Case on CSK: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్.. ఆ ఆరోపణలు నిజమైతే..-case on csk management regarding irregularities in ticket sales ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Case On Csk: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్.. ఆ ఆరోపణలు నిజమైతే..

Case on CSK: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్.. ఆ ఆరోపణలు నిజమైతే..

Hari Prasad S HT Telugu

Case on CSK: చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చిక్కుల్లో పడింది. ఆ జట్టుపై కోర్టులో కేసు నమోదైంది. ఆ ఆరోపణలు నిజమైతే సీఎస్కే మేనేజ్‌మెంట్ కు తిప్పలు తప్పవు.

టికెట్ల అమ్మకాల విషయంలో చిక్కుల్లో పడిన సీఎస్కే టీమ్ మేనేజ్‌మెంట్ (PTI)

Case on CSK: ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్స్ రేసులో ముందున్న చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చిక్కుల్లో పడింది. అయితే ఇది వాళ్లకు ఆటకు సంబంధించిన విషయం కాదు. ఆ జట్టు మేనేజ్‌మెంట్ ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ మేరకు చెన్నైకి చెందిన ఓ అడ్వొకేట్ బుధవారం (మే 17) కోర్టులో ఓ కేసు దాఖలు చేశారు.

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్, బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ లకు వ్యతిరేకంగా ఓ పిటిషన్ దాఖలైంది. చెన్నై సిటీ సివిల్ కోర్టులో సదరు అడ్వొకేట్ కేసు వేశారు. సీఎస్కే హోమ్ మ్యాచ్ లలో టికెట్లను బ్లాక్ లో అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.

"ఇవాళ నేను చెన్నై సూపర్ కింగ్స్, బీసీసీఐ, టీఎన్‌సీఏలపై కేసు వేశాను. టికెట్ల అమ్మకాలలో అక్రమాలు, బ్లాక్ మార్కెట్, ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయి" అని అశోక్ చక్రవర్తి అనే ఆ అడ్వొకేట్ తన ఫేస్‌బుక్ పోస్టులో అన్నారు. నిజానికి టికెట్ల అమ్మకాల విషయంలో అభిమానులు కూడా సీఎస్కే మేనేజ్‌మెంట్ పై ఆరోపణలు గుప్పించారు.

చెపాక్ స్టేడియంలో లోయర్ స్టాండ్ టికెట్ల రేట్లు రూ.1500 నుంచి రూ.2000 వరకూ ఉన్నా.. వాటిని రూ.8 వేల వరకూ అమ్ముకున్నారని ఆరోపించారు. సీఎస్కే కెప్టెన్ ధోనీకి ఇదే చివరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో టికెట్ల ధరలు చుక్కలనంటాయి.

వచ్చే వారం చెన్నైలో జరగబోయే ప్లేఆఫ్స్ మ్యాచ్ కోసం టికెట్ల అమ్మకాలను కూడా తాత్కాలికంగా నిలిపేయాలని కూడా సదరు అడ్వొకేట్ పిటిషన్ లో కోరారు. ఇంతవరకూ జరిగిన ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాల రికార్డును కూడా కోర్టు ముందు ఉంచాలని అడిగారు. ప్లేఆఫ్స్ లో భాగంగా చెపాక్ స్టేడియంలో తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్ లు జరగాల్సి ఉంది.

అయితే టికెట్ల అమ్మకాల్లో అక్రమాల ఆరోపణలపై ఇంతకుముందే సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. తమకు అందుబాటులో ఉన్న 36 వేల టికెట్లలో 20 శాతం టికెట్లను బీసీసీఐకి, మరో 13 వేల టికెట్లకు టీఎన్‌సీఏ డివిజన్ క్లబ్ లకు ఇవ్వాల్సి ఉంటుందని, మిగతా టికెట్లనే అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు.

సంబంధిత కథనం