IPL 2023 Playoffs: ఆర్సీబీ గెలుపు ఆ ఐదు జట్లకూ మింగుడుపడనిదే.. ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం
IPL 2023 Playoffs: ఆర్సీబీ గెలుపు ఆ ఐదు జట్లకూ మింగుడుపడనిదే. వీళ్ల గెలుపుతో ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికీ ఇంకా ఏడు జట్లూ ప్లేఆఫ్స్ రేసులోనే ఉండటం విశేషం.
IPL 2023 Playoffs: ఆర్సీబీ గెలుపు ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసును మరింత రసవత్తరంగా మార్చేసింది. ఆ టీమ్ ఓడిపోవాలని ప్రార్థించిన ఐదు జట్లకు వాళ్ల విజయం మింగుడు పడటం లేదు. ఒకవేళ సన్ రైజర్స్ చేతుల్లో ఆర్సీబీ ఓడిపోయి ఉంటే చెన్నై, లక్నో నేరుగా ప్లేఆఫ్స్ చేరేవి. అటు ముంబై ఇండియన్స్ కూడా ఖుష్ అయ్యేది. కానీ సన్ రైజర్స్ వాళ్ల ఆశలను నెరవేర్చలేకపోయింది.
నాలుగేళ్ల తర్వాత విరాట్ చేసిన సెంచరీతో ఆర్సీబీ తన ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపరచుకుంది. ఆ టీమ్ గెలిచిన తర్వాత ఇప్పటికీ మూడు ప్లేఆఫ్స్ బెర్తుల కోసం ఏడు టీమ్స్ పోటీ పడుతూనే ఉన్నాయి. అయితే ఆర్సీబీ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ క్వాలిఫై అవకాశాలు దాదాపు అడుగంటినట్లే. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ రేసులో ఎవరెలా ఉన్నారో ఓసారి చూద్దాం.
ఆర్సీబీకే ఛాన్స్ ఎక్కువ
సన్ రైజర్స్ పై గెలుపుతో ఆర్సీబీ తమ అవకాశాలను మెరుగుపరచుకోవడంతో పాటు ముంబై, కేకేఆర్, పంజాబ్ అవకాశాలను దెబ్బతీసింది. అటు సీఎస్కే, లక్నోలు నేరుగా అర్హత సాధించకుండా చేసింది. ఇప్పుడు తమ సొంతగడ్డపై గుజరాత్ టైటన్స్ తో ఆర్సీబీ గెలిస్తే దాదాపు ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. 16 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉన్న ముంబై ఇండియన్స్(-0.128) తో పోలిస్తే ఆర్సీబీ నెట్ రన్‌రేట్ (0.180) చాలా మెరుగ్గా ఉంది.
ఆర్సీబీ తమ చివరి మ్యాచ్ లో ఒక్క పరుగుతో గెలిచినా కూడా ముంబై ఇండియన్స్ తమ చివరి మ్యాచ్ లో ఏకంగా 79 పరుగుల తేడాతో గెలవాల్సిన పరిస్థితి. ఇక ఆర్సీబీ ఈ సీజన్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుండటంతో ఆ సమయానికి వాళ్లు ఏం చేయాలో స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకవేళ ఆర్సీబీ ఓడితే మాత్రం ముంబై కూడా ఓడిపోవాలి. నెట్ రన్‌రేట్ విషయంలో ఆర్సీబీకి దగ్గరగా ఉంది రాజస్థాన్ రాయల్స్(0.140) మాత్రమే.
ఒకవేళ ఆర్సీబీ ఒక పరుగు తేడాతో ఓడినా.. రాజస్థాన్ 10 పరుగులతో గెలిస్తే చాలు. ఇక కేకేఆర్ (-0.256), పంజాబ్ కింగ్స్ (-0.308) క్వాలిఫై కావాలంటే అద్భుతమే జరగాలి. ఆర్సీబీ భారీ తేడాతో ఓడాలి. అంటే ఆర్సీబీ 30 పరుగులతో ఓడింది అనుకుంటే.. కేకేఆర్ 78 పరుగులతో గెలవాలి. అటు పంజాబ్ కింగ్స్ 94 పరుగులతో గెలవాలి. అప్పుడే 14పాయింట్లతోపాటు ఆర్సీబీ కంటే మెరుగైన నెట్ రన్‌రేట్ ఉంటుంది.
సీఎస్కే, లక్నో పరిస్థితి ఏంటి?
ఒకవేళ ఆర్సీబీ తమ చివరి మ్యాచ్ లో ఓడినా క్వాలిఫై కావాలంటే ముంబై, రాజస్థాన్ తమ చివరి మ్యాచ్ లలో ఓడాలి. ఒకవేళ ముంబై, ఆర్సీబీ ఓడి రాజస్థాన్ గెలిస్తే వాళ్లకు ప్లేఆఫ్స్ వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక సన్ రైజర్స్ పై ఆర్సీబీ విజయం చెన్నై, లక్నోలకు మింగుడుపడనిదే. 15 పాయింట్లతో ఉన్న ఈ రెండు టీమ్స్.. ఆర్సీబీ ఓడి ఉంటే నేరుగా అర్హత సాధించేవి.
ఇప్పుడు ఆర్సీబీ, ముంబై తమ చివరి మ్యాచ్ లలో గెలిచి.. చెన్నై, లక్నో ఓడిపోతే వాళ్లకు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. ఈ రెండు టీమ్స్ చివరి మ్యాచ్ లో గెలిస్తే 17 పాయింట్లతో నేరుగా అర్హత సాధిస్తాయి. ఒకవేళ ఓడితే మాత్రం అటు ఆర్సీబీ, ముంబై కూడా ఓడిపోవాలని ఆశించాలి.
సంబంధిత కథనం