AP Universities: ఏపీ వర్శిటీల్లో ఉద్యోగ నియామకాలకు కొత్త నోటిఫికేషన్, అన్ని యూనివర్శిటీలు కొత్త చట్టం పరిధిలోకి…-new notification for job placements in ap universities all universities come under the new law ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Universities: ఏపీ వర్శిటీల్లో ఉద్యోగ నియామకాలకు కొత్త నోటిఫికేషన్, అన్ని యూనివర్శిటీలు కొత్త చట్టం పరిధిలోకి…

AP Universities: ఏపీ వర్శిటీల్లో ఉద్యోగ నియామకాలకు కొత్త నోటిఫికేషన్, అన్ని యూనివర్శిటీలు కొత్త చట్టం పరిధిలోకి…

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 25, 2024 11:30 AM IST

AP Universities: ఆంధ్రప్రదేశ్‌ యూనివర‌్శిటీల్లో అధ్యాపకుల నియామకాలకు కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వివాదాలకు తావు లేకుండా రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలను ఒకే చట్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు.

ఏపీలో యూనివర్శిటీలో నియామకాలకు కొత్త నోటిఫికేషన్
ఏపీలో యూనివర్శిటీలో నియామకాలకు కొత్త నోటిఫికేషన్

AP Universities: ఏపీలోని యూనివర్సిటీల్లో అధ్యాపకులు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి కొత్తగా నోటిఫికేషన్ లు ఇవ్వాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 48 ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు ఉండగా...వీటిలో పరిధిలో 2061 కాలేజీలు, 19.29 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. అనేక సమస్యలతో ప్రభుత్వ యూనివర్సిటీలలో ప్రమాణాలు పడిపోయాయని సిఎం అన్నారు. వీటిని సరిదిద్ది యూనివర్సీటీలు నేషనల్, ఇంటర్ నేషనల్ స్థాయి ర్యాంకింగ్ సాధించేలా ప్రణాళికలు మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు.

యూనివర్సిటీ లలో అధ్యాపకుల ఖాళీల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని సిఎం సూచించారు. అధ్యాపకుల పోస్టుల్లో ఖాళీలు పెట్టుకుని నాణ్యమైన విద్యను అందించలేమని....ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు. అదే విధంగా పిపిపి పద్దతిలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సిఎం నిర్ణయించారు.

ఉన్నతవిద్యాశాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలు, ఉన్నత విద్యా రంగంపై చిన్న చూపు కారణంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్టార్ గాడితప్పిందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉన్నత విద్యారంగాన్ని తిరిగి పట్టాలెక్కించి, మంచి ఫలితాలు సాధించేందుకు స్వల్పకాలిక, దీర్ఘ కాలిక కార్యక్రమాలు చేపట్టాలని సిఎం అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతంపై తక్షణం దృష్టిపెట్టాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రైవేటు, ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం.....అదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు యూనివర్సిటీలకు ప్రోత్సాహం ఇవ్వాలని...తద్వారా విద్యారంగంలో అవకాశాలు పెరుగుతాయని సీఎం అన్నారు.

మారుతున్న కాలానికి, డిమాండ్ కు అనుగుణంగా కోర్సులు, కరికులం మార్చేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి...దేశ, విదేశాల్లో స్టడీ చేయాలని అన్నారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచే సిలబస్ మార్పులు చేయాలని సిఎం సూచించారు. యూనివర్సీటీ స్నాతకోత్సవాలు ఘనంగా నిర్వహించాలని...వాటి ద్వారా ఒక స్ఫూర్తి విద్యార్థుల్లో తీసుకురావాలని అన్నారు.

గ్రాస్ ఎన్ రోల్మెంట్ రేషియో 36 శాతం ఉండగా....2029 నాటికి 60 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. స్టూడెంట్స్ సర్టిఫికెట్లు ఆధార్ తో అనుసంధానం చేసి డిజి లాకర్ లో నవంబర్ లోపు చేర్చాలన్నారు. ఫారిన్ యూనివర్సిటీల అనుసంధానంతో విద్యార్థులకు జాయింట్ డిగ్రీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు.

యూనివర్శిటీలకు కొత్త చట్టం…

ప్రస్తుతం ఏపీలోని యూనివర్సిటీలకు సంబంధించి 8 చట్టాలు అమల్లో ఉన్నాయని, వీటన్నిటి స్థానంలో ఒకే చట్టం తీసుకు రావాలి అనే ప్రతిపాదనలకు సిఎం అంగీకారం తెలిపారు.

అలాగే బోర్డు ఆఫ్ గవర్నెన్స్ చైర్ పర్సన్స్ గా ప్రముఖ ఇండస్ట్రియలిస్టులు నియమించే విధానం పాటించాలన్నారు. ఐఐఎం, ఐఐటిలకు ఈ విధానం అమల్లో ఉందని...అదే విధానాన్ని మన రాష్ట్రంలో యూనివర్సిటీల్లో అమలు చేయాలని సిఎం సూచించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా కేజీ నుండి పీజీ వరకు కరికులం మార్చాల్సి ఉందని...దీని కోసం విద్యారంగ నిపుణలతో కమిటీ వేసి వచ్చే యేడాది నుండే కొత్త కరికులం అమల్లోకి రావాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ముగిసేంత వరకు ప్రవేశాలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలకు సంబంధించి అకడమిక్ క్యాలెండర్ ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి, వాటి ప్రతిష్టను దెబ్బతీసిందని, ఇప్పుడు సమూలంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేసేలా వైస్ ఛాన్సలర్ల ఎంపిక ఉండాలన్నారు.

విద్యా ప్రమాణాలతో పాటు ఇతర అంశాలతో విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ కు 5 ఏళ్ల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో కెరీర్ కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు వారి ప్రతిభను బట్టి కెరీర్ ప్లాన్ చేసుకునేలా మార్గదర్శకాలు అందించవచ్చన్నారు. ఈ సమీక్షలో మంత్రి నారా లోకేష్, అధికారులు పాల్గొన్నారు.