French Open 2024: ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే రఫేల్ నదాల్‌కు గట్టి ప్రత్యర్థి.. ఛాంపియన్ ప్లేయర్‌కు సవాలే-tennis news in telugu french open 2024 draw rafael nadal to face fourth seed alexander zwerev in the first round ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  French Open 2024: ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే రఫేల్ నదాల్‌కు గట్టి ప్రత్యర్థి.. ఛాంపియన్ ప్లేయర్‌కు సవాలే

French Open 2024: ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే రఫేల్ నదాల్‌కు గట్టి ప్రత్యర్థి.. ఛాంపియన్ ప్లేయర్‌కు సవాలే

Hari Prasad S HT Telugu
May 23, 2024 07:45 PM IST

French Open 2024: ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే స్పెయిన్ బుల్ రఫేల్ నదాల్ కు కఠినమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. 14సార్లు ఈ గ్రాండ్‌స్లామ్ గెలిచిన రఫాకి ఇది నిజంగా పెద్ద సవాలే అని చెప్పాలి.

ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే రఫేల్ నదాల్‌కు గట్టి ప్రత్యర్థి.. ఛాంపియన్ ప్లేయర్‌కు సవాలే
ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే రఫేల్ నదాల్‌కు గట్టి ప్రత్యర్థి.. ఛాంపియన్ ప్లేయర్‌కు సవాలే

French Open 2024: బహుషా తన కెరీర్లోనే చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న లెజెండరీ ప్లేయర్ రఫేల్ నదాల్ కు తన ఫేవరెట్ ఫ్రెండ్ ఓపెన్ తొలి రౌండ్లోనే పెద్ద సవాలు ఎదురు కానుంది. అతడు నాలుగో సీడ్, టాప్ ఫామ్ లో ఉన్న అలెగ్జాండర్ జ్వెరెవ్ తో తలపడనున్నాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మే 26 నుంచి పారిస్ లోని రోలాండ్ గారోస్ లో ప్రారంభం కానుంది.

రఫేల్ నదాల్‌కు సవాలే

కెరీర్ చరమాంకంలో ఉన్న స్పెయిన్ బుల్ రఫేల్ నదాల్ తన కెరీర్ చివరి గ్రాండ్‌స్లామ్ ఆడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకెంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఓపెన్ తోనే కెరీర్ ముగించే అవకాశం ఉంది. రోలాండ్ గారోస్ లో నదాల్ కు కళ్లు చెదిరే రికార్డు ఉంది. అతడు ఇక్కడ ఏకంగా 112 మ్యాచ్ లలో విజయాలు సాధించగా.. కేవలం మూడు మాత్రమే ఓడిపోయాడు.

కెరీర్లో అత్యధికంగా 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచాడు. మహా మహా ప్లేయర్స్ కూడా ఈ మట్టి కోర్టుపై తడబడితే.. రఫా మాత్రం దీనినే తన కోటగా మార్చుకుని కొన్నేళ్లుగా ఏలుతున్నాడు. ఇక ఇండియాకు చెందిన సుమిత్ నాగల్ కూడా మెయిన్ డ్రాలో నదాల్ ఉన్న పార్శ్వంలోనే ఉన్నాడు. అయితే నదాల్ కు తొలి రౌండ్లోనే గట్టి పోటీ ఎదురు కానుంది.

అతనితో నాలుగో సీడ్ జ్వెరెవ్ తలపడనున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ పది మ్యాచ్ లు ఆడగా అందులో ఏడు నదాల్, మూడు జ్వెరెవ్ గెలిచారు. అయితే ఈ మధ్యే ఇటాలియన్ ఓపెన్ గెలిచి మంచి ఫామ్ లో ఉన్న జ్వెరెవ్ నుంచి నదాల్ కు ముప్పు పొంచి ఉంది. ఈ ఇద్దరూ చివరిసారి 2022 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో తలపడగా.. నదాల్ మడమ గాయం వల్ల మధ్యలోనే వైదొలిగాడు.

డిఫెండింగ్ ఛాంపియన్ జోకొవిచ్

ఈ ఏడాది ఒక్క ట్రోఫీ కూడా గెలవలేకపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జోకొవిచ్ తొలి రౌండ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పియెర్ హెర్బర్ట్ తో తలపడనున్నాడు. ఇప్పటికే మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన జోకొవిచ్.. తొలి రౌండ్లో గెలిస్తే రెండో రౌండ్లో రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనలిస్ట్ అయిన కాస్పర్ రూడ్ తో తలపడే అవకాశం ఉంది.

ఇప్పటికే 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచి చరిత్ర సృష్టించిన జోకొవిచ్.. ఇప్పుడు 25వ టైటిల్ పై కన్నేశాడు. ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ గా కూడా అతడే ఉన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ అయిన రెండో సీడ్ సిన్నర్ తొలి రౌండ్లో క్రిస్టఫర్ యూబ్యాంక్స్ తో ఆడతాడు. మూడో సీజన్ కార్లోస్ అల్కరాజ్ ఓ క్వాలిఫయర్ తో తొలి రౌండ్ ఆడనున్నాడు.

Whats_app_banner