి.. భార్య, పిల్లలతో పరారయ్యాడు.
ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ అక్రమ లాభార్జనే ధ్వేయంగా పని చేశాడు. తోటి ఉపాధ్యాయులను, ప్రజలను మోసం చేసే మార్గాన్ని ఎంచుకున్నారు. వచ్చిన మంచి జీతంతో సంతృప్తి చెందకుండా.. అక్రమార్గంలో సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. నమ్మినవారినే నట్టేట ముంచాడు. నమ్మకంగా ఉన్న తోటీ ఉపాధ్యాయులను, స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేసి.. చిట్టీలు నిర్వహించేవాడు. అలాగే.. అప్పులు తీసుకుని మోసం చేసి పరారయ్యాడు.
ఆలస్యంగా వెలుగులోకి..
ఈ ఘటన ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బేస్తవారపేటకు చెందిన ఐతా కిషోర్‌కుమార్.. కొత్త మల్లాపురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. చిట్టీలు, ప్లాట్ల వ్యాపారం పేరుతో ఉపాధ్యాయులను మోసం చేశారు. గత కొంతకాలంగా మెడికల్ లీవ్ పెట్టి.. భార్య, పిల్లలతో పాటు పరారయ్యాడు. దీంతో బాధితులు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ బేస్తవారపేట ఎస్ఐని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కిషోర్ కుమార్‌పై చీటింగ్, చిట్ ఫండ్ కేసులు నమోదు చేశారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్‌లో ఆచూకీ..
హైదరాబాద్‌లో ఐతా కిషోర్ కుమార్ పోలీసులు పట్టుపడ్డాడు. అక్కడ అదుపులోకి తీసుకుని బేస్తవారపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనకు రిమాండ్ విధించారు. స్టేషన్‌లో పోలీసులు విచారణ చేపట్టగా.. దాదాపు రూ.6.70 కోట్ల మేర చిట్టీలతో పాటు, పలువురి వద్ద అప్పు తీసుకుని మోసం చేసి పరారైనట్లు తెలిసింది. రిమాండ్ అనంతరం బెయిల్ తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. అయితే.. బాధితులు తమకు న్యాయం జరగలేదని, తమ డబ్బులు తమకు వాపస్ చేయించాలని కోరుతున్నారు.
ఉపాధ్యాయుడి సస్పెన్షన్..
అనంతపురం జిల్లాలో చిట్టీల పేరుతో రూ.12 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన ఉపాధ్యాయుడు దివాకర్ నాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయను జైలులో పెట్టారు. అనంతపురంలోని రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా ఉన్న కాకర్ల దివాకర్ నాయుడు.. చిట్టీ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేశారు. మూడు నెలల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిన దివాకర్ నాయుడు.. ఇటీవల కోర్టులో లొంగిపోయారు. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన రెడ్డిపల్లి సబ్ జైలులో ఉన్నారు.
రిమాండ్ రిపోర్ట్‌తో..
ఆయనపై పోలీసుల రిమాండ్ రిపోర్టు విద్యాశాఖకు అందింది. ఈ క్రమంలో మూడు రోజుల కిందట షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు అతికించారు. సోమవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దివాకర్ నాయుడు అరెస్టు విషయం చాలా మంది బాధితులకు తెలీదు. ఆయన ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారని బాధితులు అనుకుంటున్నారు.
బాధితుల ఆవేదన..
ఆయన అరెస్టు గురించి మీడియాలో రావడంతో బాధితులు దివాకర్ నాయుడు పని చేస్తున్న పాఠశాలకు, డీఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇంటివద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతోనే పాఠశాలకు, డీఈవో కార్యాలయానికి వచ్చినట్లు బాధితులు తెలిపారు. తమ డబ్బులు వాపస్ చేయించాలని కోరుతున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)