R Praggnanandhaa: వరల్డ్ నంబర్ వన్‌కు షాకిచ్చిన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద - నార్వే టోర్నమెంట్‌లో సంచలనం
R Praggnanandhaa: నార్వే చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. మూడో రౌండ్‌లో వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను చిత్తుచేశాడు. మెన్స్ విభాగంలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు.
R Praggnanandhaa: నార్వే చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. చెస్ వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను మట్టికరిపించాడు. కార్ల్‌సన్ సొంత గడ్డపై అతడిని ఓడించి రికార్డ్ నెలకొల్పాడు. నార్వే చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్‌లో బుధవారం వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో ప్రజ్ఞానంద పోటీపడ్డాడు. ఈ మ్యాచ్‌లో తెల్ల పావులతో ప్రజ్ఞానంద బరిలో దిగాడు.
ఒత్తిడిని జయిస్తూ...
ఆరంభంలో ప్రజ్ఞానందపై కార్ల్‌సన్ ఆధిపత్యం కనబరిచాడు. ఒత్తిడిని జయిస్తూ అద్భుతంగా ఆడిన ప్రజ్ఞానంద కార్ల్‌సన్ చేసిన తప్పులను ఉపయోగించుకుంటూ మ్యాచ్‌లో విజయం సాధించాడు. 37 ఎత్తుల్లోనే కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద ఓడించాడు. . ప్రజ్ఞానంద ఎత్తులను కార్ల్‌సన్ ఊహించలేకపోయాడు.
కార్ల్‌సన్‌పై విజయంతో మూడో రౌండ్ ముగిసే సరికి నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద తొమ్మిదికిగాను 5.5 పాయింట్లు సాధించి పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఈ ఓటమితో కార్లసన్ ఐదో స్థానానికి పడిపోయాడు.
గత ఏడాది వరల్డ్ కప్‌లో...
గత ఏడాది చెస్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలోనే ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. వరల్డ్ కప్ ఓటమికి నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌తో క్లాసికల్ చెస్‌లో మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించిన నాలుగో ఇండియన్ ప్లేయర్‌గా ప్రజ్ఞానంద రికార్డ్ సృష్టించాడు.
నాలుగో రౌండ్‌లో ప్రజ్ఞానంద నాకమురతో తలపడనున్నాడు. ప్రస్తుతం వరల్డ్ చెస్ ర్యాకింగ్స్‌లో మాగ్నస్ కార్ల్‌సన్ నంబర్ వన్ ప్లేస్‌లో ఉండగా...ఆర్ ప్రజ్ఞానంద 14 ర్యాంక్‌లో కొనసాగుతోన్నాడు.
ప్రజ్ఞానంద సోదరి కూడా...
నార్వే చెస్ టోర్నమెంట్‌లో మెన్స్, ఉమెన్స్ రెండు విభాగాల్లో ఇండియన్ ప్లేయర్స్ టాప్‌లో నిలవడం గమనార్హం. ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా నార్వే చెస్ టోర్నమెంట్‌లో అదరగొడుతోంది. ఉమెన్స్ విభాగంలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ప్రజ్ఞానందతో పాటు సమంగా ఆమె కూడా 5.5 పాయింట్లను దక్కించుకోవడం గమనార్హం. ఆ నార్వే చెస్ టోర్నమెంట్‌లో నిలిచిన విజేతకు లక్ష అరవై వేల డాలర్లు (కోటి 30 లక్షలు) వరకు ప్రైజ్ మనీ దక్కే అవకాశం ఉంది.
టాపిక్