ICC FTP: వచ్చే నాలుగేళ్లూ టీమిండియా బిజీబీజీ.. 38 టెస్టులు, 39 వన్డేలు, 61 టీ20లు-icc announces new ftp and india to play two 5 test match series against australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Icc Announces New Ftp And India To Play Two 5 Test Match Series Against Australia

ICC FTP: వచ్చే నాలుగేళ్లూ టీమిండియా బిజీబీజీ.. 38 టెస్టులు, 39 వన్డేలు, 61 టీ20లు

Hari Prasad S HT Telugu
Aug 17, 2022 03:36 PM IST

ICC FTP: 2023 నుంచి 2027 వరకూ టీమిండియా బిజీబిజీగా గడపనుంది. నాలుగేళ్ల కాలానికిగాను బుధవారం (ఆగస్ట్‌ 17) ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఫ్యూచర్‌ టూర్స్ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీపీ) ప్రకటించింది.

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రెండుసార్లు ఐదేసి టెస్టుల సిరీస్ లు
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రెండుసార్లు ఐదేసి టెస్టుల సిరీస్ లు (Getty Images)

దుబాయ్‌: ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ ఎప్పుడూ ఖాళీగా ఉండదు. అసలు క్రికెట్‌ ప్రపంచంలో ఎక్కువ బిజీగా ఉండేది మన ప్లేయర్సే. రానున్న ఎఫ్‌టీపీలోనూ అదే జరిగింది. టీమిండియా 2023, మే నుంచి 2027, ఏప్రిల్‌ మధ్య 38 టెస్టులు, 39 వన్డేలు, 61 టీ20లు ఆడనుంది. వరల్డ్‌కప్స్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీలాంటి ఐసీసీ ఈవెంట్లు వీటికి అదనం.

ట్రెండింగ్ వార్తలు

ఇక ఈ నాలుగేళ్ల కాలంలో ఆస్ట్రేలియాతో ఇండియా రెండుసార్లు ఐదు టెస్ట్‌ల సిరీస్‌ ఆడనుండటం విశేషం. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ పేరుతో జరుగున్న ఈ సిరీస్‌లో ఐదు టెస్టులు ఆడనుండటం 30 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ కొత్త ఎఫ్‌టీపీ కంటే ముందే వచ్చే ఏడాది మొదట్లో ఇండియా, ఆస్ట్రేలియా నాలుగు టెస్ట్‌ల బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌లో తలపడనున్నాయి.

కొత్త ఎఫ్‌టీపీ ప్రకారం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి ఐదు టెస్ట్‌ల సిరీస్‌ ఆస్ట్రేలియాలో 2024-25లో జరగనుంది. ఇది 2023-25లో జరగబోయే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగం. ఇక ఆ తర్వాతి ఏడాది మరో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా టీమ్‌ ఇండియాకు రానుంది. ఇది 2025-27 వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతుంది.

చివరిసారి ఇండియా, ఆస్ట్రేలియాలు 1992లో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ ఆడాయి. ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియా 4-0తో ఇండియాను ఓడించింది. ఇక 2023-27 మధ్య ఉన్న ఈ కొత్త ఎఫ్‌టీపీలో భాగంగా ఇండియా మొదటి సిరీస్‌ను వెస్టిండీస్‌లో ఆడుతుంది. వచ్చే ఏడాది జులై-ఆగస్ట్‌లో వెస్టిండీస్‌ వెళ్లనున్న టీమిండియా.. అక్కడ రెండు టెస్ట్‌లు, రెండు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది.

ఇక ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ 2024 జనవరి, మార్చి మధ్య జరిగే అవకాశం ఉంది. నాలుగేళ్ల కాలంలో 12 దేశాలు కలిసి మొత్తంగా 777 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడనుండటం విశేషం. ఇందులో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 టీ20లు జరుగుతాయి. ఈ నాలుగేళ్ల కాలంలో ఐదు ఐసీసీ టోర్నీలు జరగనున్నాయి. 2023లో ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌ ఒకటి కాగా.. 2024లో టీ20 వరల్డ్‌కప్‌, 2025లో ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2026లో టీ20 వరల్డ్‌కప్‌, 2027లో వన్డే వరల్డ్‌కప్‌ జరుగుతుంది.

WhatsApp channel