Sumit Nagal Out: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి సుమిత్ నాగల్ ఔట్.. పోరాడి ఓడిన స్టార్ ప్లేయర్-sumit nagal out of australian open 2024 after losing in second round ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sumit Nagal Out: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి సుమిత్ నాగల్ ఔట్.. పోరాడి ఓడిన స్టార్ ప్లేయర్

Sumit Nagal Out: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి సుమిత్ నాగల్ ఔట్.. పోరాడి ఓడిన స్టార్ ప్లేయర్

Hari Prasad S HT Telugu
Jan 18, 2024 02:47 PM IST

Sumit Nagal Out: ఇండియన్ టెన్నిస్ సెన్సేషన్ సుమిత్ నాగల్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔటయ్యాడు. రెండో రౌండ్లో పోరాడి ఓడిన అతడు.. ఇంటిదారి పట్టాడు.

సుమిత్ నాగల్
సుమిత్ నాగల్ (AFP)

Sumit Nagal Out: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 తొలి రౌండ్లో సంచలన విజయం సాధించిన ఇండియన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్.. రెండో రౌండ్ లో మాత్రం ఓడిపోయాడు. చైనా ప్లేయర్ జున్‌చెంగ్ షాంగ్ చేతుల్లో పోరాడి ఓడాడు. తొలి రౌండ్లో ఏకంగా వరల్డ్ నంబర్ 27కి షాకిచ్చిన సుమిత్.. తర్వాతి మ్యాచ్ లో తనకంటే తక్కువ ర్యాంక్ ప్లేయర్ చేతుల్లో పరాజయం పాలయ్యాడు.

గురువారం (జనవరి 18) జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో సుమిత్ 6-2, 3-6, 5-7, 4-6తో ఓడిపోయాడు. తొలి సెట్ గెలిచి ఊపు మీద కనిపించిన సుమిత్.. తర్వాత 18 ఏళ్ల షాంగ్ ధాటికి తలవంచక తప్పలేదు. క్వాలిఫయింగ్ రౌండ్ లో వరుసగా మూడు మ్యాచ్ లను ఒక్క సెట్ కూడా కోల్పోకుండా గెలిచి మెయిన్ డ్రాకు అర్హత సాధించిన సుమిత్.. తొలి రౌండ్లోనూ అదే ఊపు కొనసాగించాడు.

సుమిత్ సంచలనాలకు తెర

అయితే సుమిత్ సంచలనాలకు ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో తెరపడింది. తనకంటే తక్కువ ర్యాంక్ ప్లేయర్ కావడంతో ఈ మ్యాచ్ లోనూ సుమిత్ గెలుస్తాడన్న భావించారు. అందుకు తగినట్లే తొలి రౌండ్ మ్యాచ్ ఎక్కడ ముగించాడో అదే ఊపులో రెండో రౌండ్ మొదలు పెట్టాడు. మ్యాచ్ తొలి గేమ్ లోనే షాంగ్ సర్వీస్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తొలి సెట్లో అతడు మళ్లీ కోలుకోలేదు.

చివరికి 6-2తో సుమిత్ సెట్ గెలుచుకున్నాడు. అయితే రెండో సెట్ నుంచి మ్యాచ్ మలుపు తిరిగింది. వరల్డ్ నంబర్ 27 బుబ్లిక్ పై గెలవడానికి సుమిత్ ఏం చేశాడో అదే ఇక్కడ చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. షాంగ్ తన సర్వీసులను మెరుగుపరుచుకోవడంతోపాటు తప్పిదాలు చేయలేదు. పైగా తరచూ కోర్టు మూలలకు షాట్లు ఆడుతూ సుమిత్ ను ఇబ్బంది పెట్టాడు.

ఈ ఒత్తిడిలో సుమిత్ తప్పిదాలు చేశాడు. దీంతో రెండో సెట్ ను షాంగ్ 6-3తో సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లో సుమిత్ కాస్త కోలుకున్నాడు. చైనీస్ ప్లేయర్ కు దీటుగా ఆడాడు. అయితే షాంగ్ కూడా అంతే దీటుగా సుమిత్ ఆటను తిప్పికొడుతూ మొదట్లోనే అతని సర్వీస్ బ్రేక్ చేసి.. ఆ సెట్ ను 7-5తో సొంతం చేసుకున్నాడు. నాలుగో సెట్లో సుమిత్ పూర్తిగా అలసిపోయినట్లు కనిపించాడు.

అతని రిటర్న్స్ లో తరచూ తప్పిదాలు జరిగాయి. మరోవైపు షాంగ్ తన సర్వీస్ లో ఎలాంటి పొరపాట్లు చేయలేదు. తొలి సెట్లో షాంగ్ రెండు సర్వీసులు బ్రేక్ చేసిన సుమిత్ కు.. తర్వాతి మూడు సెట్లలో కేవలం ఒక్కసారి మాత్రమే బ్రేక్ పాయింట్ లభించింది. నాలుగో సెట్లో కీలకమైన సమయంలో సుమిత్ సర్వీస్ బ్రేక్ చేసి ఆ సెట్ ను 6-4తో గెలుచుకోవడంతోపాటు మ్యాచ్ లోనూ విజయం సాధించాడు.

Whats_app_banner

టాపిక్