Sumit Nagal Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సుమిత్ నాగల్ సంచలనం.. వరల్డ్ నంబర్ 27పై విజయం-sumit nagal at australian open beats world number 27 alexander bublik ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sumit Nagal Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సుమిత్ నాగల్ సంచలనం.. వరల్డ్ నంబర్ 27పై విజయం

Sumit Nagal Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సుమిత్ నాగల్ సంచలనం.. వరల్డ్ నంబర్ 27పై విజయం

Hari Prasad S HT Telugu
Jan 16, 2024 01:06 PM IST

Sumit Nagal Australian Open: ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సంచలనం సృష్టించాడు. తొలి రౌండ్లో వరల్డ్ నంబర్ 27ను మూడు వరుస సెట్లలో ఓడించాడు.

ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్
ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ (AP)

Sumit Nagal Australian Open: ఇండియన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. వరల్డ్ నంబర్ 27, 31వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ ను మూడు వరుస సెట్లలో ఓడించాడు. రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న సుమిత్.. ప్రస్తుతం ప్రపంచంలో 139వ ర్యాంకులో ఉన్నాడు. గ్రాండ్ స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్ ను ఓడించిన రెండో ఇండియన్ గా నిలిచాడు.

గతంలో 1989లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో అప్పటి వరల్డ్ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ మ్యాట్స్ విలాండర్ ను ఇండియాకు చెందిన రమేష్ కృష్ణన్ ఓడించాడు. ఇక ఇప్పుడు సుమిత్ నాగల్ కూడా ఆ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. నాలుగో గ్రాండ్ స్లామ్ టోర్నీలో సుమిత్ తలపడుతున్నాడు.

వరుస సెట్లలో గెలిచిన సుమిత్

ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్లో 6-4, 6-2, 7-6 [7-5]తో వరుస సెట్లలో బుబ్లిక్ కు షాకిచ్చాడు సుమిత్ నాగల్. గ్రాండ్ స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్ ను సుమిత్ ఓడించడం ఇదే తొలిసారి. అయితే రమేష్ కృష్ణన్ మాత్రం నాలుగుసార్లు ఈ ఘనత సాధించాడు. 1989 ఆస్ట్రేలియన్ ఓపెన్ తోపాటు 1981, 1987 యూఎస్ ఓపెన్, 1986 వింబుల్డన్ లలో సీడెడ్ ప్లేయర్స్ పై రమేష్ గెలిచాడు.

ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సోమ్‌దేవ్ దేవ్ వర్మన్ తర్వాత రెండో రౌండ్ చేరిన తొలి ఇండియన్ ప్లేయర్ గా కూడా సుమిత్ నిలిచాడు. 2013 ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్లో సిమోన్ బొలెల్లీపై సోమ్‌దేవ్ గెలిచాడు. ఇక తాజా మ్యాచ్ లో బుబ్లిక్ పై తొలి సెట్ నుంచే సుమిత్ ఆధిపత్యం చెలాయించాడు. మొదట్లోనే అతని రెండు సర్వీసులను బ్రేక్ చేశాడు.

దీంతో మొదట్లోనే 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత సుమిత్ సర్వీస్ ను బుబ్లిక్ బ్రేక్ చేసినా.. చివరికి తొలి సెట్ ను 6-4తో సుమిత్ గెలిచాడు. ఇక రెండో సెట్లో మాత్రం ప్రత్యర్థికి అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మొదటి సర్వీస్ నే బ్రేక్ చేసి, తర్వాత తన సర్వీస్ నిలబెట్టుకొని 2-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత మరో సర్వీస్ కూడా బ్రేక్ చేయడంతో బుబ్లిక్ ఆగ్రహంతో తన రాకెట్ విరగ్గొట్టాడు.

అదే ఊపులో రెండో సెట్ ను 6-2తో గెలిచాడు. మూడో సెట్లో మాత్రం సుమిత్ కు గట్టి పోటీ ఎదురైంది. కజకిస్థాన్ కు చెందిన బుబ్లిక్ మూడో సెట్లో దీటుగా ఆడటంతో 3-3తో స్కోరు సమమైంది. అలాగే ఆ సెట్ కాస్తా 6-6తో సమం కావడంతో టైబ్రేకర్ తప్పలేదు. టైబ్రేకర్ కూడా హోరాహోరీగా సాగింది. చివరికి 7-5తో మూడో సెట్ టైబ్రేకర్ తోపాటు మ్యాచ్ కూడా సుమిత్ సొంతం చేసుకున్నాడు.

Whats_app_banner

టాపిక్