AP TET Update: షెడ్యూల్ ప్రకారమే ఏపీ టెట్ నిర్వహణ, పుకార్లు నమ్మొద్దంటున్న పాఠశాల విద్యాశాఖ
AP TET Update: షెడ్యూల్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్షలు నిర్వహిస్తున్న ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. గురువారం నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో భాగంగా మాక్‌టెస్ట్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ప్రకటించారు.
TET Update: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. టెట్ వాయిదా వేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ వివరణ ఇచ్చింది. మరోవైపు టెట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల కోసం సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్‌లను అందుబాటులో ఉంచుతున్నారు.
ఏపీలో మెగా డిఎస్సీ నిర్వహణలో భాగంగా నిర్వహిస్తున్న టెట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగనున్నాయి. టెట్ నిర్వహణపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దరఖాస్తుదారులు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించటానికి ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు దాదాపు నాలుగు లక్షలు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పరీక్షలకు సన్నద్ధం కావడానికి వీలుగా సెప్టెంబర్ 19వ తేదీ నుంచి మాక్ టెస్ట్- నమూనా పరీక్ష పత్రాలను వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
https://cse.ap.gov.in/ లో అందుబాటులో మాక్‌టెస్ట్‌ల ద్వారా అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం కావొచ్చు.దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ మొబైల్ లేదా కంప్యూటర్లలో నమూనా పరీక్ష పత్రాలను ప్రాక్టీస్ చేయవచ్చు.
మాక్ టెస్ట్ లను సాధన చేయడం ద్వారా ఆన్లైన్లో నిర్వహించే టెట్ పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి వీలు కలుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
హాల్‌టిక్కెట్లు రెడీ…
టెట్ 2024 పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈనెల 22వ తేదీ నుండి తమ టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్షలు గతంలో నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే అక్టోబర్ నెల మూడో తేదీ నుండి జరుగుతాయని పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ విజయరామరాజు.ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
అక్టోబర్ 3 నుంచి పరీక్షలు…
ఏపీ టెట్(TET) పరీక్షలకు సమయం దగ్గర పడుతుంది. టెట్ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి టెట్ పరీక్షలకు 4.27 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆన్ లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.
రోజుకు రెండు సెషన్లలో టెట్ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ నెల 19 నుంచి ఆన్‌లైన్ లో మాక్ టెస్టులు అందుబాటులోకి రానున్నాయి..
ఏపీ టెట్ హాల్ టికెట్ డౌన్ లోడ్ విధానం
- ఏపీ టెట్ అభ్యర్థులు ముందుగా https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే AP TET Hall Tickets(July) 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీతో పాటు Verification Code ను ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ చేస్తే టెట్ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
టెట్ అర్హత మార్కులు
టెట్ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అలాగే బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఎప్పుడైనా డీఎస్సీ పరీక్షలు రాసుకోవచ్చు. టెట్ స్కోర్ పెంచుకునేందుకు అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా ఈ పరీక్ష రాయవచ్చు. డీఎస్సీలో టెట్ కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్ - 2024(జులై) కోసం మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ 1-ఏకు 1,82,609 మంది, సెకెండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్-1బికు 2,662 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు పేపర్ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది, మ్యాథ్స్ అండ్ సైన్స్‌కు 1,04,788 మంది అప్లై చేసుకున్నారు.