Sunil Chhetri on Messi: నేను మెస్సీ, రొనాల్డో కంటే చాలా బెటర్: సునీల్ ఛెత్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Sunil Chhetri on Messi: నేను మెస్సీ, రొనాల్డో కంటే చాలా బెటర్ అని అన్నాడు టీమిండియా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రీ. ఈ మధ్యే ఇండియన్ టీమ్ శాఫ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన విషయం తెలిసిందే.
Sunil Chhetri on Messi: ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అయిన లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోల కంటే తాను బెటర్ అని అతడు అనడం విశేషం. ఈ మధ్యే ఇండియాకు శాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించి పెట్టిన ఛెత్రీ.. ఈ విజయంపై కూడా స్పందించాడు.
అంతర్జాతీయంగా అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్స్ లిస్టులో సునీల్ ఛెత్రీ టాప్ 10లో ఉన్నాడు. ఈ లిస్టులో లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలాంటి ప్లేయర్స్ సరసన ఛెత్రీ ఉండటం విశేషం. వాళ్లతో తనను తాను పోల్చుకోననని చెబుతూనే.. జాతీయ జట్టుకు ఆడే విషయంలో మాత్రం తాను వాళ్ల కంటే బెటర్ అని ఛెత్రీ అన్నాడు.
ఆ విషయంలో మెస్సీ, రొనాల్డో కంటే బెటర్
"ఆ లిస్టులో ఉన్న మిగతా 9 మందితో ఎలాంటి పోలికా లేదు. అంటే మిగతా అందరు అభిమానుల్లాగే నేను రొనాల్డో, మెస్సీలాంటి ప్లేయర్స్ కు అభిమానిని. వాళ్లతో అసలు పోలికే లేదు. ఈ జాబితాను నేను అంతగా సీరియస్ గా తీసుకోను. కానీ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే విషయంలో మాత్రం నేను వాళ్ల కంటే కూడా చాలా బెటర్" అని సునీల్ ఛెత్రీ అన్నాడు.
శాఫ్ ఛాంపియన్‌షిప్ విజయంపై స్పందిస్తూ.. "టోర్నీ మొత్తం మాకు మద్దతుగా నిలిచారు. నిజానికి ఇండియ సెమీఫైనల్, ఫైనల్ ఆడిన లెబనన్, కువైట్ శాఫ్ సభ్య దేశాలు కావు. వాళ్లను ఆహ్వానించారు. అవి రెండూ చాలా మంచి టీమ్స్. వాళ్లను ఓడించడం చాలా గొప్పగా అనిపిస్తోంది" అని ఛెత్రీ అన్నాడు.
నెక్ట్స్ టార్గెట్ ఆసియా కప్
తమ తర్వాతి లక్ష్యం ఆసియా కప్ అని ఛెత్రీ అన్నాడు. "మాకు ఆసియా కప్పే వరల్డ్ కప్ లాంటిది. మా లిస్టులో టాప్ లో ఉంటుంది. అందుకే ఆ టోర్నీలో అత్యుత్తమంగా ఆడాలని అనుకుంటున్నాం. ప్లేయర్స్ పై ఒత్తిడి పెంచాలని అనుకోవడం లేదు కానీ ప్రతిసారీ ఆసియా కప్ కు క్వాలిఫై కావాలని అనుకుంటున్నాం" అని ఛెత్రీ చెప్పాడు.
సునీల్ ఛెత్రీ పదేళ్లుగా ఇండియన్ టీమ్ కెప్టెన్ గా ఉన్నాడు. కెప్టెన్ గా, వ్యక్తిగతంగా అతని రికార్డులు అద్భుతం. అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్స్ టాప్ 10లో ఛెత్రీ ఉండటం మామూలు విషయం కాదు.
సంబంధిత కథనం