LSG vs MI: లాస్ట్ ఓవ‌ర్ థ్రిల్ల‌ర్‌లో గ‌ట్టెక్కిన ల‌క్నో - విజ‌యం ముందు బోల్తా కొట్టిన ముంబై-lsg beat mi by 5 runs in last over thriller ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Lsg Beat Mi By 5 Runs In Last Over Thriller

LSG vs MI: లాస్ట్ ఓవ‌ర్ థ్రిల్ల‌ర్‌లో గ‌ట్టెక్కిన ల‌క్నో - విజ‌యం ముందు బోల్తా కొట్టిన ముంబై

HT Telugu Desk HT Telugu
May 17, 2023 06:40 AM IST

LSG vs MI: మంగ‌ళ‌వారం ముంబై ఇండియ‌న్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ న‌రాలు తెగే ఉత్కంఠ‌ను పంచింది. ఈ లాస్ట్ ఓవ‌ర్ థ్రిల్ల‌ర్‌లో ముంబైపై ల‌క్నో ఐదు ప‌రుగులు తేడాతో విజ‌యాన్ని సాధించింది.

మోసిన్ ఖాన్
మోసిన్ ఖాన్

LSG vs MI: ప్లేఆఫ్స్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ల‌క్నో అద్భుతంగా పోరాడింది. మంగ‌ళ‌వారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఐదు ప‌రుగులు తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ గ‌ట్టెక్కింది. లాస్ట్ ఓవ‌ర్‌లో క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన మోసిన్ ఖాన్ ల‌క్నోకు సూప‌ర్ విక్ట‌రీని అందించాడు. చివ‌రి ఓవ‌ర్‌లో గెలుపు కోసం 11 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా కేవ‌లం ఐదు ప‌రుగులు మాత్ర‌మే చేసిన ముంబై ఓట‌మి పాలైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో ఇర‌వై ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు దీప‌క్ హుడా, డికాక్‌తో పాటు మ‌న్‌క‌డ్ విఫ‌ల‌మైనా కెప్టెన్ కృనాల్ పాండ్య‌తో క‌లిసి స్టోయినిస్ ల‌క్నోకు గౌర‌వ‌ప్ర‌ద‌మైన‌ స్కోరును అందించాడు. స్టోయినిస్ సిక్స‌ర్ల‌తో ముంబై బౌల‌ర్ల‌ను బెంబేలేత్తించాడు. 49 బాల్స్‌లో ఎనిమిది సిక్స‌ర్లు, నాలుగు ఫోర్ల‌తో 89 ర‌న్స్ చేశాడు. కృనాల్ పాండ్య 42 బాల్స్‌లో ఒక సిక్స‌ర్‌, ఒక ఫోర్‌తో 49 ర‌న్స్ చేశారు.

ముంబై బౌల‌ర్ల‌లో బెరెన్‌డార్ఫ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. 178 ప‌రుగుల టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ చేప‌ట్టిన ముంబైకి ఓపెన‌ర్లు ఇషాన్‌కిష‌న్‌, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇద్ద‌రు తొలి వికెట్‌కు 90 ప‌రుగులు జోడించ‌డంతో ముంబై ఈజీగా మ్యాచ్‌లో విజ‌యాన్ని సాధిస్తుంద‌ని అభిమానులు భావించారు. ప‌ది ప‌రుగుల తేడాతో రోహిత్‌, ఇషాన్ పెవిలియ‌న్ చేర‌డంతో ముంబై క‌ష్టాల్లో ప‌డింది.

రోహిత్ శ‌ర్మ 25 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు, ఒక ఫోర్‌తో 37 ర‌న్స్ చేయ‌గా, ఇషాన్ 39 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 59 ర‌న్స్ చేశాడు. సూర్య కూమార్ విఫ‌లం కావ‌డం, నేహ‌ల్ వ‌ధేరా నెమ్మ‌దిగా ఆడ‌టంతో ముంబై గెలుపు క‌ష్ట‌త‌రంగా మారింది. ఈ త‌రుణంలో సిక్స‌ర్ల‌తో చెల‌రేగిన టిమ్ డేవిడ్ ముంబై ఫ్యాన్స్‌లో గెలుపు ఆశ‌లు రేకెత్తించాడు.

చివ‌రి ఓవ‌ర్‌లో ముంబై విజ‌యానికి 11 ప‌రుగులు అవ‌స‌ర‌మైన త‌రుణంలో బంతిని ల‌క్నో కెప్టెన్ కృనాల్.... మోసిన్ ఖాన్‌కు అప్ప‌గించాడు, కెప్టెన్ త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని మోసిన్‌ఖాన్ నిల‌బెడుతూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవ‌లం ఐదు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. భారీ షాట్స్ కొట్టేందుకు డేవిడ్‌, గ్రీన్ ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు.

ల‌క్నో బౌల‌ర్ల‌లో ర‌వి బిష్ణోయ్, య‌శ్ ఠాకూర్ త‌లో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ గెలుపుతో 15 పాయింట్ల‌తో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి చేరుకున్న‌ది ల‌క్నో. ప్లేఆఫ్స్ ఆశ‌ల‌ను స‌జీవంగా నిలుపుకున్న‌ది.

WhatsApp channel