BCCI Revenue: బీసీసీఐపై కాసుల వర్షం.. ఏడాదికి ఐసీసీ నుంచే రూ.1900 కోట్లు-bcci revenue from icc will be huge for next four years ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bcci Revenue: బీసీసీఐపై కాసుల వర్షం.. ఏడాదికి ఐసీసీ నుంచే రూ.1900 కోట్లు

BCCI Revenue: బీసీసీఐపై కాసుల వర్షం.. ఏడాదికి ఐసీసీ నుంచే రూ.1900 కోట్లు

Hari Prasad S HT Telugu
May 10, 2023 01:16 PM IST

BCCI Revenue: బీసీసీఐపై కాసుల వర్షం కురవనుంది. ఏడాదికి ఐసీసీ నుంచే సుమారు రూ.1900 కోట్లు రానున్నాయి. ఐసీసీ కొత్త రెవెన్యూ షేరింగ్ మోడల్ లో మన బోర్డుకే సుమారు 40 శాతం ఆదాయం వస్తోంది.

బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు రోజర్ బిన్నీ
బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Jay Shah Twitter)

BCCI Revenue: క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ కింగ్. ఇది మరోసారి నిరూపితమైంది. ఐసీసీ కొత్త రెవెన్యూ షేరింగ్ మోడల్ లో బీసీసీఐపై కాసుల వర్షం కురవనున్నట్లు క్రికిన్ఫో రిపోర్టు వెల్లడించింది. వచ్చే నాలుగేళ్లకుగాను ఐసీసీకి వచ్చే ఆదాయంలో సుమారు 40 శాతం బీసీసీఐ ఖాతాలోకే వెళ్లనుంది. ప్రస్తుతం ఈ కొత్త ఆదాయ పంపిణీ విధానం ప్రతిపాదన దశలోనే ఉంది.

వచ్చే నాలుగేళ్లు అంటే 2024-27 మధ్య ఐసీసీకి మొత్తం 60 కోట్ల డాలర్లు (సుమారు రూ.4922 కోట్లు) ఆదాయం రానుండగా.. అందులో బీసీసీఐ వాటా 23 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1884 కోట్లు. ఐసీసీ మొత్తం ఆదాయంలో 38.5 శాతం ఇండియన్ క్రికెట్ బోర్డు ఖాతాలోకే వెళ్లనుంది. నిజానికి గతంలో ఐసీసీ ఆదాయంలో మెజార్టీ వాటా మూడు బోర్డులకు వెళ్లేది.

అందులో బీసీసీఐతోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులు కూడా ఉండేవి. అయితే ఈ కొత్త మోడల్ లో కేవలం బీసీసీఐ ఎక్కువ లబ్ధి పొందనుంది. ఈ కొత్త మోడల్ ప్రకారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు 4.13 కోట్ల డాలర్లు అంటే 6.89 శాతం దక్కనుంది. బీసీసీఐతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ. మూడో స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా నిలిచింది. ఆ బోర్డుకు 3.75 కోట్ల డాలర్లు దక్కనున్నాయి.

నాలుగో స్థానంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిలవనుంది. ఆ బోర్డుకు 3.45 కోట్ల డాలర్లు దక్కుతాయి. మిగతా 8 సభ్యదేశాల్లో ఒక్కొక్కరికి ఐసీసీ ఆదాయంలో ఐదు శాతం కంటే తక్కువే దక్కుతుంది.

నాలుగు రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ కొత్త రెవెన్యూ మోడల్ తయారు చేశారు. క్రికెట్ చరిత్ర, గత 16 ఏళ్లలో ఆయా దేశాల పురుషుల, మహిళల జట్ల ప్రదర్శన.. ఐసీసీ ఆదాయంలోయ వారి వాటా, పూర్తిస్థాయి సభ్యత్వానికి ఉన్న వెయిటేజీ ఆధారంగా బీసీసీఐకి పెద్ద ఎత్తున రెవెన్యూ రానుంది.