Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?
Rafael Nadal - Italian Open: ఇటాలియన్ ఓపెన్‍లో స్టార్ ప్లేయర్ రఫేల్ నాదల్‍కు నిరాశ ఎదురైంది. రెండో రౌండ్లోనే అతడికి ఓటమి ఎదురైంది. దీంతో టోర్నీ నుంచి ఈ టెన్నిస్ సూపర్ స్టార్ నిష్క్రమించాడు.
Rafael Nadal: టెన్నిస్ దిగ్గజం, స్టార్ ప్లేయర్ రఫేల్ నాదల్ రెండేళ్లుగా గాయాలతో సతమతమవుతున్నాడు. రెండు దశాబ్దాల పాటు ఆధిపత్యం చెలాయించిన ఈ స్పెయిన్ దిగ్గజం ఇప్పుడు తడబడుతున్నాడు. సర్జరీ కారణంగా గతేడాది ఆడలేకపోయాడు 22 గ్రాండ్‍స్లామ్ టైటిళ్ల విన్నర్ నాదల్. ఇంకా శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకోలేదు. అయితే, ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఆడేందుకు సన్నాహకంగా ఇటాలియన్ ఓపెన్‍లో రఫేల్ నాదల్ బరిలోకి దిగాడు. 10సార్లు ఇటాలియన్ టైటిల్ గెలిచిన నాదల్.. ఈ ఏడాది మాత్రం రెండో రౌండ్లోనే నేడు (మే 11) ఓటమి పాలయ్యాడు. శారీరక ఇబ్బంది వల్ల స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయాడు. ఆ వివరాలివే..
రెండో రౌండ్లో పరాజయం
ఇటాలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రఫేల్ నాదల్ పరాజయం పాలయ్యాడు. రోమ్ వేదికగా జరిగిన ఈ రెండో రౌండ్‍లో నాదల్‍పై 6-1, 6-3 తేడాతో పోలాండ్ ప్లేయర్ హాబర్ట్ హర్కాజ్ విజయం సాధించాడు. ఏడో సీడ్‍గా బరిలోకి దిగిన హాబర్ట్ ఆధిపత్యం చూపాడు.
ఇటాలియన్ ఓపెన్ తొలి రౌండ్లో విజయం సాధించిన నాదల్.. నేటి రెండో రౌండ్లో ఇబ్బంది పడ్డాడు. అతడు పూర్తిగా కోలుకున్నట్టు కనిపించలేదు. దీంతో వరుస సెట్లలో రఫా ఓడిపోయాడు. కేవలం 93 నిమిషాల్లోనే హాబర్ట్ విజయం సాధించాడు.
ఫ్రెంచ్ ఓపెన్ ఆడడం డౌటేనా!
రఫేల్ నాదల్ తన కెరీర్లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‍స్లామ్ టైటిల్‍ను 14సార్లు దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మట్టికోర్టు రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే, సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోని రఫేల్ నాదల్.. ఈ ఏదాది ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ ఆడడం అనుమానంగానే ఉంది. మే 26వ తేదీన ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుంది. అయితే, ఆలోగా నాదల్ పూర్తిగా సిద్ధమయ్యే అవకాశం కనిపించడం లేదు.
ఫ్రెంచ్ ఓపెన్ ఆడాలా వద్దా అనే విషయాన్ని తాను ఇంకా నిర్ణయించుకోలేదని మ్యాచ్ తర్వాత రఫేల్ నాదల్ కూడా చెప్పాడు. “నిర్ణయాన్ని మీరు ఊహించుకోవచ్చు. అయితే, నేడు నా మెదడులో స్పష్టంగా లేదు” అని నాదల్ చెప్పాడు. అంటే.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. అయితే, అతడు చెప్పిన విధానం చూస్తే.. ఆడడం డౌటే అనిపిస్తుంది. ఒకవేళ పూర్తిగా కోలుకుంటేనే ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‍ను నాదల్ ఆడే అవకాశం ఉంటుంది. ఇక, ఈ ఏడాది తర్వాత ఆటకు రఫా గుడ్‍బై చెబుతాడన్న అంచనాలు కూడా ఉన్నాయి.
స్వియాటెక్, ఒసాకా ముందడుగు
ఇటాలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో నంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్ విజయం సాధించారు. పొలాండ్ ప్లేయర్ స్వియాటెక్ 6-3, 6-4 తేడాతో యులియా పుతిన్సేవాపై అలవోకగా విజయం గెలిచారు. తదుపరి ప్రీ-క్వార్టర్స్ రౌండ్‍లో అంజలిక్ కెర్బెర్‌తో స్వియాటెక్ తలపడనున్నారు. రెండో రౌండ్లో జపాన్ స్టార్ ప్లేయర్ నవోమీ ఒసాకా కూడా అలవోకగానే గెలిచారు. 6-3, 6-3 తేడాతో డారియా కసట్కినాపై ఒకాసా విజయం సాధించారు.