Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్-indian football team captain sunil chhetri to retire after world cup qualifier match agaisnt kuwait ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Hari Prasad S HT Telugu
May 16, 2024 02:11 PM IST

Sunil Chhetri Retirement: ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఆటకు గుడ్ బై చెప్పనున్నాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా కువైట్ తో జరగబోయే మ్యాచే తన కెరీర్లో చివరిదని అతడు స్పష్టం చేశాడు.

ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్
ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్ (AFP)

Sunil Chhetri Retirement: సునీల్ ఛెత్రీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి రిటైరవుతున్నాడు. 39 ఏళ్ల ఈ ఇండియన్ లెజెండరీ ప్లేయర్.. గురువారం (మే 16) ఓ వీడియో మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. జూన్ 6న ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్ లో భాగంగా కువైట్ తో జరగబోయే మ్యాచే తన కెరీర్లో చివరిదని ఆ వీడియోలో అతడు స్పష్టం చేశాడు.

సునీల్ ఛెత్రీ రిటైర్మెంట్

ఫుట్‌బాల్ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని సునీల్ ఛెత్రీ సుమారు 10 నిమిషాల నిడివి ఉన్న ఇదే వీడియోలో చెప్పడం విశేషం. 19 ఏళ్ల పాటు ఇండియన్ ఫుట్‌బాల్ కు అతడు సేవలందించాడు. ఇన్నేళ్లలో దేశం కోసం ఇన్ని మ్యాచ్ లు ఆడతానని తాను కలలో కూడా ఊహించలేదని ఈ సందర్భంగా ఛెత్రీ చెప్పాడు. కువైట్ తో జరగబోయే మ్యాచే నా కెరీర్లో చివరిది అని అతడు తెలిపాడు.

రెండు దశాబ్దాలుగా ఇండియన్ ఫుట్‌బాల్ తో విడదీయలేని పేరు సునీల్ ఛెత్రీ. ఈ ఫార్వర్డ్ ప్లేయర్.. దేశవాళీ మ్యాచ్ లలోనే కాదు అంతర్జాతీయంగా కూడా రాణించాడు. 19 ఏళ్ల కిందట ఎక్కడైతే ఇండియా తరఫున తొలి మ్యాచ్ ఆడాడో అదే కోల్‌కతాలో కువైట్ తో తన చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ రౌండ్ 3 బెర్త్ దక్కాలంటే కువైట్ తో మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిన అసవరం ఉంది.

గ్రూప్ ఎలో ఇండియా రెండో స్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్ లలో నాలుగు పాయింట్లు సాధించింది. ఈ గ్రూప్ చివరి మ్యాచ్ లో ఖతార్ తో వాళ్ల స్వదేశంలో ఆడనుంది. ప్రతి గ్రూపులో రెండేసి జట్లు ముందడుగు వేస్తాయి.

ఆ రోజు ఎప్పటికీ మరచిపోలేను

ఇండియా తరఫున తాను ఆడిన తొలి మ్యాచ్ ను ఎప్పటికీ మరచిపోలేనని ఈ వీడియోలో సునీల్ ఛెత్రీ చెప్పాడు. తొలి మ్యాచ్ లోనే తాను గోల్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. తాను తొలిసారి ఇండియా జెర్సీ వేసుకునే ముందు తెలియకుండానే తాను దానిపై పర్ఫ్యూమ్ కొట్టానని కూడా చెప్పాడు. ఇప్పుడు చివరి మ్యాచ్ ఆడబోతున్న సందర్భంగా కెరీర్లో ప్రతి క్షణం గుర్తుకు వస్తోందని తెలిపాడు.

"ఈ మ్యాచ్ నాకు చివరిది అని నాకు నేను చెప్పుకున్న సమయంలో ప్రతి విషయం గుర్తుకు వచ్చింది. ఆ మ్యాచ్, ఆ కోచ్, ఈ మ్యాచ్, ఈ టీమ్.. ఇలా అన్నీ గుర్తుకు రావడం వింతగా అనిపించింది. అన్నీ గుర్తుకు వచ్చాయి. దీంతో నేను తుది నిర్ణయం తీసుకున్నాను" అని ఆ వీడియోలో సునీల్ ఛెత్రీ చెప్పాడు.

సునీల్ ఛెత్రీ కెరీర్ ఇలా..

2002లో మోహన్ బగాన్ జట్టుతో సునీల్ ఛెత్రీ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత 2010లో యూఎస్ఏ కన్సాస్ సిటీ విజార్డ్స్ తో, 2012లో పోర్చుగల్ కు చెందిన స్పోర్టింగ్ సీపీ రిజర్వ్స్ జట్టుకూ ఆడాడు. ఇక ఇండియాలో ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్స్ అయిన ఈస్ట్ బెంగాల్, డెంపో, ముంబై సిటీ ఎఫ్‌సీ, బెంగళూరు ఎఫ్‌సీలకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.

మొత్తంగా ఇప్పటి వరకూ సునీల్ ఛెత్రీ 150 అంతర్జాతీయ మ్యాచ్ లలో 94 గోల్స్ చేశాడు. ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్‌బాల్ లో రొనాల్డో, మెస్సీ తర్వాత అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ ఛెత్రీయే కావడం విశేషం. అతడు జట్టులో ఉండగానే ఇండియా నెహ్రూ కప్ ను మూడుసార్లు, సాఫ్ ఛాంపియన్షిప్ మూడుసార్లు గెలిచింది. ఇక 2008లో ఏఎఫ్‌సీ ఛాలెంజ్ కప్ ఇండియా గెలవడంలోనూ ఛెత్రీదే కీలకపాత్ర.

2005లో పాకిస్థాన్ తో మ్యాచ్ లో తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు సునీల్ ఛెత్రీ. ఆ మ్యాచ్ లోనే తొలి గోల్ చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ, క్లబ్ మ్యాచ్ లు కలుపుకుంటే.. ఛెత్రీ 515 మ్యాచ్ లలో 252 గోల్స్ చేశాడు. 2022లో ఛెత్రీ ఘనతలను గౌరవిస్తూ ఫిఫా అతని పేరిట కెప్టెన్ ఫెంటాస్టిక్ అనే టైటిల్ తో ఓ డాక్యుమెంటరీ కూడా రూపొందించింది.