SRH vs RCB: ఆర్సీబీపై విధ్వంసం సృష్టించిన క్లాసెన్.. ఐపీఎల్‌లో తొలి సెంచరీ నమోదు-klassen ipl maiden century to help srh get huge score against bangaluru ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Srh Vs Rcb: ఆర్సీబీపై విధ్వంసం సృష్టించిన క్లాసెన్.. ఐపీఎల్‌లో తొలి సెంచరీ నమోదు

SRH vs RCB: ఆర్సీబీపై విధ్వంసం సృష్టించిన క్లాసెన్.. ఐపీఎల్‌లో తొలి సెంచరీ నమోదు

Maragani Govardhan HT Telugu
May 18, 2023 09:41 PM IST

SRH vs RCB: సన్‌రైజర్స్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ సెంచరీతో విజృంభించాడు. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో 51 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అతడు ధాటికి హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

హెన్రిక్ క్లాసెన్
హెన్రిక్ క్లాసెన్ (AP)

SRH vs RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుగైన స్కోరు సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ తరఫున స్థిరంగా ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. ఆర్సీబీ బౌలర్లనే లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాడు. హెన్రిచ్ మినహా మిగిలిన వారు పెద్దగా ప్రభావం చూపలేదు. ఆర్సీబీ బౌలర్లలో మైఖేల్ బ్రాస్‌వెల్ 2 వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

yearly horoscope entry point

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టుకు శుభారంభమేమి దక్కలేదు. స్కోరు 27 పరుగుల వద్దే ఓపెనర్ అభిషేక్ శర్మను(11) బ్రాస్‌వెల్ ఔట్ చేశాడు. అదే ఓవర్లో మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(15) కూడా పెవిలియన్ చేరాడు. ఫలితంగా 28 ఓవర్లకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది హైదరాబాద్. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్.. అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కాసేపు కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌క్రమ్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వరుస పెట్టి బౌండరీలు బాదుతూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన ధాటికి ఆర్సీబీ బౌలర్లు చేతులెత్తేశారు. వీరిద్దరూ కలిసి 76 పరుగుల భాగస్వామ్యం నమోదు చేస్తే.. అందులో మార్క‌క్రమ్ కేవలం 18 పరుగులే చేశాడంటే క్లాసెన్ విధ్వంసం ఎలా సాగిందో తెలుసుకోవచ్చు.

మార్క్‌క్రమ్‌ను షాబాజ్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేయడంతో క్రీజులోకి హ్యారీ బ్రూక్ వచ్చాడు. హ్యారీ బ్రూక్(27) నిలకడగా రాణించగా.. క్లాసెన్ తన దూకుడును కొనసాగించాడు. వచ్చిన బంతిని స్టాండ్స్‌లోకి పంపించడమే లక్ష్యంగా చెలరేగాడు. ఫలితంగా 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, 6సిక్సర్లు ఉన్నాయి. అయితే ధాటిగా ఆడే ప్రయత్నంలో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. హ్యారీ బ్రూక్‌తో కలిసి అతడు 74 పరుగులు జోడించాడు. చివరి ఓవర్లో కేవలం కేవలం 4 పరుగులే రావడంతో సన్‌రైజర్స్ అనుకున్న పరుగులు సాధించలేకపోయింది. మొత్తంగా 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

ఇదిలా ఉంటే ఐపీఎల్ కెరీర్‌లో క్లాసెన్ తొలి శతకాన్ని నమోదు చేశాడు. అలాగే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ నుంచి రెండో సెంచరీ నమోదైంది. అంతకుముందు హ్యారీ బ్రూక్ శతకంతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇది ఆరో శతకం. అంతకుముందు హ్యారీ బ్రూక్(ఎస్ఆర్‌హెచ్), వెంకటేష్ అయ్యర్(కేకేఆర్), సూర్యకుమార్ యాదవ్(ముంబయి), ప్రభ్ సిమ్రాన్ సింగ్(పంజాబ్ కింగ్స్) సెంచరీలు సాధించారు.

Whats_app_banner