Parliament news | టీఆర్ఎస్ సహా 19 మంది విపక్షఎంపీల సస్పెన్షన్
రాజ్యసభలో విపక్ష పార్టీలకు చెందిన 19 మంది ఎంపీలను వారం పాటు సస్పెండ్ చేశారు. సభా మర్యాదను పాటించకుండా, సభ కార్య క్రమాలను అడ్గుకుంటున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సభాపతి స్థానంలో కూర్చున్న డెప్యూటీ చైర్మన్ హరివంశ్ స్పష్టం చేశారు.
Parliament news | ఉదయం నుంచే రాజ్య సభ కార్యక్రమాలను విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. నినాదాలతో సభను హోరెత్తించారు. వెల్‌లోనికి దూసుకువెళ్లి సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. దాంతో, సభ పలుమార్లు వాయిదా పడింది.
Parliament news | సభ్యులపై ఆగ్రహం
ఈ పరిస్థితుల్లో వెల్ వద్ద నిరసన తెలుపుతున్న సభ్యులను తమతమ స్థానాలకు వెళ్లాలని సభాపతి పలుమార్లు కోరారు. కానీ ఆ అభ్యర్థనను విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో 10 మంది సభ్యులను సస్పెండ్ చేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వీ మురళధరన్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి డెప్యూటీ చైర్మన్ హరివంశ్ ఆమోదం తెలిపిన తరువాత, మొత్తం 19 మంది విపక్ష సభ్యుల పేర్లను మంత్రి మురళీధరన్ చదివి వినిపించారు.
Parliament news | మూజువాణి ఓటు..
ఈ తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. అయితే, డివిజన్ ఓటింగ్ పెట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లాలన్న సభాపతి డిమాండ్‌ను విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. దాంతో సభ నుంచి వెళ్లిపోవాలని సస్పెండెడ్ సభ్యులను డెప్యూటీ చైర్మన్ పలుమార్లు కోరారు. ఆ విజ్ఞప్తిని కూడా ఆ సభ్యులు పట్టించుకోకుండా, వెల్‌లోనే బైఠాయించారు.
Parliament news | వీరే ఆ సభ్యులు
రాజ్యసభ నుంచి సస్పెండైన సభ్యుల్లో తృణమూల్ కాంగ్రస్ సభ్యులు ఏడుగురు, డీఎంకే సభ్యులు ఆరుగురు, టీఆర్ఎస్ సభ్యలు ముగ్గురు, సీపీఎం సభ్యులు ఇద్దరు, సీపీఐ సభ్యుడు ఒకరు ఉన్నారు. సస్పెండైన టీఆర్ఎస్ సభ్యలు దామోదర రావు, లింగయ్య యాదవ్, రవి చంద్ర. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి.. సభా కార్యక్రమాలను నిలిపివేసి జీఎస్టీపై, పెరుగుతున్న ధరలపై చర్చ జరపాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ.. సభను అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్లో సభ నాలుగు సార్లు వాయిదా పడింది. చివరకు సభలో సాధారణ స్థితి నెలకొనే అవకాశాలు కనిపించకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.