Ind vs Aus: దంచికొట్టిన హార్దిక్, రాహుల్‌.. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం-ind vs aus first t20 underway as hardik and kl rahul smashes half centuries ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Aus: దంచికొట్టిన హార్దిక్, రాహుల్‌.. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం

Ind vs Aus: దంచికొట్టిన హార్దిక్, రాహుల్‌.. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం

Hari Prasad S HT Telugu
Sep 20, 2022 08:47 PM IST

Ind vs Aus: హార్దిక్ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ దంచికొట్టడంతో తొలి టీ20లో ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా. ఈ ఇద్దరూ మెరుపు హాఫ్‌ సెంచరీలతో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారు.

హాఫ్ సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్
హాఫ్ సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్ (AFP)

Ind vs Aus: ఆస్ట్రేలియాతో మొహాలీలో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా 6 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. చివరి మూడు బంతులను సిక్స్‌లుగా మలచి ఇండియాకు సెన్సేషనల్‌ ముగింపునిచ్చాడు హార్దిక్‌ పాండ్యా. అతడు చివరికి కేవలం 30 బాల్స్‌లోనే 71 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్‌ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అటు కేఎల్‌ రాహుల్‌ కూడా 35 బాల్స్‌లోనే 55 రన్స్‌ చేశాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మంచి ఆరంభమే లభించినా.. దానిని సద్వినియోగం చేసుకోలేదు కెప్టెన్‌ రోహిత్ శర్మ (11). ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి ఊపు మీద కనిపించిన రోహిత్‌.. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్‌కోహ్లి (2) నిరాశపరిచాడు. అతడు ఎలిస్‌ బౌలింగ్‌లో వికెట్‌ పారేసుకున్నాడు. దీంతో ఇండియా 35 రన్స్‌కే ఇద్దరు టాప్ బ్యాటర్లను కోల్పోయింది.

అయితే ఈ దశలో వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చెలరేగి ఆడారు. కెప్టెన్‌, మాజీ కెప్టెన్‌ త్వరగానే ఔటైనా.. ఆ అడ్వాంటేజ్ ఆస్ట్రేలియాకు దక్కకుండా చూశారు. ఇద్దరూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా స్ట్రైక్‌ రేట్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్‌.. ఈ మ్యాచ్‌లో ముందు చెప్పినట్లే చాలా మెరుగుపరచుకున్నాడు. కేవలం 32 బాల్స్‌లోనే టీ20ల్లో 18వ హాఫ్‌ సెంచరీ చేశాడు.

అయితే ఆ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. 35 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55 రన్స్‌ చేసి ఔటయ్యాడు. అప్పటికే సూర్యతో కలిసి మూడో వికెట్‌కు 68 రన్స్‌ జోడించాడు. అటు సూర్య కూడా తనదైన స్టైల్లో చెలరేగి ఆడాడు. అయితే రాహుల్‌ ఔటైన కాసేపటికే 25 బాల్స్‌లో 46 రన్స్‌ చేసి ఔటయ్యాడు. సూర్య ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.

WhatsApp channel